AP Politics: రాష్ట్రంలో అందరూ చూపు టెక్కలి నియోజకవర్గం పైనే ఉంది. ఈ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కింజరాపు అచ్చం నాయుడు ఓటమే ప్రధాన లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అప్పటినుండే పావులు కదుపుతున్నారు. దీంతో ఇప్పుడు నియోజకవర్గంపై మరోసారి అందరి చూపు మళ్లింది. వైసీపీ అభ్యర్థిగా దువ్వాడ శ్రీనివాస్ కు అ పార్టీ టికెట్ కేటాయించింది, సమన్వయకర్తగా ప్రకటించడంతో, వీరిద్దరి మధ్య పోటీ రేపటి ఎన్నికల్లో జరగనుంది.


గతంలో ఒకసారి దువ్వాడ పోటీ చేసి ఓటమి చవి చూశారు. ఎంతో బలమైన నియోజకవర్గంగా తెలుగుదేశం పార్టీకి అండగా ఈ సెగ్మెంట్ ఉంది. ఈసారి ఎలాగైనా సరే కింజరాపు కోటను బద్దలు కొట్టాలని వైసీపీ కలలుగంటోంది. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 18 నెలల క్రితమే దువ్వాడను మీ చేతిలో పెడుతున్నట్టు ఆనాటి బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రకటించారు. ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రంలో ప్రకటించిన మొట్టమొదటి నియోజకవర్గం టెక్కలి కావడం విశేషం. తర్వాత దువ్వాడ కుటుంబంలో ఎన్నో ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నా, చివరకు దువ్వాడ శ్రీనుకే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు వస్తున్నాయి.


సహజంగా దురుసు స్వభావంతో అచ్చం నాయుడు పై విమర్శలను ఎక్కువ పెట్టడం దువ్వాడకు కష్టమైన పని కాదు. ఒంటికాలుపై లేచిన ఎన్నో సందర్భాలు ఉన్నాయి. అచ్చన్నపై ఘాటైన విమర్శలు చేస్తూ ముఖ్యమంత్రి దృష్టిలో చాలా సార్లు దువ్వాడ పడ్డారు. గత ఎన్నికల్లో దువ్వాడను పార్లమెంట్ కి పోటీ చేయించి, పార్లమెంట్ సభ్యుడు కింజరాపు రామ్మోహన్ ను చెక్ పెట్టాలని ప్రయత్నించారు. కాని ఆ ఎన్నికల్లో దువ్వాడ స్వల్ప తేడాతో ఓటమి చవి చూశారు. ఫలితంగా శ్రీనుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ప్రోత్సహించారు. అప్పటినుండి నియోజకవర్గంలో పట్టు సాధించే ప్రయత్నంలో అనేక ఎత్తు పల్లాలు ఎక్కారు. మూలపేట పోర్టు నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషిస్తూ, ముఖ్యమంత్రికి అంతరంగికుడిగా వ్యవహరిస్తున్నారు.


సహజంగా ఈ నియోజకవర్గం విభజనలో ఏర్పడింది. కళింగ సామాజిక వర్గంతో పాటు మిగిలిన సామాజిక వర్గాలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అచ్చెం నాయుడు కుటుంబానికి గతం నుండి అనేక గ్రామాలు మద్దతు పలుకుతూ ఓటింగ్ సరళిని పెంచుకునే వెసులుబాటు కొన్ని గ్రామాలు ఆ కుటుంబానికి పాకెట్స్ గా ఉన్నాయి. అయితే ఇప్పుడు దువ్వాడ దానిపై దృష్టి సారిస్తే తప్ప ఆయనకి విజయ అవకాశాలు తక్కువ.


నాలుగు స్తంభాలాట


నియోజవర్గంలో నాలుగు స్తంభాలాట వైసీపీ పార్టీలో ఎప్పటినుండో ఉంది. పవర్ సెంటర్లుగా మాజీ కేంద్రమంత్రి కృపారాణి, పేరాడతిలక్, చింతాడ గణపతి ఉన్నారు. దువ్వాడ పై వీరెవరు సాఫ్ట్ కార్నర్ లో లేరు. వైసిపి అధిష్టానం కూడా కృపారాణీ నీ పెడచెవిన పెట్టింది. రాజ్యసభ సీటు తనకు వస్తుందని ఆశతో కృపరాణి ఎంతగానో చూశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆమె ఆశలపై నీళ్లు చల్లారు. ఇక చింతాడ గణపతి గౌరవప్రదమైన పోర్టు పోలియేలు కల్పించలేదు. ఈ ఎన్నికల్లో వీరందరూ దువ్వాడ కు సహకరిస్తారా లేదా అనేది కూడా అనుమానమే... మొన్నటివరకు పీకల్లోతు కుటుంబ వివాదాల్లో ఉన్న దువ్వాడకు అన్ని సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడ ఆ పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయాలని అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. రేపటి ఎన్నికల్లో ఆయన గెలిస్తే తప్ప మరో దారి కనిపించడం లేదు. సింహం బోనులో చెయ్యిపెట్టి ఆహారం తీసుకోవడం ఎంత కష్టమో, కింజరాపుకోటలో పాగా వేయడం ఆషామాషీ విషయం కాదు. ఎన్నోసార్లు పరీక్షించి నిరుత్సాహం మూట కొట్టుకున్న దువ్వాడకు మరోసారి అవకాశం లభించింది.