Vizag Rushikonda Project Tender:  విశాఖపట్నంలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన  రుషికొండ  భవనాల సముదాయాన్ని ఆదాయ వనరుగా మార్చేందుకు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం తుది నిర్ణయానికి వచ్చింది. ఈ ప్రతిష్టాత్మక భవనాల ఆపరేషన్, మెయింటెనెన్స్ , మార్కెటింగ్ బాధ్యతలను ప్రైవేట్ భాగస్వామ్యంతో లీజుకు ఇవ్వాలని నిశ్చయించింది. ఇందులో భాగంగా పర్యాటక, ఆతిథ్య  రంగంలో అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో మంచి అనుభవం ఉన్న ప్రముఖ సంస్థల నుండి ఆసక్తి వ్యక్తీకరణ ను ఆహ్వానిస్తూ ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ  అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.

Continues below advertisement

ఈ ప్రాజెక్టు కింద మొత్తం 9.8 ఎకరాల హిల్‌టాప్ స్థలంలోని ఐదు అత్యాధునిక భవనాల సముదాయాన్ని ప్రైవేట్ లీజుకు అప్పగించనున్నారు. కేవలం కొండపై ఉన్న భవనాలే కాకుండా.. రుషికొండ దిగువ ప్రాంతంలో ఉన్న మరో 9 ఎకరాల భూమిని కూడా కలుపుకుని, అక్కడ అంతర్జాతీయ స్థాయి ఫైవ్ స్టార్ హోటళ్లు, లగ్జరీ రిసార్టులు ,  పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధికి  ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఏపీటీడీసీ తన ప్రకటనలో స్పష్టం చేసింది. గత రెండేళ్లుగా ఈ భవనాలు ఖాళీగా ఉండటం వల్ల పాడైపోతుండటమే కాకుండా.. కేవలం వీటి సెక్యూరిటీ, మెయింటెనెన్స్ కోసమే ప్రభుత్వం ప్రతి నెలా రూ.25 లక్షల వరకు ప్రజాధనాన్ని వెచ్చించాల్సి వస్తోంది. ఈ భారాన్ని తగ్గించుకోవడానికే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 

 రుషికొండ ప్రాజెక్టును ప్రైవేట్ సంస్థలకు అప్పగించినప్పటికీ.. అందులో సాధారణ ప్రజలు, పర్యాటకులు విజిట్ చేయడానికి వీలుగా వ్యూయింగ్ ఏరియాలు  , ఓపెన్ స్పేస్‌లను తప్పనిసరిగా ఉంచాలని ఏపీటీడీసీ లీజు నిబంధనలలో ప్రత్యేకంగా వెల్లడించింది. ఈ ఈవోఐ నోటిఫికేషన్ ప్రకారం.. ప్రస్తుత భవన సముదాయంతో పాటు, అదనపు అభివృద్ధి కోసం రెండు ఖాళీ స్థలాలలో తీర ప్రాంత నియంత్రణ మండలి నిబంధనలకు లోబడి మొత్తం 2,400 చదరపు మీటర్ల పరిధిలో, దాదాపు 4,800 చదరపు మీటర్ల వరకు జీ+1 నిర్మాణాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వనుంది. చట్టబద్ధమైన అనుమతులు, ఎన్జీటీ  నిబంధనల ప్రకారమే ఈ అదనపు పనులు చేపట్టాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టు దక్కించుకోవడానికి దరఖాస్తు చేసే సంస్థలకు మార్చి 31, 2025 నాటికి పాజిటివ్ నెట్‌వర్త్  ఉండటం తప్పనిసరి అని అధికారులు పేర్కొన్నారు.

Continues below advertisement

ప్రస్తుతం ఈ మెగా ప్రాజెక్టును దక్కించుకునేందుకు అంతర్జాతీయ మార్కెట్లో బ్రాండ్ ఇమేజ్ ఉన్న తాజ్  , లీలా  , అట్మాస్మియర్ కోర్, ఫామా వంటి లగ్జరీ హోటల్ చైన్స్ ఇప్పటికే ఆసక్తి చూపిస్తూ క్షేత్రస్థాయి పరిశీలన కూడా ముగించాయి. ఈ EOI దరఖాస్తులను దాఖలు చేయడానికి జూలై 10 సాయంత్రం 5 గంటల వరకు గడువు విధించారు. పెట్టుబడిదారుల నుండి వచ్చే రెస్పాన్స్, ప్రాజెక్టు వాణిజ్య సాధ్యాసాధ్యాలను  అంచనా వేసిన అనంతరం.. తదుపరి దశ అయిన ఆర్‌ఎఫ్‌పీ ద్వారా గరిష్ట ఆదాయ భాగస్వామ్యం ఇచ్చే ఉత్తమ సంస్థను ప్రభుత్వం ఎంపిక చేయనుంది. ఏదేమైనా వివాదాల రుషికొండను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా మార్చడానికి ప్రభుత్వం వేసిన ఈ అడుగు విశాఖ బ్రాండ్ ఇమేజ్‌ను మరింత పెంచుతుందని నిపుణులు భావిస్తున్నారు.