AP Child Rights Commission సింహాచలం: భక్తుల తాకిడి ఎప్పుడూ లేనంతగా పెరగడంతో సింహాచలం లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో అంతరాలయ దర్శనాలను అధికారులు నిలిపివేయడం తెలిసిందే. అయితే అప్పన్న స్వామి చందనోత్సంలో బాలల హక్కుల పరిరక్షణలో భాగంగా సంపూర్ణ సదుపాయాలు కల్పించడంలో అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆరోపించింది. దీనిపై నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేస్తున్నట్టు కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు, సభ్యులు గొండు సీతారాంలు చెప్పారు. వీఐపీలు, వీవీఐపీలు సైతం గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పిల్లల కోసం ప్రణాళిక బద్దంగా ఏర్పాట్లు చేయటంలో ఆలయ అధికారులు వైఫల్యం చెందారని ఆదివారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో కమిషన్ పేర్కొంది. అప్పన్న స్వామి దేవాలయం పరిసర ప్రాంతాలలో క్యూలో పసిపిల్లలు, బాలలుతో నిలబడి వేచివున్న వారికి మంచి నీరు, మొదలైన కనీస సదుపాయాలు కల్పించక పోవడం బాధాకరం అన్నారు. తల్లి పాలు పెట్టే కేంద్రాలు ఆశించిన స్థాయిలో ఏర్పాటు చేయలేదని, పాలు, బిస్కెట్లు పంపిణీ ఎక్కడా కనిపించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పసి పిల్లలు, బాలలు 3 నుండి 5 గంటలు వేచి ఉన్నారని ఆకలి కేకలు, ఆర్తనాదాలుతో ఇబ్బందికర పరిస్థితులు ప్రత్యక్షంగా చవిచూడడం విచారకరమని తెలిపారు.
స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సిబ్బంది సేవలు, చైల్డ్ లైన్ సేవలు వినియోగించు లేకపోవడాన్ని కమిషన్ తీవ్రంగా పరిగణించనుందని అన్నారు. వారం రోజులు ముందుగానే సంబంధిత పరిపాలనా అధికారులు, ఉన్నతాధికారులు, సిబ్బందితో బాలల కోసం చేయాల్సిన ఏర్పాట్లపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సమీక్ష సమావేశం నిర్వహించి స్పష్టమైన ఆదేశాలు కూడా జారీచేసిందని అన్నారు. అయినప్పటికీ అధికారులు వాటిని ఆచరించకుండా పెడ చెవిన పెట్టడం బాధాకరం అన్నారు. అధికారులు అందించే నివేదిక ఆధారంగా సంబంధిత అధికారులపై చర్యలకు రాష్ట్ర ప్రభుత్వానికి బాలల హక్కుల కమిషన్ తరపున సిఫారసులు చేయనున్నామని తెలిపారు.
సింహాచలంలో భారీగా భక్తుల రద్దీ, అంతరాలయ దర్శనాలు నిలిపివేత
అప్పన్నస్వామి నిజరూపాన్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో సింహాచల క్షేత్రానికి వస్తుండడంతో... కొండపై రద్దీ ఏర్పడింది. కొండపైకి వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అవ్వడంతో భక్తులు బస్సులు దిగి నడుచుకుంటూ కొండపైకి వెళ్తున్నారు. ఏడాదిలో ఒక్క రోజు లభించే నిజరూప దర్శనం చేసుకునేందుకు ఎంతో వ్యయప్రయాసలతో భక్తుల్లో సింహాచలం చేరుకుంటున్నారు. వీవీఐపీల తాడికి ఎక్కువగా ఉండడంతో క్యూ లైన్ లో వేచిఉన్న సామాన్య భక్తుల అసహనం వ్యక్తం చేస్తున్నారు. గంటల కొద్దీ క్యూలైన్ లో నిరీక్షణతో అధికారులపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ భక్తులకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. నిజరూప దర్శనం కల్పించడంతో ఆలస్యం అవుతోందని భక్తులకు వివరించారు మంత్రి. క్యూ లైన్ లో భక్తులకు మజ్జిగ, మంచి నీరు పంపిణీ చేస్తు్న్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో మహిళా భక్తురాలు సొమ్మసిల్లి పడిపోయారు. ఆమెకు పోలీసులు ప్రథమ చికిత్స అందించారు.