Visakhapatnam News: వైఎస్ఆర్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కుమార్తెకు సంబంధించిన కాంక్రీటు నిర్మాణాను జీవీఎంసీ అధికారులు కూల్చేశారు. విజయసాయి కుమార్తె నేహా రెడ్డి నిబంధనలు అతిక్రమించి కొన్ని నిర్మాణాలు చేపట్టినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. భీమిలి తీరంలో నేహా రెడ్డి సీఆర్‌జెడ్‌ నిబంధనలకు విరుద్ధంగా కొన్ని  అక్రమ నిర్మాణాలు చేశారు. ఇవి ఒక హోటల్ నిర్మించేందుకు చేపట్టినట్లు తెలిసింది. దీంతో భీమిలి జోన్‌ టౌన్ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ బి. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సిబ్బంది ఉదయం 7 గంటల నుంచి బీచ్‌ ఒడ్డున హోటల్‌ కోసం వేసిన కాంక్రీట్‌ పిల్లర్స్‌, గోడలు, ఇతర నిర్మాణాలను తొలగించారు. కూల్చివేతల సందర్భంగా భీమిలి పోలీసులు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. 


ఈ తొలగింపు ప్రక్రియను ఎవరూ అడ్డుకోకపోవడంతో సజావుగా జరిగిపోయింది. తొలగింపు పూర్తయ్యే సరికి సాయంత్రం అయింది. వైఎస్ఆర్ సీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీ ముఖ్య నేతగా ఉన్న విజయసాయి రెడ్డి ఉత్తరాంధ్ర ఇంఛార్జి బాధ్యతలు చూసేవారు. ఇక్కడి భూములను పెద్ద స్థాయిలో ఆక్రమించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే విజయసాయి రెడ్డి కుమార్తె అక్రమాలపై జనసేన కార్పొరేటర్‌ మూర్తి యాదవ్‌, మరికొందరు కూటమి పార్టీలకు నేతలు కోర్టుకు వెళ్లారు. 


దీనిపై విచారణ చేపట్టిన కోర్టు భీమిలి బీచ్ లో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నట్లు ధ్రువీకరించింది. వీటిని వెంటనే తొలగించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మేరకు అధికారులు తొలగింపు ప్రక్రియను చేపట్టారు. కూల్చివేతల పట్ల విశాఖపట్నం నగరవాసులు ఆనందం వ్యక్తం చేశారు.