Vakapalli Case : వాకపల్లి అత్యాచారం కేసులో పోలీసులను కోర్టు నిర్దోషులకు తేల్చింది. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఒక గ్రామంలో 16 ఏళ్ల క్రితం 11 మంది గిరిజన మహిళలపై 21 మంది పోలీసులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ కేసులో 21 మంది పోలీసులను ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసును దర్యాప్తు చేయడంలో ఇద్దరు అధికారులు విఫలమైనందున నిందితులను నిర్దోషులుగా విడుదల చేసినట్లు కోర్టు తెలిపింది. ఏప్రిల్ 6 ఈ తీర్పును వెలువరించింది. SC, ST (POA) సెక్షన్ 3 (2) (v)లోని IPC సెక్షన్ 376 (2) (g) కింద నిందితులను దోషులుగా గుర్తించలేమని స్థానిక కోర్టు న్యాయమూర్తి తెలిపారు.
2007లో జరిగిన ఘటన ?
2007లో గ్రేహౌండ్స్, ప్రత్యేక బృందానికి చెందిన పోలీసులు గిరిజన మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఈ కేసుపై 2018లో విశాఖపట్నంలో విచారణ మొదలైంది. ఎస్సీ,ఎస్టీ (అట్రాసిటీ) చట్టం కింద కేసు నమోదు అయింది. సుదీర్ఘకాలం పాటు విచారించిన కోర్టు పోలీసులను నిర్దోషులుగా తేల్చింది. అత్యాచార ఘటనలో బాధితులకు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. హ్యూమన్ రైట్స్ ఫోరమ్ సభ్యుడు తెలిపిన వివరాల ప్రకారం ఈ కేసులో నిందితులు ఎవరూ అరెస్టు కాలేదు. ఆరోపణలు ఎదుర్కొన్న వారిలో కొందరు పోలీసులు పదవీ విరమణ చేయగా.. మరికొందరు చనిపోయారు. 2007 ఆగస్టులో గ్రేహౌండ్స్ బలగాలు 11 మంది గిరిజన మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డారని హ్యూమన్ రైట్స్ ఫోరమ్, కమిటీ ఉపాధ్యక్షుడు ఎమ్ శరత్ అన్నారు. నిందితులపై పోలీసులకు ఫిర్యాదు చేశారని, కానీ ఒక్కరిని కూడా అరెస్టు చేయలేదని ఆరోపించారు.
అప్పీల్ సమయం ముగిసిన తర్వాత బెయిల్ బాండ్‌లు రద్దు చేస్తామని న్యాయమూర్తి తెలిపారు. అదేవిధంగా కేసుకు సంబంధించిన ప్రొపర్టీ ఏదైనా ఉంటే అప్పీల్ తర్వాత ధ్వంసం చేయాలని ఆదేశించినట్లు న్యాయమూర్తి తెలిపారు. అయితే ఈ కేసులో దర్యాప్తు అధికారులలో ఒకరైన శివానంద రెడ్డి సరైన విచారణను నిర్వహించడంలో విఫలమైనందుకు చర్య తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అపెక్స్ కమిటీకి రిఫర్ చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు.
ఈ తీర్పు ఓ మైలురాయి
2007 ఆగస్టు 20న 21 మంది సభ్యుల ప్రత్యేక పోలీసు బృందం వాకపల్లి గ్రామానికి కూంబింగ్ ఆపరేషన్ల కోసం వెళ్లింది. ఆ గ్రామంలో గిరిజన వర్గానికి చెందిన 11 మంది మహిళలపై పోలీసుల బృందం లైంగిక దాడికి పాల్పడ్డారని హెచ్ఆర్ఎఫ్ ఆరోపించింది. వాకపల్లి అత్యాచార బాధితులకు పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించిందని అంటే కోర్టుకు బాధితుల వాదనలపై విశ్వాసం ఉందన్నారు. ఈ కేసులో విచారణ ప్రారంభం నుంచి సరిగ్గా జరగలేదని హెచ్ఆర్ఎఫ్ ఆరోపించింది. మానవ హక్కుల వేదిక (హెచ్‌ఆర్‌ఎఫ్) సభ్యులు ఈ కేసులో తీర్పు ఒక మైలురాయి అన్నారు. వాకపల్లి మహిళలు న్యాయం కోసం తమ డిమాండ్‌లో గట్టిగా నిలబడ్డారని అన్నారు. నిరక్షరాస్యులైనప్పటికీ ఒకటి కంటే ఎక్కువ విధాలుగా తమ పోరాటాన్ని కొనసాగించారన్నారు. అవమానాలను ధైర్యంగా ఎదుర్కొని పోరాడారన్నారు.