Andhra University: వైజాగ్‌లోని ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్‌లో కొన్ని రోజులుగా నడుస్తోన్న లెఫ్ట్ vs రైట్ వింగ్ విద్యార్థి సంఘాల మధ్య గొడవలకు యూనివర్సిటీ యాజమాన్యం చెక్ పెట్టింది. క్యాంపస్‌లో ఎలాంటి మతపరమైన కార్యక్రమాలు చేపట్టకూడదని పర్మిషన్ లేకుండా బయటి వ్యక్తులు రాకూడదని స్పష్టం చేసింది. విశ్వ విద్యాలయంలో విద్యార్థుల చదువును దెబ్బతీసే ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకూడదని క్యాంపస్ ప్రశాంతతకు భంగం కలిగించే ఎలాంటి పనులు చేసినా చాలా తీవ్రమైన క్రమశిక్షణా చర్యలు ఉంటాయని హెచ్చరించింది. 

క్యాంపస్‌లోకి బయటి వ్యక్తులు రావడంతో మొదలైన గొడవ

గత కొన్ని నెలలుగా రైట్ వింగ్ వ్యక్తులు బయటి కాలేజీలకు చెందిన విద్యార్థులు యూనివర్సిటీ గ్రౌండ్ లో కర్రసాము,కవాతు లాంటివి చేస్తూ మతపరమైన నినాదాలు చేస్తున్నారు అంటూ లెఫ్ట్ విద్యార్థి సంఘాలు SFI, PDSOలకు చెందిన స్టూడెంట్స్ అడ్డు చెప్పడంతో వివాదం స్టార్ట్ అయింది. అది 17వ తేదీ రాత్రి కొట్లాటకు దారితీయడంతో ఇరు సంఘాల విద్యార్థులు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు.

18వ తేదీ కూడా కొనసాగిన బాహాబాహీ 

తెల్లారిన తరువాత ABVP లాంటి రైట్ వింగ్ సంఘాలకు చెందిన విద్యార్థులు VCని కలిసే ప్రయత్నం చేశారు. బయటి కాలేజీలకు చెందిన వారమైనా యూనివర్సిటీ పరిధిలో ఉండే కాలేజీలకు చెందిన స్టూడెంట్స్‌మే అని యూనివర్సిటీ ఎవరి సొత్తూ కాదనేది వారి వాదన. భారత మాత కీ జై అనడం తప్పా అని ప్రశ్నిస్తున్నారు ABVPకి చెందిన నితిన్, ప్రసాద్ అనే విద్యార్థులు. అదే సమయంలో SFI, PDSO విద్యార్థులు కూడా VCని కలవడానికి రావడంతో వారి మధ్య బాహాబాహీ చోటుచేసుకుంది. దీనిలో తమపై చెప్పులు, ప్లాస్టిక్ బాటిల్స్ విసిరారనీ కొందరికి దెబ్బలు తగిలాయనీ గాయత్రీ అనే ఇంజనీరింగ్ స్టూడెంట్, లక్ష్మి అనే PDSO విద్యార్థి నేత ABP దేశంతో చెప్పారు. అయితే ఈ గొడవ జరిగిన సమయంలో VC అక్కడ లేరు.

అప్పటి నుంచి యూనివర్సిటీలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు 

విద్యార్థుల మధ్య కొట్లాట ముగిసిపోయినా పరిస్థితి మాత్రం యూనివర్సిటీలో ఉద్రిక్తంగానే ఉంది. ఈ పరిస్థితిని కంట్రోల్ చెయ్యడానికి ఆంధ్ర యూనివర్సిటీ యాజమాన్యం రంగంలోకి దిగింది. విద్యార్డులు చదువులపై దృష్టి పెట్టాలే తప్ప ఇలా మతపరమైన కార్యక్రమాలు, క్యాండిల్ మార్చ్‌లు కాదని  యూనివర్సిటీ ప్రతిష్టకు భంగం కలిగిస్తే తీవ్రమైన చర్యలు ఉంటాయని రిజిస్ట్రార్ పేరుతో ఒక నోటీస్ రిలీజ్ చేసింది. ఏదేమైనా 100 ఏళ్ల జరుపుకుంటున్న ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇలా ఎన్నడూ లేని మత సంబంధ గొడవలు చోటు చేసుకోవడంపై విశాఖ ప్రజలు, రిటైర్డ్ ప్రొఫెసర్ లు, అక్కడ చదువుకున్న పాత విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.