గంగవరం పోర్టు కార్మికులకు...యాజమాన్యానికి మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయ్. నేటి నుంచి విధుల్లోకి చేరడానికి కార్మికులు అంగీకారం తెలిపారు. కార్మికులకు ప్రతి యేటా ఇచ్చే ఇంక్రిమెంట్ 5.26శాతంతో పాటు అదనంగా 15వందలు ఇవ్వడానికి పోర్టు యాజమాన్యం అంగీకరించింది. పది వేల బోనస్ తో పాటు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతే...మృతుల కుటుంబాలకు 25 లక్షలు నష్ట పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది.
స్పెన్షన్ కు గురయిన ఐదుగురు కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవడానికి ఒప్పుకుంది. 509 మంది కార్మికులకు...సమ్మెకాలంలోనే 22 రోజులవేతనం చెల్లించడానికి కూడా పోర్టు యాజమాన్యం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 25లక్షల రూపాయల ప్రమాద బీమా వర్తింపు, నాలుగు కార్పొరేట్ ఆస్పత్రులతో వైద్య సేవలు కల్పించనుంది పోర్టు యాజమాన్యం. సమ్మె సమయంలో 22రోజులకు వేతనం చెల్లించడమే కాకుండా కార్మికులకు మేజర్ హాస్పిటల్లో మెడికల్ ఫెసిలిటీ కల్పించనుంది.
గత జూన్ నుంచే గంగవరం పోర్టు ఉద్యోగులు నిరసన బాట పట్టారు. విశాఖపట్నంలో తమ సహచరులను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ... గంగవరం పోర్టు కార్మికులు ఆందోళన చేపట్టారు. సహచరులను సస్పెండ్ చేసినందుకు యాజమాన్యానికి వ్యతిరేకంగా... సీఐటీయూ, గంగవరం పోర్టు వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నాలు చేసింది. సమస్యల పరిష్కారం కోరుతూ ఆందోళనలు చేసిన కార్మికులు...గత నెల 17న గో బ్యాక్ అదానీ.. అంటూ సమర శంఖం పూరించారు. అఖిలపక్ష కార్మిక సంఘాలతో కలిసి చలో అదానీ గంగవరం పోర్టు ముట్టడి కార్యక్రమం చేపట్టారు. ఉదయం పెదగంట్యాడలోని దీక్షా శిబిరం నుంచి పెద్ద ఎత్తున కార్మికులు, అఖిలపక్ష నాయకులు ర్యాలీగా పోర్టు గేటుకు బయలుదేరగా.. పోలీసులు ఎక్కడికక్కడ ఇనుపకంచెలు, బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుని... కొందరికి గాయాలయ్యాయి. ఆర్డీఓ హుస్సేన్‌సాహెబ్ కార్మికుల తరఫున పోర్టు యాజమాన్యంతో చర్చలు జరిపి 5 రోజుల గడువు కోరడంతో...అదే రోజు సాయంత్రానికి ఆందోళనకారులు శాంతించారు.
పోర్టు నిర్మాణానికి స్థానికంగా ఉన్న గ్రామాల ప్రజలు భూములు ఇచ్చారు. భూములు ఇచ్చిన కుటుంబాలకు పోర్టులో ఉద్యోగం కల్పించారు. పోర్టులో ఉద్యోగం చేస్తున్న వారికి కనీస వేతనాలు అమలు చేయకపోవడంపై కార్మికులు ఆగ్రహించారు. తమకు కనీసంగా నెలకు రూ. 36,500 చెల్లించాలని కార్మికులు డిమాండ్ చేశారు. వివిధ రూపాల్లో కార్మికులు ఆందోళనలు చేసిన తర్వాత...పోర్టు యాజమాన్యం దిగివచ్చింది. కార్మికుల విధించిన డిమాండ్లపై ఇవాళ మరోసారి చర్చలు జరిగాయ్. గంగవరం పోర్టు యాజమాన్యం కార్మికుల డిమాండ్లకు సానుకూలంగా స్పందించింది. పది వేల బోనస్ తో పాటు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతే...మృతుల కుటుంబాలకు 25 లక్షలు నష్ట పరిహారం ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. సస్పెన్షన్ కు గురయిన ఐదుగురు ఉద్యోగులను...తిరిగి విధుల్లోకి తీసుకోవడానికి ఒప్పుకుంది.