విశాఖ నగరం చుట్టుపక్కల ఒక సెంటు ఇళ్ల స్థలాల పంపిణీకి అడ్డంకి తొలగిపోయింది. గత కొంతకాలంగా కోర్టులో కేసులు పెండింగ్ ఉన్న నేపథ్యంలో వాటి పంపిణీ ఆగిపోయింది. స్థానిక రైతుల్లో కొందరు తాము సాగు చేసుకుంటున్న భూములను ప్రభుత్వం తీసుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టుకు వెళ్లారు. ఈ పరస్థితిలో ప్లాట్ల పంపిణీకి అడ్డంకి ఏర్పడింది. మొన్న ఏపీ హైకోర్టు వాటిని కొట్టివేయడంతో ప్రభుత్వానికి ఊరట లభించింది.
మొత్తం 6116 ఎకరాలను పేదల ప్లాట్ల కోసం గుర్తించిన ప్రభుత్వం
విశాఖ నగరం చుట్టుపక్కల ఇళ్ల స్థలాల కోసం రెండేళ్ల క్రితం 6116 ఎకరాలను గుర్తించింది ఏపీ ప్రభుత్వం. దానిలో ప్లాట్ల అభివృద్ధి కోసం 3814 ఎకరాలను రెవెన్యూ అధికారులు VRMDAకు అప్పగించారు. దానిలో 3 ఎకరాల్లో అభివృద్ధి పనులు ప్రారంభించారు. మిగిలిన 800ఎకరాలు కొండలతో నిండి ఉంది. వాటిని అభివృద్ధి చేసే ప్రణాళికను ఇంకా రూపొందించలేదు. ఈ లోపు కొంతమంది కోర్టుకు వెళ్లడంతో అప్పటి నుంచి ఇక్కడ ప్లాట్లను డెవెలప్ చేసే ప్రక్రియ ఆగిపోయింది.
మొత్తం లబ్దిదారుల సంఖ్య 1,76,282 మంది
విశాఖ నగరంలో సెంటు ప్లాట్ల పంపిణీ చేయడానికి గుర్తించిన అర్హుల సంఖ్య 1,78,282 మంది అని అధికారులు చెబుతున్నారు. వీరి కోసం విశాఖ చుట్టుపక్కల ఉన్న ఆనందపురంలో 1104 ఎకరాలు, భీమిలిలో 486 ఎకరాలు, సబ్బవరం 1373 ఎకరాలు,పెందుర్తిలో 495 ఎకరాలు, పద్మనాభంలో 515 ఎకరాలు, అనకాపల్లిలో 1452 ఎకరాలు, పరవాడలో 343, విశాఖ గ్రామీణంలో 96, గాజువాకలో 88, పెద గంట్యాడలో 59 ఎకరాలను అధికారులు గుర్తించారు. ఈ పది మండలాల్లోని భూముల్లో 3వేల ఎకరాల్లో ప్లాట్ల అభివృద్ధి పనులు మొదలెట్టారు. అయితే ఆ పనులన్నీ అసంపూర్తిగానే మిగిలిపోయాయి. గత రెండేళ్లుగా కోర్టు కేసుల్లో ఉండిపోవడంతో ఈ స్థలాలన్నీ తిరిగి పొదలతో నిండి పోయాయి. అలాగే అప్పట్లో నాటిన సరిహద్దు రాళ్లుకూడా ఆనవాలు లేకుండా పోయాయి.
కోర్టు తీర్పుతో తిరిగి మొదలుకానున్న పనులు
హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ మూడు వేల ఎకరాల్లో నిలిచిపోయిన పనులను వెంటనే మొదలు పెడతామని అధికారులు చెబుతున్నారు . అదే జరిగితే విశాఖలోని లబ్దిదారులకు త్వరలోనే ప్లాట్ల కష్టాలు తొలిగినట్లే.