Anakapalli Bellam: అనకాపల్లి బెల్లం అంటే దేశ వ్యాప్తంగా ఎంతో ఫేమస్. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో బెల్లం బట్టీలు ఉన్నా.. అనకాపల్లి ప్రాంతంలో పండించే చెరుకు అన్నా,  ఇక్కడతయారయ్యే బెల్లం అన్నా చాలా మందికి ఇష్టం ఉంటుంది. అయితే గత వారం, పది రోజుల నుంచి కురుస్తున్న వర్షాల వల్ల అనకాపల్లి బెల్లం మార్కెట్ లో నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. ఇప్పటికే ఆన్ సీజన్ కారణంగా లాభాల్లేని బెల్లం మార్కెట్...  ఇప్పడు కురుస్తున్న వర్షాల వల్ల నష్టాల్లోకి వెళ్ళిందని మార్కెట్ లోని వ్యాపారులు చెబుతున్నారు. 


గత వారం రోజులుగా కనీసం పది బెల్లం దిమ్మలు కూడా అమ్ముడు పోలేదని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బెల్లం బట్టీల నుండి కూడా బెల్లం దిమ్మలు రావడం తగ్గిందని వాపోతున్నారు. కాస్తో .. కూస్తో వచ్చే బెల్లం దిమ్మలు కూడా నాణ్యత లోపించినవి కావడంతో రేటు బాగా పడిపోయిందని వివరిస్తున్నారు. క్వింటాల్ బెల్లం దిమ్మల ధర 2,250 నుండి 3,800 మధ్య పలుకుతుంది. గోదావరి జిల్లాల్లో వరద పలు ప్రాంతాలను ముంచెత్తడంతో అక్కడి నుండి వచ్చే పంట కూడా ఆగిపోయింది. ప్రస్తుతం కోల్డ్ స్టోరీజీలో నిలువ ఉంచిన స్టాకును మాత్రమే డిమాండ్ మేరకు బయటకు తీస్తున్నామని వ్యాపారులు చెబుతున్నారు. అయినప్పటికీ బెల్లం ధరలు రోజురోజుకీ పడిపోతున్నాయనీ.. కొత్త బెల్లం రావాలంటే దసరా వరకూ ఆగాల్సిందే అనీ మార్కెట్ శ్రేణులు అంటున్నాయి . 


మరోవైపు గతంలో పెద్ద పెద్ద బెల్లం దిమ్మలకు నార్త్ ఇండియాలో డిమాండ్ ఉండగా ఇప్పుడు 5 కేజీలు, 10 కేజీల దిమ్మలకు మాత్రమే ఆర్డర్స్ వస్తున్నాయి. ఇలా ఒక దానిపై ఒకటి కస్టాలు అనకాపల్లి బెల్లం మార్కెట్ పై పడ్డాయని వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. పెద్ద వ్యాపారుల సంగతి ఎలా ఉన్నా మార్కెట్ పైనే ఆధారపడ్డ చిరు వ్యాపారులు, కార్మికులు, కళాసీల వంటి వారిపై మాత్రం తీవ్ర ప్రభావం పడుతోందని పేర్కొంటున్నారు. 


120 ఏళ్ల అనకాపల్లి బెల్లం మార్కెట్...


అనకాపల్లి బెల్లం మార్కెట్ ఏర్పడి 120 ఏళ్ళు అయింది. బ్రిటీష్ పాలన సమయంలో ఇక్కడ తయారయ్యే బెల్లానికి ఎంతో డిమాండ్ ఉండేది. అప్పట్లో ఈ మార్కెట్ అనకాపల్లి లోని బాలాజీ పేటలో ఉండేది. అయితే 2002 లో దీన్ని ప్రస్తుతం ఉన్న ప్రదేశంలోకి మార్చారు.  ఏకంగా 32-33 ఎకరాల విస్తీర్ణంలో ఈ బెల్లం మార్కెట్ విస్తరించి ఉంది. అనకాపల్లి మాత్రమే కాకుండా మాడుగుల, చోడవరం, యలమంచిలి ప్రాంతాల నుండీ గోదావరి జిల్లాల నుండి చెరుకును ఇక్కడికి తెస్తుంటారు రైతులు. వాటి నుండి చెరుకు రసం తీసి తమదైన పద్దతిలో బెల్లాన్ని తయారు చేస్తుంటారు ఇక్కడి వ్యాపారులు. ఇక్కడ తయారయ్యే బెల్లానికి నార్త్ ఇండియాలో డిమాండ్ బాగా ఉంది. అక్కడి స్వీట్ మార్కెట్స్ లో అనకాపల్లి బెల్లం అంటే మంచి క్రేజ్ ఉంది. అయితే అన్ సీజన్ కు తోడు .. వారం రోజులుగా ముంచెత్తిన వర్షాలు అనకాపల్లి బెల్లం మార్కెట్ పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి వ్యాపారులు చెబుతున్నారు. త్వరగా ఈ వరదలు పోతే.. తమ పరిస్థితి కాస్తైన మెరుగుపడుతుందని వివరిస్తున్నారు.