Vizag Desalination Plant:  ఏపీలో ప్రధాన నగరంగా ఉన్న విశాఖలో తాగునీటి సమస్యను పరిష్కరించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. నగరంలో డీశాలినేషన్‌ ప్లాంట్ నిర్మాణాన్ని చేపట్టనుంది. ఎప్పటి నుంచో ఉన్న ఈ ప్రణాళికను కార్యరూపంలోకి తీసుకురావడానికి గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ -GVMC కీలక నిర్ణయం తీసుకుంది. రూ. 1,200 కోట్ల వ్యయంతో 100 ఎంఎల్‌డి (మెగాలిటర్స్ పర్ డే) సామర్థ్యం గల డిశాలినేషన్ ప్లాంట్‌ను నిర్మించడానికి ప్రణాళికలను వేగవంతం చేస్తోంది. ఈ ప్రాజెక్టు ప్రధానంగా పారిశ్రామిక అవసరాలను తీరుస్తుంది, తద్వారా గృహావసరాలకు కేటాయించే నీటిపై ఒత్తిడి తగ్గుతుంది.

వైజాగ్ లో ప్లాంట్ పెడుతున్న ఇజ్రాయెల్ సంస్థ

ఈ ప్రాజెక్టును పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) మోడల్‌లో చేపట్టనున్నారు. ప్రైవేట్ కంపెనీలు నిధులు సమకూర్చగా, జీవీఎంసీ భూమిని, ఇతర నిర్మాణ సహకారాన్ని అందిస్తుంది. ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలను, చర్చించడానికి జీవీఎంసీ, ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ (APUIAML), మరియు ఇజ్రాయెల్‌కు చెందిన ఐడిఈ టెక్నాలజీస్ అధికారులు సమావేశమయ్యారు. త్వరలోనే ప్లాంట్‌ నిర్మాణానికి సంబంధించి RFP (Request for Proposal) జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. దాదాపు 25 ఎకరాల స్థలంలో ఈ ప్లాంట్‌ను నిర్మించనున్నారు. కొన్నాళ్ల పాటు వాళ్లు నిర్వహించిన తర్వాత దానిని ప్రభుత్వానికి బదలాయించే BOT ప్రక్రియలో చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టును గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టుగా చేపట్టాలన్న ఆలోచన కూడా ఉంది. అందుకే దీనికి అవసరమైన 20 మెగావాట్ల విద్యుత్‌ను  సోలార్ గ్రిడ్ ద్వారా సరఫరా చేయాలని జీవీఎంసీ యోచిస్తోంది.  విశాఖ సమీపంలోని అప్పికొండ లేదా పూడిమడక దగ్గర దీనిని ఏర్పాటు చేసే అవకాశం ఉంది.  IED  టెక్నాలజీస్ సంస్థ ముంబైలో 400 ఎంఎల్‌డి, తమిళనాడులో 60 ఎంఎల్‌డి డిశాలినేషన్ ప్లాంట్‌లను విజయవంతంగా నిర్మించిన అనుభవం కలిగి ఉంది.

పెరుగుతున్న పారిశ్రామిక అవసరాలు

విశాఖపట్నంలో పరిశ్రమల అవసరాలు పెరుగుతున్నాయి. కొత్త పరిశ్రమల ఏర్పాటు, విస్తరణతో పారిశ్రామిక అవసరాలకే ప్రతిరోజూ 500-600MLDల నీరు అవసరం అయిన పరిస్థితి. అందుకని  ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా పరిశ్రమలకు నీటిని ఇచ్చి ఆ మేరకు గృహ అవసరాలపై ఒత్తిడిని తగ్గించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. విశాఖకు దగ్గరలో భారీ నీటి వనరులు లేవు. ప్రస్తుతం దగ్గరలోని మేఘాద్రి గడ్డ, ముడసర్లోవ, తాడిపూడి, రైవాడ వంటి జలాశయాలనుంచే నీరు వస్తోంది. పోలవరం పూర్తైతే.. ఎడమకాలువ ద్వారా వైజాగ్‌కు తాగునీరు చేరుతుంది.  ఈ లోగా పారిశ్రామిక అవసరాలకు కావలసిన నీటి సముద్ర నీటి శుద్ది ప్రాజెక్టుపై దృష్టి పెడుతున్నారు.