సీపీఐ రాష్ట్ర 27వ మహాసభలు శుక్రవారం రోజు విశాఖ వేదికగా ప్రారంభం అయ్యాయి. మూడు రోజులు జరిగే ఈ మహాసభల్లో కీలక విషయాలు చర్చిస్తారు. మొదటి రోజు గురజాడ కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన మహాసభలో కేంద్ర, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా మాట్లాడుతూ... అక్టోబర్  14వ తేదీ నుంచి 18వ తేదీ వరకూ జాతీయ మహాసభలు నిర్వహిస్తామని అన్నారు. దానికి ముందు విశాఖలో పెద్ద ఎత్తున మహాసభలు జరుపుకోవడం ఆనందంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. నేడు రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి ముప్పు వచ్చే పరిస్ధితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. 


ప్రజలు కావాలా.. బీజేపీ కావాలా!


ఆర్.ఎస్.ఎస్ నుంచి ఒక్కరైనా స్వాతంత్య్ర ఉద్యమ చరిత్రలో పాల్గొన్న దాఖలాలు ఉన్నాయా అని రాజా ప్రశ్నించారు. తమిళనాడులో లాగా సెక్యులర్ ప్రోగ్రెసివ్ ఎలయన్స్ ఏర్పడాలని, సీఎం జగన్ ఎందుకు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా గురించి అర్ధించే పరిస్ధితి ఎందుకు వచ్చిందని అన్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్ ను చూసి నేర్చుకోవాలని, స్టాలిన్, నితీష్ మాదిరి నిలబడాలని హితవు పలికారు. ప్రజల పక్షాన ఉండాలో, బీజేపీ వైపు ఉండాలో తేల్చుకోవాలని జగన్ కి సూచించారు. 


ఏపీలో ఉన్నది జగన్ రాజ్యమా, పోలీస్ రాజ్యమా అంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. కుప్పంలో తన నియోజకవర్గానికి చంద్రబాబు వెళ్తే అడ్డుకుంటూ.. మాజీ ముఖ్యమంత్రిపై దౌర్జన్యం చేస్తావా అంటూ సీఎం జగన్ పై  మండిపడ్డారు. విజయవాడకు ఎవ్వరినీ అడుగు పెట్టనివ్వకుండా చేస్తావా అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాడేపల్లి నివాసం నుంచి హెలీపాడ్ దగ్గరకు వెళ్లడానికి 500 మంది పోలీసులు కావాలా అని, టోపీ ఉండటానికే పోలీసులకు తలకాయ ఉందనుకుంటున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో ఇండియన్ పీనల్ కోడ్ ఉందా.. లేదా.. అన్న అనుమానం వస్తోందని అన్నారు. కాకినాడలో సుబ్రహ్మణ్యం శవాన్ని డోర్ డెలివరీ చేస్తారా అని మండిపడ్డారు. సుబ్రహ్మణ్యం హత్యను కాకినాడ ఎస్పీ యాదృచ్ఛికంగా జరిగిందనడం హాస్యాస్పదంగా ఉందని రామకృష్ణ అన్నారు. 


ఎంపీ గోరంట్ల న్యూడ్ వీడియో ఒరిజినల్ కాదా..


ఎంపీ గోరంట్ల మాధవ్ బ్లూ ఫిలిమ్ ఒరిజినల్ కాదని అనంతపురం ఎస్పీ అనడం విడ్డురంగా ఉందన్నారు. కేంద్రాన్ని నిలదీస్తాను, ప్రత్యేక హోదా సాధిస్తాను అని చెప్పిన సీఎం జగన్.. 22 సార్లు ఢిల్లీకి వెళ్లి ఏం చేసుకొచ్చారని విమర్శలు వర్షం కురిపించారు. జగన్ మోడీకి దత్త పుత్రుడని నిర్మలా సీతారామన్ చెపుతారని, ఏపి ప్రయోజనాల కోసం ఒక్క సారైనా మాట్లాడావా అంటూ మండిపడ్డారు. మూడేళ్ల కాలంలో ఏం చేశావో చెప్పాలని వ్యాఖ్యానించారు. ఏపీ ప్రభుత్వం రూ. 8 లక్షల 40 వేల కోట్ల రూపాయ అప్పులో ఉందని, జగన్ గద్దె దిగేసరికి 10 లక్షల కోట్ల అప్పులు ఉంటాయని జోస్యం చెప్పారు. వైసీపీ మూడేళ్ల  పాలనలో ఏపీని దివాలా తీయించావని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురంలో పది వేల కోట్ల విలువైన ఆస్ధిని పావలా ఖర్చు లేకుండా కొట్టేశారని, మద్యం అమ్మకాలతో నెలకు 3వేల కోట్లు వస్తోంటే మద్య పాన నిషేధం  ఎలా అమలవుతుందని మండిపడ్డారు. మోదీ మోచేతి నీళ్లు తాగేవారెవ్వరూ రాష్ట్రానికి మేలు చేయలేరని.. ఇకనైనా రాజకీయాలు మార్పు రావాలన్నారు. 


సుదీర్ఘకాలం బెయిల్ పై ఉన్న వ్యక్తి జగన్: నారాయణ


సుదీర్ఘకాలం బెయిల్ పై ఉన్న వ్యక్తి జగన్ అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. మోడీ ముద్దుల కొడుకు జగన్ పై పలు కేసులు ఉన్నా.. ఇంతకాలం ఎందుకు సహిస్తున్నారని కేంద్రాన్ని ప్రశ్నించారు. డ్రగ్ మాఫియాను పెంచి పోషించే అదానీ నీకు శిష్యుడు అవుతాడా అంటూ మోదీపై విరుచుకుపడ్డారు. అదానీని మోస్తున్న వారు మోదీ, అమిత్ షాలేనని తెలిపారు. పేద ప్రజలకు ఇచ్చే సంక్షేమాలను ఆపేందుకు ఉచితాలపై పునరాలోచిస్తారనడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్నికల కమిషన్ ను పప్పెట్ ను చేసేశారని, శవంపై కూడా 17 శాతం జీఎస్టీ వసూలు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా సమయంలో ఎక్కువ లాభం కార్పొరేట్ ఆసుపత్రులే పొందాయని, వాటన్నింటినీ అదానీకి అప్పగిద్దామని చూస్తున్నారని మండిపడ్డారు. ఆలీ బాబా 43 దొంగలు లాగా జగన్ కి 43 సలహాదారులని ఎద్దేవా చేశారు. విజయవాడ మహాసభలో మోదీ వ్యతిరేక ఫ్రంట్ ను ఆహ్వానిస్తామని, కానీ మోదీతో ఉన్న వారితో యుద్దం తప్పదని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు.