Minister RK Roja : 2024 ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబును బాదడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని మంత్రి ఆర్కే రోజా స్పష్టం చేశారు. చంద్రబాబు చేస్తుంది పోరాటం కాదని, అధికారంపై ఆరాటం అన్నారు. పోటీ అయినా పోరాటం అయినా సింగిల్ గా సింహంలా జగన్ రెడ్డి వస్తారన్నారు. చంద్రబాబుకు ఆ దమ్ముందా? అని ప్రశ్నించారు. టీడీపీ అనుకూల విద్యాలయాల నుంచి 10వ తరగతి పరీక్షా పేపర్లు లీక్ చేయించి గందరగోళం సృష్టిస్తున్నారన్నారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతూ రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవన్న ప్రచారం చేస్తోంది టీడీపీ నేతలే అని రోజా సంచలన ఆరోపణలు చేశారు. అయ్యన్న పాత్రుడు తల్లి, భార్య, అక్క చెల్లెళ్లు లేరా? అని ప్రశ్నించిన రోజా, అయ్యన్న మహిళా నేతల పట్ల ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మీ ఇంటిలోని ఆడవాళ్లను ఎవరైనా అంటే మీరు ఊరుకుంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


సెల్వమణి ఉద్దేశం అదికాదు 


సెల్వమణి  చేసిన వ్యాఖ్యలపై మంత్రి రోజా స్పందించారు.  సెల్వమణి సౌత్ ఇండియా టెక్నీషియన్స్ కు అధ్యక్షుడని, ఏ రాష్ట్రానికి సంబంధించిన కార్మికులు ఆ రాష్ట్రంలోనే పని చేసేలా ఉంటే అందరికీ ఉపాధి లభిస్తుందని సెల్వమణి ఉద్దేశం అన్నారు. విశాఖలో షూటింగ్స్ చేయమని ప్రభుత్వం అడిగినా నిర్మాతలు ఎందుకు చేయడం లేదన్నారు. 


సెల్వమణి వివాదాస్పద వ్యాఖ్యలు 


ఆర్కే సెల్వమణి ప్రస్తుతం ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియాకి అధ్యక్షుడిగా, తమిళనాడు సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. చెన్నైలోని ఓ సినీ పరిశ్రమకు సంబంధించిన ఓ కార్యక్రమంలో రెండ్రోజుల క్రితం ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్, వైజాగ్ లలో సినిమా షూటింగులు ఆపేయాలని తమిళ సినీ పరిశ్రమను కోరారు. పక్క రాష్ట్రాల్లో షూటింగులు జరపడం వల్ల తమిళ ఇండస్ట్రీకి చెందిన వేలాది మంది సినీ కార్మికులు చాలా నష్టపోతున్నారని చెప్పారు. 





తమిళ సినీ పరిశ్రమకు చెందిన పెద్ద హీరోలు మన రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రాల్లో హైదరాబాద్, వైజాగ్‌లలో కూడా షూటింగ్‌లు చేపడుతున్నారని అన్నారు. కథ డిమాండ్ మేరకు షూటింగులు ఎక్కడ జరుపుకున్నా అభ్యంతరం లేదని అన్నారు. కానీ, భద్రతను సాకుగా చూపుతూ పొరుగు రాష్ట్రాల్లో షూటింగులు జరపడం సరికాదని చెప్పారు. పయనూరులో దేశంలోనే అతి పెద్దదని, ఆసియాలోనే రెండో అతిపెద్ద ఫ్లోర్ ను తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు. అలాగే ఎత్తైన ప్రహరీ గోడతో 15 ఎకరాల సువిశాలమైన విస్తీర్ణం ఉందని చెప్పారు. అక్కడ ఎలాంటి భయం లేకుండానే షూటింగులు చేసుకోవచ్చని అన్నారు. అజిత్ ప్రతిచిత్రం దాదాపు హైదరాబాద్‌లోనే చిత్రీకరణ జరుపుకుంటోందని, దీనివల్ల తమిళ సినీ కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.