Visakha Zoo Park : విశాఖ జూపార్క్ లో ఆకతాయిలు హల్ చల్ చేశారు. అడవి పందుల ఎన్ క్లోజర్ లోపలికి యువకులు దూకిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో జూ అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు చేశారు. ఇన్ స్టాగ్రామ్ లో పోస్టుచేసిన ఈ వీడియో జులై 9న జూపార్క్ అధికారుల దృష్టి వచ్చింది. ఈ వీడియోలో కొంతమంది గుర్తు తెలియని సందర్శకులు అడవి పంది ఎన్‌క్లోజర్‌లోకి ప్రవేశించి జంతువును వెంబడించి ఆటపట్టించారు. జూలో జంతువుల ఎన్ క్లోజర్ లోపలికి వెళ్లి జంతువులను ఆటపట్టించినందుకు వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు జూ అధికారులు తెలిపారు.  


ఐదుగురు అరెస్టు 


అంతేకాకుండా వీడియోలోని యువకులను గుర్తించేందుకు జులై 12న జూ పార్క్ అధికారులు అరిలోవ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ వీడియోను అప్‌లోడ్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాదారుడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో త్వరితగతిన విచారణ జరపాలని, నేరస్థులపై చర్యలు తీసుకోవాలని డీసీపీ సుమిత్ గరుడ్ ను క్యూరేటర్ కోరారు. ఈ కేసులో విచారణ చేపట్టిన పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. జులై 3న మరికవలస నుంచి  ఐదుగురు సందర్శకులు జూ చూసేందుకు వచ్చారు. జూ పార్కులో అడవి పందులు ఉన్న ఎన్ క్లోజర్ లోకి ప్రవేశించి వాటిని ఆటపట్టించారు. ఎన్‌క్లోజర్ లోపలికి వెళ్లిన యువకులు జంతువులను ఇబ్బంది పెట్టారు, ఈ ఘటనను వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేశారు.


సిబ్బంది నిర్లక్ష్యంపై ఆరా 


ఆ సమయంలో జూ సిబ్బంది అక్కడ లేకపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. జూ సందర్శన వేళల్లో శాకాహార విభాగంలో ఉన్న సెక్యూరిటీ గార్డు దాదాపు 8 జంతు ఎన్‌క్లోజర్‌లను కవర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి, సెక్యురిటీ గార్డు శాకాహారి విభాగం మరొక చివరలో ఉండే  అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఈ ఘటనపై సెక్యూరిటీ ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీ విచారణ జరిపి అవసరమైన చర్యలు తీసుకుంటుందని జూ అధికారులు తెలిపారు. సిబ్బంది నిర్లక్ష్యంపై కూడా విచారణ చేస్తున్నట్లు తెలిపారు. జూ సెక్యూరిటీ ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీని హెర్బివోర్ సెక్షన్‌లో మరో సెక్యూరిటీ సిబ్బందిని నియమించాలని ఆదేశించారు.  జంతు సంరక్షకులు, భద్రతా సిబ్బంది, జూ కార్యనిర్వాహక సిబ్బంది జంతువుల ఎన్‌క్లోజర్‌ల చుట్టూ అన్ని సమయాలలో కఠినమైన నిఘా ఉంచాలని క్యూరెటర్ సూచనలు చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఎన్‌క్లోజర్ ఎత్తు పెంచుతున్నట్లు తెలిపారు. 


అసలేం జరిగింది?


విశాఖకు జూలో ముగ్గురు యువకులు జులై 9న ఎన్‌క్లోజర్‌ దూకి అడవి పందులున్న చోటుకు వేగంగా పరిగెత్తి అడవి పందులను ఆటపట్టించాలని ప్రయత్నించారు. దీంతో ఒక అడవిపంది ఎదురు తిరిగి వెంట పడడంతో యువకులు భయంతో పరుగులు తీశారు. ఒక యువకుడి కాళ్లలో చొరబడిన పంది ఆ యువకుడిని కిందకు పడవేసి పారిపోవడంతో ఆ యువకుడు బతుకు జీవుడా అంటూ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అయితే ఈ 15 సెకన్ల వీడియోని తన ఇంస్టాగ్రామ్ లో అప్ లోడ్ చెయ్యడంతో పాటు వైజాగ్ జూ అకౌంట్ ని కూడా టాగ్ చెయ్యడంతో అది వైరల్ అయింది. దీనిపై జూ అధికారులు పోలీసులకు కంప్లైంట్ చెయ్యగా ఆ యువకులను గుర్తించిన ఆరిలోవ పోలీసులు సాయి గణేష్ ,జస్వంత్ సాయి,సంపత్ సాయి,లక్ష్మణ రావు,దిలీప్ కుమార్ అనే 5గురుని అదుపులోకి తీసుకున్నారు. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కింద వీరిపై కేసు నమోదు చెయ్యగా వీరికి ఆ చట్టం ప్రకారం 6 నెలల వరకూ శిక్ష పడే అవకాశం ఉంది. వీరంతా 19 ఏళ్ల వయసు వారు కావడం గమనార్హం. కేవలం సోషల్ మీడియాలో ఫేమస్ కావాలనే వీరు ఎంక్లోజర్ లోకి ప్రవేశించే ప్రయత్నం చేశారు. ఈ దృశ్యాలన్నింటినీ చిత్రీకరించిన సహచరులు సోషల్ మీడియాలో పోస్టు చేయడం, అది వైరల్ కావడంతో ‘జూ’ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి యువకులను అరెస్టు చేశారు.