అనకాపల్లిలో డీఎస్పీగా పని చేస్తున్న బి. సునీల్ కుమార్ వివాదంలో ఇరుక్కున్నారు. ఓ స్మగ్లర్ వినియోగించిన వాహనంలో తిరుగుతూ దొరికిపోయారు. కొంత కాలం క్రితం ఆ కారు ఓ గంజాయి కేసులో పట్టుబడింది. సీజ్ చేసిన ఆ వాహనంలో తన కుటుంబ సభ్యులతో కలిసి షికారుకి వెళ్లి, అదే కేసులో పట్టుబడిన మరో కారు నంబర్ ప్లేటు తీసి దీనికి అంటించారు. అలా ఆ కారులో బయటికి వెళ్లిన సందర్భంలో విశాఖపట్నం బీచ్ వద్ద ఓ వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ విషయం మొత్తం బయటపడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సీజ్ చేసిన కారుని డీఎస్పీ తన పనులకు సొంతానికి వాడుకుంటున్నారని నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.


గతేడాది ఓ గంజాయి కేసులో పట్టుబడ్డ కారు
అనకాపల్లి జిల్లా కశింకోట మండలంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కారులో గంజాయి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన గతేడాది జులైలో జరిగింది. పోలీసులు అడ్డగించగానే వాళ్లు ఆ కారుని అక్కడే వదిలేసి పారిపోయారు. పోలీసులు ఆ కారును సీజ్‌ చేసి, పోలీస్ స్టేషన్‌కి తరలించారు. ఆ కారు ఎవరి పేరు మీద ఉందన్న విషయంపై ఆరా తీయగా జి.మాడుగులకు చెందిన సుల్తాన్‌ అజాహరుద్దీన్‌ పేరుతో రిజిస్టరు అయి ఉన్నట్లు గుర్తించారు. 


ఈ కేసు విచారణలో భాగంగా రాజస్థాన్‌కు చెందిన సింగ్‌ అనే వ్యక్తి జి.మాడుగులలోనే ఉంటూ గంజాయి వ్యాపారం చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. అతడు గతేడాది నవంబర్ 11న పోలీస్ స్టేషన్‌కి వచ్చిన సందర్భంలో విచారణ చేసి అతడ్ని అరెస్ట్ చేశారు. ఆ సమయంలో తాను వేసుకొచ్చిన కారుని తన తల్లికి అప్పగించాలని అతడు కోరాడు. అయితే, ఆమె రాజస్థాన్ వెళ్లిపోయారని తెలియడంతో, ఆ కారుని అనకాపల్లి గ్రామీణ పోలీస్‌ స్టేషన్‌లోనే ఉంచారు. అప్పటి నుంచి పోలీసులు దాన్ని వాడుతూ ఉన్నారు. 


ఈ క్రమంలోనే ఈనెల 1వ తేదీన డీఎస్పీ బి. సునీల్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఆ కారులో విశాఖపట్నం వెళ్లారు. బీచ్‌ రోడ్డులో ఆయన ఒక వాహనాన్ని ఢీకొట్టారు. అక్కడున్న కొంత మంది సోషల్ మీడియా ప్రియులు ఆ ఢీకొన్న దృశ్యాల్ని సెల్‌ ఫోన్‌లో చిత్రీకరించి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ కారు బండారం అంతా బయటికి వచ్చింది. 


ఈ వ్యవహారంపై జిల్లా ఎస్పీ గౌతమి స్పందించారు. ‘డీఎస్పీ సునీల్‌ గంజాయి కేసులో పట్టుబడ్డ నిందితుడి కారును వినియోగించినట్లుగా తమ దృష్టికి వచ్చిందని అన్నారు. నిందితుడి కారును సొంతానికి వాడుకోవడం ఒక నేరమైతే, నంబరు ప్లేటు మార్చడం మరో తప్పు అని ఆమె అన్నారు. దీనిపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారని, పూర్తి రిపోర్టును వారికి పంపుతామని తెలిపారు. అయితే, ఆ కారు నంబర్ ప్లేట్ మార్చిన విషయం తనకు తెలియదని డీఎస్పీ సునీల్ చెప్పారు. తాను ఆసుపత్రికి వెళ్లాలంటే, పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆ కారుని పంపారని, తాను ఉద్దేశపూర్వకంగా కారును తీసుకువెళ్లలేదని చెప్పుకొచ్చారు.