Andhra Pradesh: విశాఖలోని ఎండాడలో ఉన్న వైసీపీ కార్యాలయానికి కూడా ప్రభుత్వాధికారులు నోటీసులు ఇచ్చారు. జీవీఎంసీ అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టారని నోటీసుల్లో పేర్కొన్నారు. వారం రోజుల్లో దీనిపై వివరణ ఇవ్వాలని గడువు ఇచ్చారు. 


సరైన అనుమతు లేకుండా నిర్మించారన్న కారణంతో తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని పడగొట్టేశారు సీఆర్డీఏ అధికారులు. ఆ షాక్‌లో ఉన్న వైసీపీకి మరో షాక్‌ తగిలింది. వైజాగ్‌లో నిర్మించిన కార్యాలయం కూడా అక్రమంగా నిర్మించిందేనంటూ అధికారులు నోటీసులు ఇచ్చారు. 


ఎండాడలోని సర్వే నంబర్ 175/4లో 2ఎకరాల స్థలంలో వైసీపీ కార్యాలయాన్ని నిర్మించింది. దీనికి ఎలాంటి అనుమతులు లేవని అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జీవీఎంసీ అధికారులను స్కిప్ చేసి నేరుగా వీఎంఆర్డీఏకు దరఖాస్తు చేశారు. అక్కడ కూడా సరైన అనుమతులు రాకుండానే నిర్మాణాలు పూర్తి చేశారు. 


దీనిపైనే జీవీఎంపీ అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతు లేకుండా భవనాలు ఎలా నిర్మించారని ప్రశ్నిస్తున్నారు. ఇన్ని రోజులు ఆ పార్టీ అధికారంలో ఉన్నందున సైలెంట్‌గా ఉన్న అధికారులు ఇప్పుడు లెక్కల చిట్టా విప్పుతున్నారు.


విశాఖలో నిర్మించిన భవనానికి సంబంధించిన అనుమతులు, ఇతర విషయాలపై జీవీఎంసీ అధికారులు వివరణ కోరారు. దీనికి వారం రోజులు గడువు ఇచ్చారు. వారంరోజుల్లో వివరణ ఇవ్వకపోయినా, స్పందించకపోయినా తదుపరి చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొన్నారు అధికారులు. 


ఈ నోటీసులు తీసుకునేందుకు ఆ కార్యాలయంలో ఎవరూ లేకవపోవడంతో అక్కడ అతికించి వెళ్లిపోయారు అధికారులు. జోన్‌ 2 టౌనింగ్ ప్లానింగ్ అధికారులు ఈ నోటీసులు జారీ చేశారు. ఆఫీస్‌ గోడపై అతికించి వెళ్లిపోయారు.