Karanam Dharma Sri : ఏపీలో 1998 డీఎస్సీ ఎందరో జీవితాలను మార్చేసింది. ఉద్యోగాలు కోసం సుమారు 23 ఏళ్ల పాటు అభ్యర్థులు వేచిచూడాల్సిన పరిస్థితి వచ్చింది. డీఎస్సీపై న్యాయస్థానంలో కేసులు ఉండడం ఇన్నాళ్లు పెండింగ్ పడుతూ వచ్చింది. తాజాగా ఈ వివాదాలు పరిష్కారం అవడంతో రాష్ట్ర ప్రభుత్వం అడుగు ముందుకేసింది. 1998 డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాల కేటాయింపు ఫైల్ పై సీఎం జగన్ సంతకం చేసినట్లు తెలుస్తోంది. 23 ఏళ్ల తర్వాత ఉద్యోగాలు వచ్చాయన్న ఆనందించాలా, రిటైర్మెంట్ వయసులో ఉద్యోగాలు వచ్చాయని విచారించాలో అభ్యర్థులకు అర్థం కాని సందిగ్ధంలో ఉన్నారు. అయితే ఈ డీఎస్సీకి ఎంపికైన ఓ అభ్యర్థి ఏ ఆధారం లేని పరిస్థితిలో బిక్షాటన చేస్తున్న ఘటన సంచలనమైతే... అప్పుడు డీఎస్సీ రాసి ఇప్పుడు ఉద్యోగానికి ఎంపికైన ఓ వ్యక్తి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.

  


23 ఏళ్ల తర్వాత ఉద్యోగం 


1998 డీఎస్సీ రాసిన కరణం ధర్మశ్రీ 23 ఏళ్ల తర్వాత ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. కరణం ధర్మ శ్రీ ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. 1998 డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాల ఫైల్ పై సీఎం జగన్ తాజాగా సంతకం చేశారు. ఈ జాబితాలో కరణం ధర్మశ్రీ పేరు కూడా ఉంది. బీఏ సోషల్, ఇంగ్లిష్ పోస్టుకు ధర్మశ్రీ 1998లో డీఎస్సీ రాశారు. కోర్టు వివాదాల కారణంగా 1998 డీఎస్సీ అభ్యర్థులకు అప్పట్లో ఉద్యోగాలు ఇవ్వలేదు. అనంతరం కరణం ధర్మ శ్రీ రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన విభాగంలో ఆయన పనిచేశారు. మాడుగుల ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ తరపున తొలిసారి 2004లో గెలిచారు. 


సీఎం జగన్ కు కృతజ్ఞతలు 


తాజాగా ఎమ్మెల్యే ధర్మ శ్రీ టీచర్‌గా ఎంపిక కావడంపై మాట్లాడుతూ.. డీఎస్సీ రాసినప్పుడు తన వయసు 30 సంవత్సరాలన్నారు. ఉపాధ్యాయుడిగా స్థిరపడాలని ఎన్నో కలలకు కన్నానన్నారు. అప్పట్లో ఉద్యోగం వస్తే ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడిపోయేవాడినన్నారు. సమాజ సేవకు ఉపాధ్యాయ వృత్తి ఉన్నతమైనదన్న ఎమ్మెల్యే ధర్మ శ్రీ అప్పట్లో ఉద్యోగం వచ్చి ఉంటే బడి బడికి తిరిగేవాడినన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా గడప గడపకు తిరుగుతున్నానని గుర్తుచేసుకున్నారు. డీఎస్సీ 1998 బ్యాచ్ తరపున సీఎం జగన్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అప్పట్లో డీఎస్సీకి ఎంపికైన వారిలో కొందరు కూలీలుగా మారిపోతే,  మరికొందరు వేర్వేరు వృత్తుల్లో స్థిరపడ్డారు. ధర్మశ్రీ రాజకీయాల్లోకి వచ్చి రెండుసార్లు ఎమ్మెల్యే గెలుపొందారు.