Chandrababu : ఏపీకి వైసీపీ పాలన వద్దు సైకిల్ పాలన ముద్దని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. నారాకోడూరు బహిరంగసభలో చంద్రబాబు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఇంటికి పంపడం ఖాయమన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైసీపీని బంగాళాఖాతంలో కలిపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. సీఎం జగన్‌కు నాలుగేళ్ల తర్వాత బీసీలు గుర్తుకు వచ్చారని అని చంద్రబాబు ప్రశ్నించారు. బీసీ సభకు రాకపోతే సంక్షేమ పథకాలు కట్ చేస్తామని బెదిరించారని ఆరోపించారు. సీఎం పదవి తనకు కొత్త కాదని, మీ పిల్లల భవిష్యత్తు కోసం తాను తాపత్రయపడుతున్నట్టు చెప్పారు. ధూళిపాళ్ల నరేంద్రను నేరుగా ఎదుర్కోలేక సంగం డెయిరీపై కేసులు పెట్టి వేధిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. సంగం డెయిరీని కాదని గుజరాతీ కంపెనీ అమూల్‌ను ప్రోత్సహించడంలో వైసీపీ ప్రభుత్వం అంతర్యమేంటని చంద్రబాబు ప్రశ్నించారు.
సంగం వద్దు, అమూల్ ముద్దు
సీఎం జగన్‌కి సంగం వద్దు, అమూల్ ముద్దు అని చంద్రబాబు అన్నారు. నాలుగేళ్ల తర్వాత సీఎం జగన్ కు బీసీలు గుర్తుకొచ్చార అంటూ మండిపడ్డారు. జయహో బీసీ సభకు నేతలను బలవంతంగా తరలించారని ఆరోపించారు. వైసీపీ సభకు రాకపోతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు తొలగిస్తామని బెదిరించారన్నారు. టీడీపీ సభలకు జనం స్వచ్ఛందంగా తరలివస్తున్నారన్నారు. వైసీపీని బంగాళాఖాతంలో కలిపేందుకు ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు గుంటూరు జిల్లా పర్యటనలో ఘన స్వాగతం పలికారు శ్రేణులు. పెదకాకాని వద్ద పొన్నూరు నియోజకవర్గంలో పర్యటనకు వచ్చిన చంద్రబాబు.. జాతీయ రహదారి మీదుగా బుడంపాడు చేరుకున్నారు. బుడంపాడు వద్ద చంద్రబాబును టీడీపీ శ్రేణులు గజమాలతో ఘనంగా స్వాగతించారు. బుడంపాడు నుంచి బైక్ ర్యాలీతో చంద్రబాబు పర్యటన మొదలైంది. నారా కోడూరు సభకు టీడీపీ కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా భారీగా వచ్చారు. గురువారం నుంచి మూడు రోజుల పాటు గుంటూరు, బాపట్ల జిల్లాలో చంద్రబాబు పర్యటన కొనసాగనుంది.
బాపట్ల జిల్లాలో రెండ్రోజుల పర్యటన
టీడీపీ అధినేత చంద్రబాబు బాపట్ల జిల్లాలో రెండు రోజులు పర్యటించనున్నారు. శుక్రవారం బాపట్ల, శనివారం చీరాలలో 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమంలో చంద్రబాబు పాల్గోనున్నారు. ఈ సభల్లో ప్రజలనుద్దేశించి మాట్లాడనున్నారు. బాపట్ల జిల్లాగా ఆవిర్భవించాక మొదటిసారి చంద్రబాబు జిల్లాలో పర్యటిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3.15 గంటలకు బాపట్ల మండలం చుండూరుపల్లి వద్ద టీడీపీ శ్రేణులు చంద్రబాబుకు ఘనంగా స్వాగతం పలకనున్నాయి. అనంతరం ర్యాలీగా బయలుదేరి బాపట్లలోని అంబేడ్కర్ కూడలి వద్ద ప్రజలనుద్దేశించి చంద్రబాబు మాట్లాడనున్నారు. శుక్రవారం రాత్రి ఇంజినీరింగ్ కళాశాలలో బస చేసి శనివారం ఉదయం ఎస్సీ నేతలు, కళాశాల విద్యార్థులతో చంద్రబాబు సమావేశం కానున్నారు. శనివారం చీరాలకు ర్యాలీగా వెళ్లి అక్కడ జరిగే బహిరంగసభలో మాట్లాడనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పర్చూరు, చిలకలూరిపేటల మీదుగా గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.