వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. ఇంట్లో చెప్పకుండా గుడిలో పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. ఓ ఆలయంలో పెళ్లి చేసుకుని సరదాగా బీచ్ కు వెళ్దాం అనుకునే లోపు ఊహించని పరిణామం ఎదురైంది. వివరాల్లోకి వెళితే.... విశాఖపట్నం ఏసిపి త్రినాథ్ తెలిపిన వివరాల ప్రకారం... మచిలీపట్నంకు చెందిన కావ్య, ఫనీంధ్రలు ప్రేమించుకున్నారు.  ఇంట్లో చెప్పకుండా ఈ నెల 2వ తేదీన విశాఖకు వచ్చారు. 


గోపాలపట్నంలోని లాడ్జీలో అద్దెకు తీసుకున్నారు.  అనంతరం  అక్కడ నుంచి అరకు వెళ్లారు.  తరువాత అప్పికొండ సముద్రతీరానికి వెళ్ళి అక్కడ కొండమీద శివాలయంలో ఇద్దరు పెళ్ళిచేసుకున్నారు. అదే సమయంలో సరదాగా సమీపం లో ఉన్న బీచ్ లోకి ఇద్దరు దిగారు. ఆదివారం సాయంత్రం తీరం వద్ద రాళ్లగుట్టలపై అమ్మాయి ఫోటోలు దిగుతుండగా ప్రమాదవశాత్తు ఎత్తు ప్రదేశం నుండి జారి పడిపోవడంతో రాళ్ల మధ్యలో కాలు ఇరుక్కుపోయాయి. కాపాడవల్సిన ప్రియుడు ఫణీంద్ర అక్కడ నుంచి వెళ్ళిపోయినట్టు అమ్మాయి చెప్పినట్టు పోలీసులు చెప్పారు.


సుమారు 23 గంటల పాటు సముద్రంలోనే రాళ్ళమధ్య అమ్మాయి నరకయాతన అనుభవించింది.  సముద్ర తీరానికి పిక్నిక్ వచ్చినవాళ్ళు అమ్మాయిని గమనించి స్ధానికులు ఆమెను కాపాడారు. దీంతో వారు పోలీసులకు సమాచారమిచ్చారు.  సకాలంలో స్పందించిన పోలీసులు సముద్రతీరానికి చేరుకుని అంబులెన్సు రప్పించి చికిత్సనిమిత్తం కెజిహెచ్ కు తరలించారు.


మరోవైపు మచిలిపట్నం వెళ్ళినట్లు అమ్మాయి తల్లిదండ్రులు బందరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు.  కేసు నమోదు చేసిన పోలీసులు ధర్యాప్తు ప్రారంభించగా.... ప్రేమికులు విశాఖలో వున్నట్టు పోలీసులు గుర్తించారు. పోలీసులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. విశాఖకు చేరుకుని కేజిహెచ్ లో ఉన్న కావ్యను పోలీసులు విచారించారు. దీంతో జరిగిన విషయం మొత్తం పోలీసులకు, తల్లిదండ్రులకు ప్రేయసి కావ్య వివరించింది. అలాగే పారిపోయిన ప్రియుడు ఫణీంద్ర కోసం పోలీసులు గాలిస్తున్నారు. 


ప్రేమికుడు ఫణీంధ్ర అప్పికొండ బీచ్ నుంచి ఎక్కడికి వెళ్ళాడు?  అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు ఏసిపి త్రినాథ్ పేర్కోన్నారు.  మొబైల్ రింగ్ అవుతున్న లిఫ్ట్ చెయ్యడం లేదని అన్నారు.  మొబైల్ ట్రాక్ చేస్తే ఎక్కడున్నాడో తెలుస్తుందని అన్నారు.  ఫణీంద్ర దొరికితే ఏం జరిగింది? ఎందుకు పారిపోయాడు  అనే విషయాలు తెలుస్తాయని ఏసిపి చెప్పారు.


రాత్రంతా మృత్యువుతో


చిమ్మ చీకటి.. జన సంచారం లేని ప్రదేశంలో అమ్మాయి రాత్రంత మృత్యువుతో  పోరాడింది.  సోమవారం బీచ్ కు  వచ్చిన కొందరు యువకులు ఆమెను చూడగా యువతి రెండు కాళ్లకు గాయాలయ్యాయి.  దీంతో స్థానికులు సహాయంతో 108 అంబులెన్స్ లో కేజీహెచ్ కు తరలించారు. కాలుజారి పడిపోయానని, పరారీలో ఉన్న యువకుడిని ఏమనవద్దని అమ్మాయి చెబుతోంది. దీంతో పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఆసుపత్రికి చేరుకున్న తల్లితండ్రులు కుమార్తెను చూసి బోరున విలపించారు. తమ కుమార్తె కనిపించడం లేదని ఇటీవల బందరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తల్లి వెల్లడించింది. మొదట కిడ్నాప్ కేసుగా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే పరారీలో ఉన్న ప్రియుడుకి ప్రమాదం జరిగిందని ఊహాగానాల వినిపిస్తున్నాయి. కానీ దీనిపై పోలీసులు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ప్రియుడు ఆచూకీ దొరికితే పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు భావిస్తున్నారు.