A Drunken Man climbed a power pole and slept on wires | పాలకొండ: మామూలుగానే కొందరు మందుబాబులు పెగ్ వేశారంటే ఇతరుల మాట వినరు. మంచి చెప్పినా కోప్పడతారు. దాడులు చేసిన ఘటనలు చూశాం. పార్వతీపురం మన్యం జిల్లాలో ఓ మందు బాబు చేసిన పని స్థానికులను కంగారు పెట్టింది. మద్యం మత్తులో ఏకంగా కరెంట్ స్తంభం పైకి ఎక్కి వైర్ల మీద హాయిగా నిద్రపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


గ్రామస్తులను హడలెత్తించిన మందుబాబు


పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం ఎం.సింగిపురంలో ఓ తాగుబోతు తన చేష్టలతో గ్రామస్థులను హడలెత్తించాడు. అసలే మద్యం సేవించి ఉన్నాడు. ఆపై కరెంట్ స్తంభం ఎక్కడానికి వచ్చాడు. వద్దని చుట్టుపక్కలవారు వారించినా మందుబాబు వారి మాట వినలేదు. మద్యం మత్తులో కరెంటు స్తంభంపైకి ఎక్కాడు. కరెంట్ పోల్ ఎక్కుతున్నట్లు గమనించి స్థానికులు అలర్ట్ చేయగా.. విద్యుత్ సరఫరా అయ్యే ట్రాన్స్ ఫార్మర్ నుంచి సప్లై ఆపేశారు. కరెంట్ స్తంభం ఎక్కిన మందుబాబు కిందకి దిగడానికి బదులుగా కరెంట్ తీగలపై ప్రశాంతంగా నిద్రపోయాడు. చుట్టుపక్కల వారు బలవంతంగా అతడ్ని వారించి అతికష్టం మీద కిందకు తీసుకొచ్చారు. తరువాత కరెంట్ స్తంభానికి పవర్ సప్లై పునరుద్ధరించారు. 


తల్లి పింఛన్ డబ్బులు ఇవ్వలేదని హల్చల్..
పాలకొండ మండలం ఎం.సింగపురం గ్రామంలో మద్యం మత్తులో యువకుడు హల్చల్ చేయడానికి కారణం తెలిసిందే. ఏపీ ప్రభుత్వం నెలకు ఒకరోజు ముందు నుంచే పింఛన్లు పంపిణీ చేస్తోంది. ఈ క్రమంలో డిసెంబర్ 31న యజ్జల వెంకన్న తల్లికి ఎన్టీఆర్ భరోసా పింఛన్ నగదు అందింది. మద్యం సేవించేందుకు తనకు డబ్బులు కావాలని అమ్మను అడిగితే అందుకు ఆమె నిరాకరించింది. తనకు డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో బయటకు వెళ్లి తాగొచ్చిన వెంకన్న వీధిలో హల్‌చల్ చేశాడు. కరెంట్ స్తంభం ఎక్కుతుంటే వారించినా వినలేదు. స్తంభం ఎక్కుతుంటే ట్రాన్స్‌ఫార్మర్ డీపీ స్విచ్ఛాఫ్ చేయడంతో ప్రమాదం తప్పింది.


Also Read: AP Liquor Policy: మద్యం షాపు యజమానులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, గీత కులాలకు 10 శాతం షాపులు కేటాయింపు