BJP Janasena :  జనసేన తో కలిసి 2024 ఎన్నికలకు వెళ్తున్నామని బీజేపీ నేత సునీల్ దియోధర్ అన్నారు. విశాఖలో మాట్లాడిన ఆయన... వైసీపీ, టీడీపీ కుటుంబ సభ్యుల పాలనకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ ను పునర్నిర్మించడం బీజేపీ-జనసేన కూటమికే సాధ్యమన్నారు. బీజేపీ నేత మాధవ్ ను మళ్లీ పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిపించాలని  సునీల్ దియోధర్ విజ్ఞప్తి చేశారు.  ప్రాంతీయ పార్టీలతో రాష్ట్ర, దేశ ప్రయోజనాలకు ఒరిగేదేమీ ఉండదన్నారు. ఏపీలో కుటుంబ పార్టీలు రాజ్యమేలుతున్నాయని విమర్శించారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రానికి న్యాయం చేయగలిగేది ఒక్క బీజేపీ జనసేనతో మాత్రమేనని స్పష్టం చేశారు. బీజేపీ-జనసేన మధ్య పొత్తు కొనసాగుతుందని మరోసారి తేల్చిచెప్పారు. వైసీపీ, టీడీపీ విఫల పార్టీలని సునీల్ దియోధర్ విమర్శించారు.


జనసేన-బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఎమ్మెల్సీ మాధవ్ 


ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన-బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్టు ఎమ్మెల్సీ మాధవ్ తెలిపారు. గత కొన్ని సంవత్సరాల నుంచి ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ స్థానాన్ని బీజేపీ గెలుచుకుంటూ వస్తుందన్నారు. పార్టీ ఆదేశాలు మేరకు మరోసారి ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేస్తున్నానని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో జనసేన పార్టీతో కలసి ముందుకు వెళ్తామన్నారు. ఉత్తరాంధ్ర పట్టభద్రులు తమ ప్రాధాన్యత ఓటును వేయవాల్సిందిగా తనకు వేయాలని కోరారు. ఉత్తరాంధ్రలో కేంద్ర ప్రభుత్వం సహాయంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో పెట్టుకున్న ఆశయాలను 100 శాతం పూర్తి చేశామన్నారు. ము. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ను సాధించుకున్నామని తెలిపారు.


ఉత్తరాంధ్ర సమస్యలు పరిష్కరిస్తున్నాం 


'ఉత్తరాంధ్రలో ఉన్న 34 నియోజకవర్గాలలో జాతీయ రహదారులను నిర్మించాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రకటన వచ్చిన వెంటనే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని కలిసి సెయిల్ లో కలపమని కోరాం. విశాఖలో ఉన్న పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరిస్తూ వస్తున్నాం. విశాఖ అభివృద్ధిలో మా వంతు కృషి చేస్తున్నాం. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న సమస్యలు పరిష్కరంలో కీలకపాత్ర పోషిస్తున్నాం.' - ఎమ్మెల్సీ మాధవ్ 


టీడీపీకి దెబ్బే! 


బీజేపీ-జనసేన ఉమ్మడి ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాధవ్ పేరు ప్రకటించారు. మాధవ్ అభ్యర్థిత్వాన్ని బీజేపీ ఏపీ సహ ఇన్ ఛార్జ్ సునీల్ దియోధర్ ప్రకటించారు. 2024లోనూ ఇదే పొత్తు కొనసాగుతుందన్నారు. బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి ప్రకటనతో టీడీపీకి గట్టిదెబ్బ తగిలిందంటున్నారు విశ్లేషకులు. జనసేనతో దోస్తీ కట్టేందుకు చూస్తున్న టీడీపీకి పొత్తు సాధ్యపడేలా కనిపించడంలేదని అంటున్నారు. జనసేనతో పొత్తు పెట్టుకుని 2024 నాటి సార్వత్రిక ఎన్నికలకు వెళ్లాలని టీడీపీ ఆశిస్తుంది. కానీ అది అంత సులభం కాదని ఎమ్మెల్సీ ఎన్నికలు స్పష్టం చేస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్ గా చెబుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ-జనసేన కలిసి పోటీ చేస్తున్నట్లు ప్రకటించాయి. ఇప్పటికే ఉమ్మడి అభ్యర్థిని ప్రకటించారు.   


ఎమ్మెల్సీ ఎన్నికలు 


ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగింది. స్థానిక సంస్థలు, ఉపాధ్యాయులు, పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం ఇటీవల  షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీలో 8 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 16న నోటిఫికేషన్ వెలువడనుండగా, నామినేషన్లకు చివరి తేదీ ఫిబ్రవరి 23 గా ఉంది. మార్చి 13న పోలింగ్, మార్చి 16న కౌంటింగ్ ఉండనుంది. స్థానిక సంస్థల నియోజకవర్గాల్లో ఏపీ నుంచి అనంతపురం, కడప, నెల్లూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, శ్రీకాకుళం, చిత్తూరు, కర్నూలు, తెలంగాణ నుంచి హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం ఉన్నాయి.