BJP MP GVL : వచ్చే  నాలుగు రోజులూ విశాఖలో ఉండి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాధవ్‌ను గెలిపించుకుంటామని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. దేశ వ్యాప్తంగా బీజేపీ గాలివీస్తోందన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లోనూ కమలం వికసించిందన్నారు. కమ్యూనిస్టుల కంచుకోట త్రిపురలో వరుసగా రెండోసారి విజయం ప్రధాని మోదీ జనాదరణకు నిదర్శనం అన్నారు. డబుల్ ఇంజన్ పాలన ఎంత సమర్థంగా సాగుతుందో ప్రజలు గుర్తించారన్నారు. నాగాలాండ్‌లో క్రిస్టియన్లు అధికంగా ఉంటారని, అయినా బీజేపీ అధికారం ఇచ్చారన్నారు. కాంగ్రెస్‌ను ఈశాన్య రాష్ట్రాల ప్రజలు తిరస్కరించారని విమర్శించారు. రాహుల్ గాంధీ జోడో యాత్ర తర్వాత ఈశాన్య రాష్ట్రాల్లో ఫలితం ఇలా వచ్చాయన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్, కమ్యూనిస్టులు సహా పలువురు చేతులు కలిపినా ఫలితం లేదన్నారు. 2024లో దిల్లీని మరింత మెజారిటీతో నిలుపుకుంటామన్నారు. ఇక దక్షిణాదిని కూడా జయిస్తామన్నారు. ప్రస్తుతం ఏపీలో బీజేపీకి ఎమ్మెల్యేలు లేరని, కనీసం కౌన్సిల్లో బీజేపీ గళం వినబడితే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాధవ్‌ను గెలిపించాలన్నారు. ఎన్నికల తర్వాత కనిపించని నేతలను ఎన్నుకోవద్దన్నారు. కేంద్ర సంస్థలు, సమస్యలు అనేకం ఉత్తరాంధ్రలో ఉండడంతో మాధవ్ ప్రజా ప్రతినిధిగా ఉంటే కేంద్ర సహకారం సాధించగలరన్నారు. పట్టభద్రులు విజ్ఞులు కనుక ఈ ప్రాంతాభివృద్ధిని, భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని మాధవ్‌కు ఓటు వేయాలని కోరుతున్నామన్నారు. 


ప్రజాసమస్యలపై గళం 


 ఎమ్మెల్సీ ఎన్నికల్లో  పీవీఎన్ మాధవ్  బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. శాసన మండలిలో అయినా విపక్ష గళం వినిపించాలంటే మాధవ్ గెలవాలని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. ఇతర ఏ పార్టీవారు గెలిచినా నోరెత్తే పరిస్థితి లేదన్నారు. మాధవ్ కౌన్సిల్లోనూ, బయటా కూడా ప్రజా సమస్యల మీద గళం ఎత్తగలరన్నారు. 


ఓటర్లను బెదిరిస్తున్నారు- విష్ణువర్ధన్ రెడ్డి 


ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలోనూ ఏపీ ప్రభుత్వం, అధికార పార్టీ వ్యవహరిస్తున్న తీరును బీజేపీ ప్రధాన కార్యదర్శి  విష్ణువర్థన్ రెడ్డి తప్పు పట్టారు.  . ఈ నెల 13వ తేదీన జరగనున్న శాసనమండలి ఎన్నికలలో కూడా ఓటర్లను కోనుగోలు చేసే పరిస్థితి ఏర్పడడం దురదృష్టకరం అన్నారు. అధికారుల్ని ప్రభావితం చేసి.. ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని.. కొన్ని చోట్ల బెదిరంపులకు పాల్పడుతున్నరని ఆరోపించారు. ప్రస్తుతం ఏపీలో మూడు పట్టభద్రుల నియోజకవర్గాలు, రెండు టీచర్ ఎమ్మెల్సీలకు ఎన్నికలు జరగనున్నాయి. టీచర్ ఎమ్మెల్సీలు .. ఉపాధ్యాయ సంఘాల్లోని వారే గట్టిగా పోరాడుతున్నారు. వైఎస్ఆర్‌సీపీ కూడా అభ్యర్థుల్ని నిలబెట్టింది. పట్టభద్రుల నియోజకవర్గాలకు కూడా అన్ని పార్టీల తరపున అభ్యర్థులు నిలబడ్డారు. రాయలసీమలో అభ్యర్థుల విజయానికి బీజేపీ నేతలంతా విస్తృతంగా పర్యటిస్తున్నారు. 


ఎన్నికల విషయంలో అధికార తరపున అధికారులు అధికార దుర్వినియోగం చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. దీనిపై విష్ణువర్ధన్ రెడ్డి  కొంత కాలంగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న వారిపై విమర్శలు గుప్పించారు.  ఎన్నికల సంఘం ఈ అంశం పై కఠినంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. ఈనెల 13న ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఎమ్మెల్సీ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయని గుర్తు చేశారు. ఎన్నికల సంఘం స్వేచ్చగా ఎన్నికలు నిర్వహిస్తే బీజేపీ విజయం సాధిస్తుందని విష్ణువర్ధన్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు.