Andhra Pradesh Weather Updates | అమరావతి: ఒడిశాలోని గోపాల్‌పూర్ వద్ద వాయుగుండం తీరం దాటిందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం వాయువ్య దిశగా కదులుతూ ఈ తీవ్ర ఈ వాయుగుండం క్రమంగా బలహీనమవుతోందని పేర్కొంది. అయితే, దీని ప్రభావంతో ఏపీలోని కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఫ్లాష్ ఫుడ్స్ వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, వరద ముప్పు
అల్పపీడనం, వాయుగుండం ప్రభావంతో ఒడిశాలో కురిసిన భారీ వర్షాలతో శ్రీకాకుళం జిల్లాకు వరద పెరిగింది. ఓవైపు వర్షాలు, మరోవైపు వరద నీటితో వంశధార, నాగావళి, బహుదా నదుల్లో నీటిమట్టం పెరుగుతోంది. కొన్ని బ్యారేజీలకు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తీరప్రాంతాల్లో గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచనున్నాయి. మత్స్యకారులు అక్టోబర్ 4 వరకు సముద్రంలో చేపల వేటకి వెళ్లవద్దని సూచించారు. అప్రమత్తమైన అధికారులు గొట్టా బ్యారేజీ నుంచి వంశధార నది నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగావళి నదిలో వరద ప్రవాహం భారీగా పెరుగుతోంది. మహేంద్రతనయ నదిలో నీటి ప్రవాహం పెరగడంతో శ్రీకాకుళం పాతపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్, మహేంద్రనగర్ వీధిలో వరద నీరు చేరడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ అప్రమత్తం చేశారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి భారీ వర్షాలు, వరద పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో సెలవు తీవ్ర వాయుగుండం ఒడిశాలో తీరం దాటినా దాని ప్రభావం ఉత్తరాంధ్రపై ఉంది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల అధికారులు అప్రమత్తం అయ్యారు. ఓవైపు ఎగువన ఒడిశా నుంచి వరద నీరు వచ్చి చేరుతుండగా, ఇటు శ్రీకాకుళంలో జిల్లాలో ఫ్లాష్ ఫుడ్స్ వచ్చే ప్రమాద హెచ్చరికలు జారీ కావడంతో చర్యలు చేపట్టారు. వంశధార నదిలోకి వరద ఎక్కువగా చేరుతుండటం, ఫ్లాష్ ఫ్లడ్ ముప్పు ఉన్నందున శ్రీకాకుళం జిల్లాలోని 10 మండలాల్లోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖాధికారి ఉత్తర్వులు జారీ చేశారు.
శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ఆదేశాలతో నరసన్నపేట, జలుమూరు, ఆమదాలవలస, హిరమండలం, శ్రీకాకుళం, గార, పోలాకి, ఎల్.ఎన్.పేట, కొత్తూరు, సరుబుజ్జిలి మండలాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. భారీ వర్షాల సమయంలో ఇండ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలను అధికారులు హెచ్చరించారు.