Waltair Veerayya : మెగాస్టార్ చిరంజీవి వాల్తేర్ వీరయ్య ప్రీ రిలీజ్ ఫంక్షన్ పై మళ్లీ కన్ఫ్యూజన్ నెలకొంది. ఏయూ గ్రౌండ్ లో ఫంక్షన్ చేసుకోమని చెప్పామని వైజాగ్ సీపీ శ్రీకాంత్ అన్నారు. సినిమా యూనిట్ ఏయూలో ఫంక్షన్ చేసుకుంటామని అప్లై చేశారని, పర్మిషన్ కూడా ఇచ్చామన్నారు. వైజాగ్ బీచ్ లో ఫంక్షన్ ఏర్పాటు గురించి సమాచారం లేదన్నారు. ఆదివారం బీచ్ లో పబ్లిక్ క్రౌడ్ ఎక్కువగా ఉంటుందని, భద్రతా సమస్యలు వస్తాయని సీపీ తెలిపారు.
ఏయూ గ్రౌండ్ వర్సెస్ ఆర్కే బీచ్
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమాకు కూడా ఇదే సమస్య ఎదురైంది. విశాఖపట్నంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జరపాలనుకున్నారు. కానీ అక్కడి పోలీసులు కూడా పర్మిషన్ ఇవ్వలేమని, లక్షల సంఖ్యలో అభిమానులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ట్రాఫిక్ ఆంక్షలు విధించాల్సి వస్తుందనే కారణంతో బీచ్ లో పర్మిషన్ ఇవ్వలేమని ముందుచెప్పారు. జనవరి 8వ తేదీ సాయంత్రం ఆర్కే బీచ్ రోడ్డులో ఈవెంట్ నిర్వహించేందుకు అనుమతి ఇచ్చినట్లు మళ్లీ వార్తలు వచ్చాయి. అయితే శనివారం మీడియాతో మాట్లాడిన సీపీ శ్రీకాంత్ ఆర్కే బీచ్ లో భద్రత సమస్యలు తలెత్తుతాయని తెలిపారు. అందువల్ల ఏయూ గ్రౌండ్ లో ఈవెంట్ నిర్వహించుకోవాలని కోరామన్నారు. ఆర్కే బీచ్ లో ఏర్పాట్లపై తమకు సమాచారంలేదన్నారు. పోలీసులు మళ్లీ ట్విస్ట్ ఇవ్వడంతో నిర్వాహకులు ప్రీ రిలీజ్ వేదికను ఏయూ గ్రౌండ్ కు మారుస్తున్నారు. మెగా అభిమానులు పోలీసులు తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
వీరసింహారెడ్డి విషయంలోనూ ఇదే తంతు
నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘వీరసింహా రెడ్డి’ సినిమా జనవరి 12న థియేటర్లలో సందడి చేయబోతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం జనవరి 6న ఒంగోలులో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. కానీ ఈ ఈవెంట్‌కు అక్కడి పోలీసులు ముందు పర్మిషన్ ఇవ్వలేదు. పట్టణం మధ్యలో ఈవెంట్ నిర్వహణపై పోలీసులు అభ్యంతరం తెలపడంతో నిర్వాహకులు ఈవెంట్ వేదికను ఒంగోలు శివారుకు తరలించారు. ట్రాఫిక్ సమస్యలు, ఇటీవల ప్రభుత్వం తెచ్చిన జీవో కారణం పట్టణంలో పర్మిషన్ ఇవ్వలేమని పోలీసులు చెప్పడంతో ఒంగోలు శివారులో ఈవెంట్ నిర్వహించారు.
అభిమానుల ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్‌లో మూవీ ఈవెంట్స్ జరగడమే అరుదు. ఇప్పుడు వస్తున్న ఒకటి రెండు ఈవెంట్స్‌ను కూడా అడ్డుకోడానికి ప్రయత్నిస్తే ఎలా అని అభిమానులు అంటున్నారు. ఒకప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సినిమా ఈవెంట్లు జరిగేవని, ఇప్పుడే ఎందుకు అభ్యంతరాలు ఎందుకు చెబుతున్నారంటూ ట్విటర్‌లో ఏపీ ప్రభుత్వం, అక్కడి పోలీసుల తీరుపై అభిమానులు రచ్చచేస్తున్నారు. కావాలనే తమ అభిమాన హీరోల సినిమాలను ఆపాలని చూస్తున్నారని, పైకి మాత్రం ట్రాఫిక్ కారణం అని చెబుతున్నారని కామెంట్లు పెడుతున్నారు.
టికెట్ ధరల పెంపు!
‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహారెడ్డి’ సినిమాలకు సంబంధించిన టికెట్ల ధరలను పెంచుకునే వీలును కూడా ఏపీ ప్రభుత్వం కల్పించింది. టికెట్లు ధర రూ.50 వరకు పెంచుకొనేందుకు అనుమతి ఇవ్వాలని కోరగా.. రూ.25 వరకు పెంచుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. ఇద్దరు అగ్ర హీరోల సినిమాలు ఒక రోజు వ్యవధిలో విడుదల కాబోతుండటంతో బాక్సాఫీసు వద్ద సందడి నెలకొంది. మరి ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ కింగ్‌గా ఎవరు నిలుస్తారో చూడాలి.