Fish Tunnel Exhibition : అక్వేరియంలు మనకు కొత్తకాదు. రకరకాల చేపలను ఒకేచోట చూసేందుకు వీలుగా వివిధ నగరాల్లో కాస్త పెద్ద పెద్ద అక్వేరియంలే అందుబాటులో ఉన్నాయి . అయితే వైజాగ్ లో తాజాగా ఏర్పాటైన అండర్ వాటర్ టన్నెల్ ఇక్కడి ప్రజలను విపరీతంగా ఆకర్షిస్తుంది. విశాఖ లోని బీచ్ రోడ్ లో గల ఆంధ్ర యూనివర్సిటీ కన్వెన్షన్ హాల్, పోలీస్ ఆఫీసర్స్ మెస్ సమీపంలో జరుగుతున్న ఎగ్జిబిషన్ లో ఈ అండర్ వాటర్ టన్నెల్ ఫిష్ ఎక్స్పో ను ఏర్పాటు చేశారు. ఈ ఫిష్ ఎక్స్పో లో దాదాపు 2 వేలకుపైగా వివిధ రకాల చేపలను ప్రదర్శనకు ఉంచారు. అదీ కూడా అండర్ వాటర్ టన్నెల్ విధానంలో అంటే ఒక గాజు సొరంగంలో మనం వెళుతూ ఉంటే మన చుట్టూ చేపలు ఈదుతూ ఉంటాయి. ఈరకం అనుభూతి వైజాగ్ వాసులకు కొత్త కావడంతో ఈ ఎగ్జిబిషన్ కు భారీగా వస్తున్నారు .
ప్రదర్శనలో ప్రత్యేక చేపలు
ఇక్కడ ప్రదర్శనకు ఉంచిన చేపల్లో 500 రకాలు అరుదైనవి. అమెజాన్ నదిలో తిరిగే చేపలు .. సింగపూర్ .. మలేషియా లాంటి దేశాల్లో మాత్రమే దొరికే ఖరీదైన ఎగ్జోటిక్ చేపలతో పాటు సముద్ర జలచరాలను కూడా చూసి పిల్లలు పెద్దలు సంబర పడుతున్నారు. ఇక వీటన్నిటిలోనూ సముద్రంలో తిరిగే లయన్ ఫిష్ .. పాము లాంటి ఆకారంతో భయపెట్టే మోరే ఈల్ లాంటి చేపజాతికి చెందిన ప్రాణులు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. ఈ చేపల సేకరణకు వాటి నిర్వహణకు దాదాపు నాలుగున్నర కోట్ల వ్యయం అయిందని అయినప్పటికీ ఎంట్రీ ఫీజ్ ఒకొక్కరికీ 100 రూపాయలు చొప్పున మాత్రమే వసూల్ చేస్తున్నామన్నారు. పార్కింగ్ ఫీజు ఏం ఉండదని ఆర్గనైజర్ చెబుతున్నారు. వచ్చే వేసవి వరకూ ఈ టన్నెల్ ఎక్స్పో కొనసాగుతుందని వారు అంటున్నారు . ఈ ప్రదర్శన చూడడానికి వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలే కాకుండా ఒడిశా, బెంగాల్ ల నుంచి వచ్చే టూరిస్టులు ఎక్కువగా వస్తున్నట్టు, ఆర్గనైజర్ రాజారెడ్డి అంటున్నారు .
మైసూర్, .చెన్నైలో బాగా పాపులర్
ఇలా అండర్ వాటర్ ఫిష్ ఎక్స్పో లు ఇంతవరకూ చెన్నై .. మైసూర్ లలో మాత్రమే ఉన్నాయి. వాటిని చూడడానికి మన ప్రాంతాల నుండి వెళ్లే టూరిస్టులూ అధికమే. ఇప్పుడు అలాంటి అవకాశం తొలిసారిగా వైజాగ్ కు రావడం తో ఇక్కడి జనాలకు మరో టూరిస్ట్ డెస్టినేషన్ అందుబాటులోకి వచ్చినట్లయింది. ఇక్కడ ఏర్పాటు చేసిన టన్నెల్ ఫిష్ ఎక్స్పో మైసూర్ లాంటి నగరాల్లో ఏర్పాటు చేసిన దానికంటే విశాలమైంది కావడం గమనార్హం . మరి ఇంకెందుకు ఆలస్యం ఏమాత్రం అవకాశం ఉన్నా ఈ అండర్ వాటర్ టన్నెల్ ఫిష్ ఎక్స్పో పై ఓ లుక్కేసెయ్యండి.
అరుదైన చేపలు
ఇక్కడ ఎగ్జిబిషన్‌లో ఉన్న మరో అరుదైన చేప రకం లయన్ ను ప్రదర్శించారు. ఈ చేప చాలా విషపూరితమైంది. ఇతర ప్రాణుల నుంచి తనను తాను రక్షించుకోడానికి ఈ చేప శరీరం చుట్టూ విషపూరితమైన ముళ్లు ఉంటాయి. మరో చేప పేరు రెడ్ టైల్, పెద్ద పెద్ద మీసాలతో కనిపించే చేప. ఇది మంచి నీళ్లలో మాత్రమే జీవిస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ చేప 60 సంవత్సరాలు జీవిస్తుందంటున్నారు. ఎగ్జిబిషన్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న మరో చేప ఆస్కార్. ఇది చాలా తెలివైన చేపగా చెబుతున్నారు. ఇంకా ఎన్నో రకాలు అరుదైన చేపలను ప్రదర్శనకు పెట్టారు.