ABP  WhatsApp

Dharmana On Jagan: జగన్‌ది పేదల ప్రభుత్వం- వంశధార నిర్వాసితులకు పరిహారం పంపిణీలో ధర్మాన

ABP Desam Updated at: 24 Jun 2022 08:23 PM (IST)

వంశ‌ధార నిర్వాసితులకు పరిహారం పంపిణీ ప్రారంభమైంది. సుమారు 27 వేల ల‌బ్ధిదారుల‌కు రూ.216.71 కోట్ల సాయం అందనుంది.

పరిహారం పంపిణీ సభలో మాట్లాడుతున్న మంత్రి ధర్మాన

NEXT PREV

వంశ‌ధార నిర్వాసితుల‌ను ఆదుకోవాల‌న్న ఏకైక ఉద్దేశంతో చ‌రిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రాజెక్టుకు ప‌రిహారం మ‌రోసారి చెల్లించిన ఈ ప్రభుత్వం పేద‌ల ప్రభుత్వమని మరోసారి నిరూపించుకుందన్నారు రెవెన్యూ శాఖ మంత్రి ధ‌ర్మాన ప్రసాద‌రావు అన్నారు. ముఖ్యమంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేర‌కు బాధితుల‌కు 216.71 కోట్ల రూపాయల‌ను వారి, వారి అర్హతల‌కు అనుగుణంగా హిర‌మండ‌లంలో నిర్వహించిన పంపిణీ చేసే కార్యక్రమంలో రెవెన్యూ మంత్రి ధర్మాన పాల్గొన్నారు. 


వేద‌న‌లు త‌ప్పవు కానీ.. ముంద‌రి ల‌క్ష్యాలు గొప్పవి !


"దేశంలో ఎక్కడ ఏ సాగునీటి ప్రాజెక్టు చేసినా ఇలాంటి వేద‌న‌లు, బాధ‌లు చ‌విచూడాల్సి వ‌స్తోంది. కానీ ప్రాజెక్టు నిర్మాణం అన్నది త‌ప్పక చేయాల్సి వ‌స్తుంది. స్వాతంత్ర్యం వ‌చ్చి 75 ఏళ్లైనా శ్రీ‌కాకుళం జిల్లాలో ఉన్న రైతుల‌కు నీరు ఇవ్వక‌పోతే, పంట‌ల పండ‌క అప్పులు చేసుకుని కూలి ప‌నుల‌కు వెళ్లిపోతున్నారు. ఈ జిల్లాకే చెందిన వారే ఇక్కడ ఉండ‌లేక, ఉపాధి లేక, ప‌క్క రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు. ఇదే స‌మ‌యంలో వృద్ధాప్యంలో ఉన్న త‌ల్లిదండ్రుల‌తో స‌హా సుదూర ప్రాంతాల‌కు వెళ్లిపోతున్నారు. బతుకులు ఛిద్రం అయిపోతున్నాయి. ఈ త‌రుణంలో సాగునీటి ప్రాజెక్టుల ద్వారా నీరందితే గొప్పగా ప‌రిస్థితులు మారిపోయాయి అని చెప్పను కానీ కడుపు నిండా ఆహారం, గుండె నిండా ఆత్మ విశ్వాసంతో బ‌తికే ప‌రిస్థితులు గ్రామాల్లో ప్రశాంత‌ంగా వ్యవ‌సాయం చేయ‌డం ద్వారా ద‌క్కుతాయి అని చెప్పగ‌ల‌ను."- ధర్మాన ప్రసాదరావు


విభిన్న నాయ‌కుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి


"వాస్తవానికి ఒడిశా క్యాచ్మెంట్ ఏరియాలో వాన‌లు లేక‌పోతే పంట‌లు సాగ‌వు. వ్యవ‌సాయాన్ని స్థిరీక‌రించాలంటే ఆయ‌క‌ట్టుకు నీరు అందాలంటే రిజ‌ర్వాయ‌ర్ అవస‌రం. వంశ‌ధార ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఆ రోజు నేను వ‌చ్చిన‌ప్పుడు కూడా న‌న్ను అడ్డుకున్నారు. కానీ నాకు ఆ క‌ష్టాలు తెలుసు. నిర్వాసితుల బాధ‌లు తెలుసు. అంద‌రి ప్రయోజ‌నం కోసం త‌ప్పక కొంద‌రిని నిరాశ్రయుల‌ను చేయాల్సి వ‌చ్చింద‌ని తెలుసుకోవాలి. వివిధ ప్రాంతాల‌లో ప్రభుత్వంలో ఇవాళ ఉన్న నాయ‌కులు ఏ విధంగా వ్యవ‌హ‌రిస్తున్నారో చూస్తే అర్థం అవుతుంది. కానీ మ‌న ముఖ్యమంత్రి జగ‌న్ మోహ‌న్ రెడ్డి ఇందుకు భిన్నం. ప‌రిస్థితులు అనుకూలించుకున్నా ప‌రిహారం ఇవ్వాల్సిందేన‌ని కోరితే, అడిగిన వెంట‌నే ఒప్పుకున్నారు. అయిపోయిన ప్రాజెక్టుకు మ‌ళ్లీ ప‌రిహారం ఇవ్వాల‌ని సంక‌ల్పించారు. ఎలా అయినా ఈ రోజు మీకు డ‌బ్బులు ఇవ్వాల‌ని మ‌మ్మల్ని సీఎం ఇక్కడికి పంపించారు. ."- ధర్మాన ప్రసాదరావు
 



అట్టడుగు వ‌ర్గాల ఆత్మ గౌర‌వ‌మే ముఖ్యం 


"14 వేల అకౌంట్స్‌లో నిర్దేశిత మొత్తాలు ట్రాన్స్ఫర్ అయ్యాయి. మిగ‌తా వారికి కూడా డ‌బ్బులు ప‌డ‌లేద‌ని ఆవేద‌న అక్కర్లేదు. వారికి కూడా త్వర‌లోనే డ‌బ్బులు ప‌డే అవ‌కాశం ఉంది. ఈ ప్రభుత్వం బీద‌ల ప్రబుత్వం బ‌ల‌హీనుల ప్రభుత్వం అట్టడుగున వ‌ర్గాలు గౌర‌వంగా బ‌తికేలా చేసే ప్రబుత్వం. నిర్వాసితుల‌కు గ‌తంలో ఎన్నో లంచాలు న‌డిచేయి ప్యాకేజీల పేరిట ! కానీ ఇప్పుడు అలాంటివి లేవు. అభివృద్ధి లేదు లేదు అని ప‌దే ప‌దే అంటున్నారు. అభివృద్ధిలో భాగంగా వంశ‌ధార ప్రాజెక్టు నిర్మించ‌డం లేదా ? అదేవిధంగా మీ గ్రామంలో ఉండే బ‌డులు, వెల్ నెస్ సెంట‌ర్లు, స‌చివాల‌యాలు, ఆర్బీకేలు ఇవ‌న్నీ అభివృద్ధిలో భాగం కావా ? పేద‌వాడు గౌర‌వంగా బ‌తికే అవ‌కాశం ఇస్తోంది. అందుకే ఇత‌ర నాయ‌క‌త్వాల క‌న్నా జగ‌న్ మోహ‌న్ రెడ్డి నాయ‌క‌త్వం స‌మ‌గ్రమైంది అని చెప్పక త‌ప్పదు" అని ధర్మాన ప్రసాదరావు చెప్పారాయ‌న. సుమారు 27 వేల మందికి పైగా బాధితుల‌కు ప్రభుత్వం త‌ర‌ఫున రూ.216 కోట్లకుపైగా సాయం అందించేందుకు సీఎం చేప‌ట్టిన చ‌ర్యల‌ను వివరించారు.- ధర్మాన ప్రసాదరావు


చంద్రబాబు బాదుడే బాదుడు అంటూ ఊరురా తిరుగుతున్నార‌ని కానీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వ‌స్తే ఏం చేస్తామో అన్నది చెప్పలేక‌పోతున్నార‌ని అన్నారు ధర్మాన. తాము అధికారంలోకి వ‌స్తే అవినీతిర‌హిత పాల‌న అందిస్తామ‌ని కూడా చెప్పలేక‌పోతున్నార‌ని దుయ్యబ‌ట్టారు. ఈ ప్రభుత్వం పేద‌ల ప్రభుత్వం క‌నుక అంద‌రి సంక్షేమ‌మే ధ్యేయంగా ప‌నిచేస్తుంద‌ని పున‌రుద్ఘాటించారు. అదేవిధంగా ఈ నెల 27న శ్రీ‌కాకుళం జిల్లా కేంద్రంలో జ‌రిగే సీఎం స‌భ‌కు అంతా త‌ర‌లి రావాల‌ని పిలుపునిచ్చారు.

Published at: 24 Jun 2022 08:23 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.