అందరి సహకారంతో ఉద్యానవనం ప్రాంతం అభివృద్ధి చేస్తామంటున్నాు ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం. రాష్ట్ర ముఖ్య మంత్రి ఇచ్చిన హామీ నెరవేర్చినట్లు పేర్కొన్నారు. శుక్రవారం పలాస మండలం బొడ్డపాడు గ్రామంలో రెవెన్యూ, ఉద్యానవన, వ్యవసాయ శాఖలు ఏర్పాటు చేసిన తిత్లీ తుఫాన్‌కు సంబంధించి అదనపు పరిహారం పంపిణీ కార్యక్రమంలో శాసన సభాపతితోపాటు రెవెన్యూ శాఖమంత్రి ధర్మాన ప్రసాదరావు, పాడిపరిశ్రమ అభివృద్ధి శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు పాల్గొన్నారు.
సీఎం జగన్ మానవతావాది: స్పీకర్
ముఖ్యమంత్రి జనగ్ మానవతావాదని ఇచ్చిన హామీని నెరవేర్చారన్నారు తమ్మినేని. ఈ ప్రాంతం అభివృద్ధి చేయడానికి అంతా కలిసికట్టుగా సహకారం అందిస్తామని చెప్పారు. అవినీతి లేని పాలన, నాణ్యమైన విద్య, పేదరికం విద్యకు అడ్డంకి కాకుండా ఉండే విధంగా ముఖ్యమంత్రి అన్ని చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.
అవినీతి అవకాశం లేకుండా పథకాలు: ధర్మాన
రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ అవినీతికి అవకాశం లేకుండా ప్రభుత్వ పథకాలు అందిస్తుందన్నట్లు చెప్పారు. పలాస ప్రాంతానికి వంశధార నుంచి తాగునీరు తరలించే ప్రాజెక్టుకు చర్యలు తీసుకుంటున్నట్లు ధర్మాన తెలిపారు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారికి డయాలసిస్ యూనిట్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలోని 59,829 ఎకరాల్లో జీడి, 12,56,229 కొబ్బరి పంట నష్టపోగా, దీనివలన 1,06,592 మంది రైతులు నష్టపోయారని, ఎన్.డి.ఆర్.ఎఫ్, ఎస్.డి.ఆర్.ఎఫ్ చట్ట పరిధి మేరకు గత ప్రభుత్వం రూ.257.83 కోట్లను నష్టపరిహారాన్ని చెల్లించారని వెల్లడించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే హెక్టారు జీడి పంటకు రూ.30,000ల నుంచి రూ.50,000లు, కొబ్బరి చెట్టుకి రూ.1,500లకు బదులుగా రూ.3,000లు అదనపు పరిహారం ఇస్తున్నట్టు వెల్లడించారు. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 64,413 మంది జీడి రైతులకు రూ.39.65 కోట్లు, 26,376 కొబ్బరి రైతులకు రూ.142.95 కోట్లు, 90,789 మంది రైతులకు రూ.182.60 కోట్లు చెల్లింపులు చేస్తున్నట్లు వివరించారు.
సీఎం చేతులు మీదుగా మరింత పరిహారం: సీదిరి
పశు సంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజు మాట్లాడుతూ... తిత్లీ తుపాన్ ఉద్యానవనం ప్రాంతంలో ఎంతో నష్టం కలిగించిందని దాన్ని భర్తీ చేసేందుకు 90,789 మంది జీడి, కొబ్బరి రైతులకు రూ.182.60 కోట్లు అదనంగా చెల్లిస్తున్నట్టు తెలిపారు. 27న జిల్లాకు రానున్న సీఎం జగన్ కొబ్బరి, జీడి పంటలకు అదనపు పరిహారం, అమ్మ ఒడి పథకం నిధులు, వంశధార నిర్వాసితులకు పరిహారం చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న బాధితులకు ఆర్థిక సహాయం ఇస్తున్నామని, హరిపురం, పలాస, తదితర ప్రాంతాల్లో అదనపు డయాలసిస్ యూనిట్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు.
తిత్లీ ప్రభావంతో కోలుకోలేని దెబ్బ: విజయ
జిల్లా పరిషత్ ఛైర్మన్ పిరియా విజయ మాట్లాడుతూ... ఈ ప్రాంతానికి తిత్లీ తుపాన్ తీరని నష్టం మిగిల్చిందన్నారు. నష్టపోయిన రైతులకు గతంలో ప్రభుత్వం ఇచ్చిన నష్టపరిహారం చాలదని గ్రహించి అదనపు పరిహారం చెల్లించేందుకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు తెలిపారు.