Vizag Crime News: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన విశాఖ తహసీల్దార్‌ రమణయ్య కేసులో బిగ్‌ బ్రేక్‌త్రూ సాధించారు పోలీసులు. రమణయ్యను హత్య చేసిన తర్వాత రాష్ట్రం విడిచిపెట్టి పారిపోయిన నిందితులను పోలీసులు పట్టుకున్నారు. 


ఈ కేసులో ప్రధాన నిందితుడు గంగాధర్‌గా పోలీసులు అదే రోజు గుర్తించారు. తహసీల్దార్ హత్య తర్వాత రాష్ట్ర విడిచిపెట్టి వెళ్లిపోయినట్టు తేల్చారు. విశాక ఎయిర్‌పోర్టు మీదుగా పారిపోయినట్టు స్పష్టమైంది. అక్కడి నుంచి మొదలైన పోలీసుల విచారణ... తీసుకున్న టికెట్‌ వెళ్లిన ఫ్లైట్‌ వివరాలు తెలుసుకొని కేసు దర్యాప్తు చేశారు. 


చివరకు నిందితుడు గంగాధర్‌ చెన్నైలో ఉన్నట్టు గుర్తించారు. అతన్ని అరెస్టు చేశారు. ప్రాథమిక దర్యాప్తులో ఈ హత్యకు కారణాలను నిందితుడు గంగాధర్ వివరించినట్టు పోలీసులు తెలిపారు. మధురవాడలోని జెవెల్ పార్కు భూవివాదమే ఈ హత్యకు కారణంగా భావిస్తున్నారు. రుషికొండ సమీపంలో ఓ అపార్ట్మెంట్‌లో ఫ్లాట్స్‌కు ఇవ్వాల్సిన కన్వీనియన్స్ డీడ్ కోసం ఇద్దరి మధ్య ఒప్పందం జరిగింది. 57 లక్షల వరకు లంచం ఇచ్చినట్లు సమాచారం అందుతోంది. 


లంచం తీసుకున్న తర్వాత తహసీల్దార్‌ విజయనగరం బదిలీ అయ్యారు. ఇదే వివాదానికి అసలు కారణంగా తెలుస్తోంది. బదిలీపై వెళ్తున్నందున పాత తేదీలతో అనుమతులపై సంతకాలు చేయాలని గంగాధర్‌ ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తోంది. అలా చేసేందుకు రమణయ్య నిరాకరించారని సమాచారం. కొన్ని రోజులు ఈ విషయంలో ఇద్దరి మధ్య చర్చ నడుస్తోంది. ఈ కారణంగానే రమణయ్యను గంగాధర్ హత్య చేశారని పోలీసుల నుంచి అందుతున్న సమాచారం.