Double Decker Bus Vizag: వైజాగ్‌కి స్పెషల్ టూరిజం అట్రాక్షన్ వచ్చేసింది. బీచ్ రోడ్ లో డబుల్ డెక్కర్ బస్సులు తిరుగుతున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తొలి డబుల్ డెక్కర్ బస్సును ప్రారంభించారు. ఇది వైజాగ్ టూరిజం గేమ్ ఛేంజర్ అని చంద్రబాబు అన్నారు.

టికెట్ రేట్లు  ఎంతంటే?(Vizag Double Decker Bus Ticket Price)

విశాఖ బీచ్ రోడ్డులో " హాప్ ఆన్ – హాప్ అఫ్ " డబుల్ డెక్కర్ పర్యాటక బస్సులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జెండా ఊపి ప్రారంభించారు. ఆర్కే బీచ్ నుంచి తొట్లకొండ వరకు 16 కిలోమీటర్ల మేర పర్యాటక ప్రాంతాల్లో తిరగనున్న ఈ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సుల్లో స్వయంగా ప్రజాప్రతినిధులతో కలిసి సీఎం కొంత దూరం ప్రయాణించారు. బస్సు నుంచే బీచ్‌లో ఉన్న పర్యాటకులకు అభివాదం చేశారు. పర్యాటకులకు కొత్త అనుభవం కలిగేలా ఈ బస్సులో ప్రయాణం ఉంటుందని సీఎం అన్నారు.

ప్రత్యేకంగా పర్యాటకుల కోసం అందుబాటులోకి వచ్చిన ఈ బస్సులు 24 గంటలపాటు ఒకే టికెట్‌తో ప్రయాణించే సౌకర్యం కల్పించనున్నాయి. టికెట్ ఛార్జీ రూ.500గా నిర్ణయించగా, అందులో సగం మొత్తాన్ని ప్రభుత్వం భరించనుంది. కేవలం రూ.250/- లకే 24 గంటల పాటు హాప్ ఆన్– హాప్ ఆఫ్ బస్సులో పర్యాటకులు ప్రయాణం చేయవచ్చని సీఎం చంద్రబాబు ప్రకటించారు.  

వైజాగ్ బీచ్ రోడ్ లో డబల్ డెక్కర్ బస్సును  ప్రారంభించాలని ఎప్పటినుంచో  పర్యాటకుల నుంచి డిమాండ్ ఉంది. వైజాగ్ బీచ్ రోడ్‌లో సముద్రాన్ని చూసుకుంటూ RK బీచ్, సబ్ మెరైన్ మ్యూజియం, హెలికాప్టర్ మ్యూజియం, తెన్నేటి పార్క్, బంగ్లాదేశ్ షిప్, రిషికొండ బీచ్ ను చూసుకుంటూ తోట్లకొండ వరకు ప్రయాణించడం అనేది టూరిస్టులకు ఒక మధురానుభూతిగా ఉండనుంది. వైజాగ్ పౌరులు, పర్యాటకులు పర్యావరణహితంగా ప్రవర్తించాలని, తీర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని పిలుపునిచ్చారు. విశాఖ బీచ్‌లను ప్రపంచ స్థాయి పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు పౌరులంతా సహకరించాలని కోరారు.

గత పాలకులు విశాఖను రాజధాని చేస్తామని చెప్పినా, వారి అవసరం లేదని ప్రజలు తీర్పు ఇచ్చారని అన్నారు చంద్రబాబు. రోడ్లపై గుంతలు పెట్టిన పాలకులు వాటిలోనే కొట్టుకుపోయారని విమర్శించారు. ప్రస్తుతం విశాఖ ఆర్థిక రాజధానిగా, ఆసియా టెక్నాలజీ హబ్‌గా ఎదగబోతోందని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. విశాఖలో డేటా సెంటర్, సీ కేబుల్ ఏర్పాటు కాబోతున్నాయని, ఈ కేబుల్ ద్వారా విశాఖ ప్రపంచంతో అనుసంధానం అవుతుందని తెలిపారు. దీని ద్వారా విశాఖ భారత్‌కే టెక్నాలజీ హబ్‌గా ఎదుగుతుందని అన్నారు చంద్రబాబు.

మహిళలకు సురక్షిత నగరంగా విశాఖ : చంద్రబాబు

మహిళలకు సురక్షిత నగరంగా విశాఖ ఎంపిక కావడం రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణమని సీఎం తెలిపారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై వంటి మెట్రో నగరాలతో పోటీ పడుతూ విశాఖ మహిళలకు సురక్షిత చిరునామాగా మారిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, హోంమంత్రి వంగలపూడి అనిత, టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్,  విఎంఆర్డిఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్, జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్, పోలీస్ క‌మిష‌న‌ర్ శంఖ‌బ్ర‌త బాగ్చీ, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్,  వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.