Gvl Narasimharao Contest As Vishaka Mp : విశాఖపట్నం ఎంపీ స్థానం నుంచి బరిలోకి దిగేందుకు భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహరావు జోరుగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా పోటీ చేసినా, ఒంటిరిగా పోటీ చేసినా ఇక్కడి నుంచి బరిలో దిగేందుకు ఆయన సన్నాహాలు చేసుకుంటున్నారు. గడిచిన నాలుగేళ్ల నుంచి విశాఖ వేదికగానే ఆయన రాజకీయ కార్యాకలాపాలను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతి సంబరాలు పేరుతో భారీ ఎత్తున పండగను నిర్వహించారు. గణతంత్ర దినోత్సవ వేడుకలను బీచ్‌ రోడ్డులో జీవీఎల్‌ ఆధ్వర్యంలో రెండురోజులపాటు ఉత్సాహ భరిత వాతావరణంలో నిర్వహించారు. ఇవన్నీ నిర్వహించడం వెనుక వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్‌ స్థానానికి జీవీఎల్‌ పోటీ చేయడమేనని చెబుతున్నారు. ఇందుకు కేంద్ర అధినాయకత్వం కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు చెబుతున్నారు. పొత్తు కుదిరితే ఉమ్మడి అభ్యర్థిగా విశాఖ నుంచి ఆయన బరిలో ఉంటారు. పొత్తు లేకపోయినా పోటీ చేసేందుకు ఆయన సన్నాహాలు చేసుకుంటున్నారు. 


పురందేశ్వరికి ప్రత్యామ్నాయ సీటు!


టీడీపీ, జనసేనతో పొత్తు ఉంటే బీజేపీ నుంచి విశాఖ పార్లమెంట్‌ స్థానం నుంచి బరిలో దిగాలని మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి భావించారు. కానీ, జీవీఎల్‌ ఇక్కడ ముందుగానే కర్చీప్‌ వేయడం, దానికి అధినాయకత్వం నుంచి కూడా కొంత వరకు మద్ధతు ఉండడంతో ఆమె పునరాలోచనలో పడినట్టు చెబుతున్నారు. పొత్తు ఉంటే విశాఖ నుంచి పోటీ చేసేందుకు తుది వరకు ప్రయత్నించాలని ఆమె భావిస్తున్నారు. ఒకవేళ కాని పక్షంలో మరో చోట నుంచి పోటీ చేయనున్నారు. ఇందుకోసం మెరుగైన ఎంపీ సీటును ఆమె వెతికే పనిలో ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. పొత్తుకు ఓకే అయితే బీజేపీకి ఐదు నుంచి ఏడు ఎంపీ స్థానాలు ఇచ్చే అవకాశముందని చెబుతున్నారు. ఈ జాబితాలో విజయవాడ, విశాఖ, రాజమండ్రి, రాజంపేటతోపాటు మరికొన్ని పార్లమెంట్‌ స్థానాలు ఉన్నట్టు చెబుతున్నారు. 


క్షేత్రస్థాయిలో జీవీఎల్‌ నరసింహరావు


బీజేపీ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని భావించిన జీవీఎల్‌ నరసింహరావు ముందు నుంచే ఆ దిశగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. స్టీల్‌ప్లాంట్‌ కోసం పార్లమెంట్‌లో చర్చ లేపడం, రైల్వే జోన్‌ గురించి మాట్లాడడం, స్థానికంగా ఉన్న సమస్యలపై పార్లమెంట్‌ వేదికగా ప్రస్తావించడంతోపాటు స్తానికంగా ఉండే కీలక వర్గాలతో ఆయన ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ వస్తున్నారు. ఇప్పటికే వివిధ సామాజికవర్గాలకు సంబంధించిన ముఖ్య నాయకులతో సమావేశాలు నిర్వహించారు. అసోసియేషన్లు, యూనియన్లతోనూ సత్సంబంధాలను నెరపుతూ వస్తున్నారు. విశాఖలో భారీగా ఉన్న ఉత్తరాది ఓటర్లు, ప్రధాని మోదీ మానియా, ఇతర అంశాలు తనకు కలిసి వస్తాయని ఆయన అంచనా వేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి విజయం సాధించి మరోసారి పార్లమెంట్‌లో అడుగుపెడతానని ఆయన సన్నిహితులు వద్ద చెబుతుండడం గమనార్హం.