Visakhapatnam Araku Train News | విశాఖపట్నం నుంచి అరకు వెళ్లే ప్రయాణికులకు ఇండిపెండెన్స్ డే సందర్భంగా రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. ఆగస్టు 15 నుంచి వరుస సెలవులు వస్తున్న సందర్భంగా అరకు వెళ్లే టూరిస్టులు సంఖ్య పెరుగుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని విశాఖపట్నం -కిరండోల్ వెళ్లే ప్యాసింజర్ నెంబర్ 58501 ట్రైన్ కు అదనంగా ఒక థర్డ్ ఏసి ఎకానమీ కోచ్ ను ఏర్పాటు చేసింది. ఈరోజు అంటే ఆగస్టు 15 నుండి 31 ఆగస్టు 2025 వరకూ ప్రయాణికులకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఇదే ట్రైన్ తిరుగు ప్రయాణంలో 58502 నెంబర్ తో ప్రయాణిస్తుంది.
విశాఖపట్నం అరకు రైలు ప్రయాణం ఒక అద్భుతం
విశాఖపట్నం నుండి అరకు వెళ్లే రైల్వే ప్రయాణం కళ్లారా చూసి తీరాల్సిన ఒక అద్భుతంగా టూరిస్టులు చెబుతూ ఉంటారు. ఉదయం 6:45కు విశాఖలో బయలుదేరే ఈ ట్రైన్ ఉదయం 11 గంటలకు అరకు చేరుకుంటుంది. మార్గ మధ్యలో మర్రిపాలెం,సింహాచలం, కొత్తవలస శృంగవరపుకోట, బొడ్డవర,చిమిడిపల్లి,షిమిలి గూడ, బొర్రా గుహలు వంటి స్టేషన్ లలో ఆగుతుంది.
ఈ ప్రయాణంలో బొడ్డవర నుండి పూర్తి ఘాటి రూట్ ప్రారంభమవుతుంది. పొడవైన గుహలు, చూస్తే కళ్ళు తిరిగే లోయలు, ఎత్తైన కొండలు, పారే జలపాతాల మీదుగా విశాఖ కిరం డోల్ రైల్లో ప్రయాణించడం ఒక ప్రత్యేక అనుభూతి. దానిని దృష్టిలో పెట్టుకునే టూరిస్టులకు ఈ అదనపు కోచ్ అవకాశం కల్పించినట్టు ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేరు డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ సందీప్ ఒక ప్రకటనలో తెలిపారు