ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏప్రిల్ నెల నుంచి విశాఖ నుంచి పాలన సాగిస్తారని, హైకోర్టు బెంచ్ విజయవాడ, విశాఖపట్నంలో ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉందన్నారు ఏపీ ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్. మూడు రాజధానిపై త్వరలోనే బిల్లు తీసుకొస్తామన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అమరావతిని రాజధానికి అంగీకరించలేదని, కానీ అప్పటి సీఎం చంద్రబాబు తన వారి కోసం తన కోసం అమరావతిని రాజధానిగా ప్రకటించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు తన పరిధి దాటి తీర్పు ఇచ్చిందని, చాలా దురదృష్టకరమైన విషయం అని ఆరోజే తెలియజేశాం. అయినప్పటికీ సుప్రీంకోర్టు మీద తమకు నమ్మకం ఉంది. సాయం గెలుస్తుంది అని అభిప్రాయం అప్పుడే వ్యక్తపరిచాము. శాసనసభ, ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలు కోర్టులు అడ్డుకోవడం సరికాదని ఆనాడే చెప్పామన్నారు.
ఆరు నెలల్లో రాజధాని అసాధ్యం, కానీ 3 రోజుల్లో గ్రాఫిక్స్ చూపించొచ్చు !
విశాఖలో మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ.. ఆరు నెలల్లో రాజధాని కట్టడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు అభిప్రాయ పడింది. కానీ గ్రాఫిక్స్ చూపించమంటే కేవలం మూడు రోజుల్లో చూపించేస్తాం. కేవలం అమరావతి కాకుండా మిగిలిన ప్రాంతాలతో కలిపి అమరావతిని అభివృద్ధి చేస్తామని పదే పదే చెబుతున్నామని, దానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. హైకోర్టు న్యాయమూర్తులను బదిలీ చేస్తే ధర్నాలు చేయడం ఎక్కడైనా చూశామా? ఇటువంటి పరిస్థితులు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. దీనిపై ప్రజల్లో చర్చ జరగాలి. సుప్రీం కోర్టు తీసుకున్న నిర్ణయాలను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని అంశాలపై ఆపాదించడం సరికాదన్నారు. మూడు రాజధానులపై చట్టం చేసే అధికారం అసెంబ్లీకి లేదని ఇచ్చిన హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. సోమవారం నాడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ భవిష్యత్తులో మరిన్ని మంచి తీర్పులు వస్తాయని ఆశిస్తున్నాం అన్నారు.
న్యాయ వ్యవస్థ పై నమ్మకాన్ని మరింత పెంచింది..
‘అధికార వికేంద్రీకరణ, మూడు రాజధానులు ఏర్పాటు అంశానికి సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. మూడు రాజధానులు ఏర్పాటు వలన వచ్చే ప్రయోజనాలు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలకు సంబంధించిన అంశాలను ఆ పిటిషన్లు దాఖలు చేశాము. దేశంలో లెజిస్లేటివ్, జ్యూడిసియల్ ఎగ్జిక్యూటివ్, వ్యవస్థలు ఎవరి పాత్ర వాళ్ళు పోషించాలన్న అభిప్రాయాన్ని ప్రభుత్వం ఆ పిటీషన్ లో పేర్కొంది. సుప్రీంకోర్టులో ఈ అంశాలపై వాదనలు జరిగిన తర్వాత సోమవారం ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు న్యాయ వ్యవస్థ పై నమ్మకాన్ని మరింత పెంచిందన్నారు మంత్రి అమర్నాథ్.
‘సుప్రీంకోర్టు తీర్పు చూసైనా చంద్రబాబు నాయుడు ఆయన తోక పార్టీలు బుద్ధి తెచ్చుకోవాలి. రాష్ట్ర విభజన ఏ సందర్భంలో జరిగింది అందరికీ తెలుసు. ఐదున్నర కోట్ల మంది ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా రాష్ట్ర విభజన జరిగింది. హైదరాబాద్ కోసమే తెలంగాణ ఉద్యమం జరిగింది. అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకృతం అవ్వటం వల్ల మిగిలిన ప్రాంతాలు నష్టపోయాయి. దానిని ఉదాహరణగా తీసుకొని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారు. అమరావతి తో పాటు ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాలు కూడా అభివృద్ధి చెందాలన్నదే మంత్రి ఉద్దేశం. శాసనసభకు ఉన్న అధికారాలు హైకోర్టు తీర్పు ప్రశ్నార్థకంగా మార్చింది. సుప్రీంకోర్టు చేసిన ప్రస్తావనలు చూసైనా ఈ మూడు రాజధానులు వ్యతిరేకిస్తున్న వాళ్ళు వాస్తవాలు తెలుసుకోవాలన్నారు’ గుడివాడ అమర్నాథ్.
హైకోర్టు ఏమైనా టౌన్ ప్లానింగ్ విభాగమా, హైకోర్టు ప్రభుత్వాన్ని నడుపుతోందా, హైకోర్టు నిర్ణయం తీసుకుంటే క్యాబినెట్ ఎందుకు శాసనసభ ఎందుకు అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. వీటన్నిటి పైన చర్చి జరగాలి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు ఇలాంటి వ్యక్తులు దీనికి అడ్డంకులు సృష్టించడం మానడం మంచిదన్నారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా అడ్డమైన యాత్రలు చేయటం ప్రాంతాలవారీగా ప్రజలను రెచ్చగొట్టడం మంచిది కాదు తెలుసుకోవాలని టీడీపీ అధినేతకు సూచించారు. ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు మాకు సమాసం. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలన్నారు సంకల్పంతో మా పార్టీ మా ప్రభుత్వం ఉంది. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని మా సంకల్పం. అమరావతి అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు. అమరావతి తో పాటు ఉత్తరాంధ్ర రాయలసీమ కూడా అభివృద్ధి చెందాలని మా లక్ష్యం. కాస్త ఆలస్యమైనా న్యాయమే గెలుస్తుంది అని చరిత్ర చెబుతోంది అది ఇప్పుడు మరోసారి నిజమైందన్నారు.