Nadendla Manohar : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రచార రథం రంగుపై వైసీపీ నేతల విమర్శలకు ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ కౌంటర్ ఇచ్చారు. పవన్ వెహికల్ కు ఏ రంగు వాడలో మాకు తెలియదా? అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వంలా రంగుల విషయంలో హై కోర్టుతో మొట్టికాయలు తినే అలవాటు మాకు లేదన్నారు. మైకుల ముందు వ్యక్తిగత దూషణలకు పాల్పడడం తప్ప వైసీపీ నేతలకు ఏంతెలుసని మండిపడ్డారు. ప్రచార రథం సిద్ధమైందని పవన్ ప్రకటించగానే విమర్శలు చేయడానికి మైకుల ముందు సిద్ధమయ్యామని ఎద్దేవా చేశారు. జనసేన పార్టీ ప్రతి విషయాన్ని పూర్తిగా అధ్యయనం చేశాకే నిర్ణయం తీసుకుంటుందన్నారు. పవన్ ప్రచార వాహనం రంగుపై వైసీపీ నేతలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నారన్నారు.
ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు
జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విశాఖపట్నంలో పార్టీ ఐటీ విభాగం ప్రతినిధులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ కార్యాయాలకు పార్టీ రంగులు వేసి హైకోర్టుతో లెక్కకు మించి మొట్టికాయలు తిన్న వారు కూడా జనసేన పార్టీ వారాహి వాహనం రంగు గురించి మాట్లాడటం, నిబంధనల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. వారాహి వాహనం నిబంధనలకు అనుగుణంగా సిద్ధం అవుతోందన్నారు. నిబంధనలు పరిశీలించకుండా, ఏ రంగు వేశారో చూడకుండా రవాణా శాఖ వారు అనుమతి ఎలా ఇస్తారన్నారు. ఏ మాత్రం ఆలోచన లేకుండా విమర్శలు చేయడం వైసీపీ నాయకుల బుద్ధిరాహిత్యాన్ని, మూర్ఖత్వాన్ని తెలుపుతోందన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు ఇష్టానుసారం పార్టీ రంగులు వేసుకునే వారికి నిబంధనలు ఏం తెలుస్తాయన్నారు.
పవన్ పర్యటనతో పెను ప్రకంపనలు
జనసేన పార్టీ ఎల్లప్పుడు నిబంధనల ప్రకారం మాత్రమే నడుచుకుంటుందని నాదెండ్ల మనోహర్ అన్నారు. పవన్ కల్యాణ్ చేపట్టే ప్రతి కార్యక్రమం ప్రజాహితంగా, చట్టానికి లోబడి ఉంటుందన్నారు. వైసీపీ నాయకులకు వ్యక్తిగత విమర్శలు చేయటం అలవాటుగా మారిపోయిందన్నారు. వాళ్లకు పవన్ ఒక్కసారి చెప్పు చూపిస్తే భయపడ్డారన్నారు. అది నిజాయతీకి ఉన్న దమ్ము అని నాదెండ్ల తెలిపారు. ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధిపై జనసేన పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు. ఉత్తరాంధ్రలో జనసేన పార్టీ త్వరలోనే చేపట్టబోయే కీలక కార్యక్రమం గురించి శుక్రవారం ప్రకటిస్తామన్నారు. పవన్ కల్యాణ్ రాష్ట్ర పర్యటన రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తుందన్నారు. రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ కాస్త వైస్సార్సీపీ ఆర్టీసీగా మారిపోయిందన్నారు. పార్టీ కార్యక్రమాలకు ప్రభుత్వ బస్సులు వాడుకోవడం సిగ్గుచేటని విమర్శించారు.
వైసీపీ పాలన వైఫల్యాలు ప్రజలకు చెప్పాలి
"14 ఎకరాలు కబ్జా చేస్తున్న వారిని ప్రశ్నించినందుకు అనంతపురం జిల్లా జన సైనికుడు సురేష్ మీద దాడికి పాల్పడ్డారు. అన్నమయ్య ప్రాజెక్టు బాధితులకు జనసేన పార్టీ పర్యటన ఉందని తెలిసి బాధితుల ఖాతాల్లో అప్పటికప్పుడు డబ్బులు వేశారు. బాధితులు సైతం మరోసారి పవన్ తమ ప్రాంతంలో పర్యటిస్తే తమ అందరికీ ప్రభుత్వం ఇల్లు కట్టిస్తుందని కోరుకుంటున్నారు అంటే అది ప్రజలకు జనసేన మీద ఉన్న నమ్మకం. వైసీపీ ప్రభుత్వ పాలన వైఫల్యాలు చెప్పడంతోపాటు ప్రజలకు అర్థమయ్యే విధంగా సాంకేతిక సైన్యం పని చేయాలి." - నాదెండ్ల మనోహర్