Gudivada Amarnath satires on Nara Lokesh


విశాఖపట్నం: తన తండ్రి చంద్రబాబు నాయుడును అరెస్టు చేసి 50 రోజులైనా, ఇప్పటికి సాక్ష్యాలు చూపటం లేదని.. ఆ ఆరోపణలకు ఆధారాలు ఏంటని నారా లోకేష్ ప్రశ్నించారు. టీడీపీ నేత లోకేష్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. స్థానిక సర్క్యూట్ హౌస్ లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గుడివాడ అమర్నాత్ మాట్లాడుతూ.. స్కి్ల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును అరెస్టు చేసిన తర్వాత కోర్టులో జరిగిన వాదోపవాదనలను ప్రజలు గమనించారని చెప్పారు. కేసులకు సంబంధించిన ఆధారాలు న్యాయవాదులు కోర్టుకు సమర్పిస్తారు కానీ, నేరం చేసిన వారికి ఇవ్వరు అని ఎద్దేవా చేశారు.


రాష్ట్ర ఖజానా నుంచి రూ. 371 కోట్ల రూపాయలు కొట్టేసిన చంద్రబాబు తాను తప్పు చేయలేదని ఇప్పటికి బుకాయిస్తున్నాడని, ఆయన స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో 15 చోట్ల సంతకాలు చేశారని చెప్పారు. అసెంబ్లీ సాక్షిగా తాము ఈ విషయాన్ని బహిర్గతం చేసామని అమర్నాథ్ పేర్కొన్నారు. స్కి్ స్కామ్ కు, తమకు ఎటువంటి సంబంధం లేదంటూ సిమెన్స్ సంస్థ యాజమాన్యం తేల్చి చెప్పిందన్నారు. అయితే విచారణ సంస్థలు 150 మంది దగ్గర నుంచి వాంగ్మూలాలు తీసుకున్నాయని, నాలుగు వేల పేజీల నివేదికను కోర్టులకు సమర్పించాయని మంత్రి అమర్నాథ్ వెల్లడించారు. డిజైన్ టెక్ ఎప్పుడు వచ్చిందో కూడా తెలియదని, లేని కంపెనీలు ఉన్నట్టు చూపించి, కోట్ల రూపాయలను జూబ్లీహిల్స్ ప్యాలెస్ కు తరలించారని మంత్రి ఆరోపించారు.


తప్పుచేసి దొరికిపోయారు కనుక చంద్రబాబు 50కి రోజులుగా జైల్లో ఉంటున్నారని అన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేసే చాకచక్యం చంద్రబాబుకే ఉందని, ఈ విషయంలో ఆయనకు గొప్ప బహుమతి ఇవ్వాలన్నారు. 45 ఏళ్ల ఆయన రాజకీయ జీవితంలో ఎక్కువ కాలాన్ని వ్యవస్థలను మేనేజ్ చేయడంలోనే గడిపేసారని అమర్నాథ్ ఎద్దేవా చేశారు. చంద్రబాబుపై పెట్టిన అనేక కేసులపై స్టేలు తెచ్చుకుని తప్పించుకుంటూ వస్తున్నారని అన్నారు. చంద్రబాబు ఎన్టీఆర్ నుంచి పార్టీని లాక్కుని, ఆ పార్టీ గుర్తును కూడా దక్కించుకునేందుకు వ్యవస్థలను ఏ విధంగా మేనేజ్ చేశారో తెలుగు ప్రజలకు తెలుసన్నారు. నేరాలకు పాల్పడిన చంద్రబాబు మొన్నటి వరకు దొరలా తిరిగాడని, నేరాలు బయటపడటంతో జైల్లో ఉన్నారని పేర్కొన్నారు.


ఏపీ సీఎం జగన్ వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నట్టు నారా లోకేష్ గొంతు చించుకుంటున్నాడని, ఆయన తండ్రి చంద్రబాబు అరెస్టు అయిన కొద్ది రోజులకే లోకేష్ ఎందుకు ఢిల్లీ పెద్దల చుట్టూ తిరగాల్సి వచ్చిందని అమర్నాథ్ ప్రశ్నించారు. లోకేష్ కేంద్రమంత్రి అమిత్ షాను ఎందుకు కలవాల్సి వచ్చిందో బహిర్గతం చేయాలని కోరారు. ఆదాయపన్ను శాఖ, ఎన్ఫోర్స్మెంట్ అండ్ డైరెక్టరేట్ అధికారులు చంద్రబాబుకు నోటీసులు ఇవ్వడానికి వస్తే, వారికి అధికారం లేదంటూ తప్పించుకోలేదా? అని ఆయన ప్రశ్నించారు. తన బండారం బయటపడుతుంది అన్న భయంతో చంద్రబాబు తన పి.ఏతో సహా మరొక వ్యక్తిని ఎందుకు దేశాలు దాటించారో చెప్పాలన్నారు.
ఇంట్లో కన్నా జైల్లో బాగా చూసుకుంటున్నారు..
చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన ఇంట్లో కన్నా బాగా చూసుకుంటున్నారని చెప్పారు. అయితే లేని రోగాలను ఉన్నాయని చెప్పుకుంటూ, తన తండ్రి చంద్రబాబుకి అన్యాయం జరుగుతోందని లోకేష్ చెప్పడంలో వాస్తవం లేదని మంత్రి అమర్నాథ్ అన్నారు. తండ్రి వారసత్వం నీకు వచ్చి. నీ తండ్రిని ఏం చేస్తావోనని తమకు భయంగా ఉందన్నారు. చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటు ఉంటామన్నారు.