Pudimadaka Fishing Harbour : విశాఖ సముద్ర తీరంలో మరో ఫిషింగ్ హార్బర్ సిద్ధం అవుతుంది. ఒడిశాలోని పారాదీప్, విశాఖ మినహా మధ్యలో మరో ఫిషింగ్ హార్బర్ లేదు. పెరుగుతున్న మత్స్యకార అవసరాలకు ఇవి సరిపోవడం లేదు. దీంతో విశాఖ సమీపంలోని అనకాపల్లి జిల్లాలో మరో ఫిషింగ్ హార్బర్ నిర్మించడానికి ఏపీ ప్రభుత్వం రెడీ అయింది. ఇందుకోసం రూ.393 కోట్లతో పూడిమడక వద్ద మరో ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. టెండర్లు తుది దశలో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు . హార్బర్ కోసం ఇప్పటికే జిల్లా కలెక్టర్ 30 ఎకరాల భూమిని కేటాయించారు.


విశాఖ ఫిషింగ్  హార్బర్ పై పెరుగుతున్న భారం


కొత్త హార్బర్ నిర్మాణం పూర్తి అయితే ప్రస్తుతం విశాఖలో ఉన్న ఫిషింగ్ హార్బర్ పై ఒత్తిడి తగ్గుతుంది. విశాఖ ఫిషింగ్ హార్బర్ పరిధిలో 720 మెకనైజ్డ్ బోట్లు, 3 వేల  ఇంజిన్ బోట్లు  ఉన్నాయి. వీటి సంఖ్య ప్రతీ ఏడాది పెరుగుతూ వస్తుంది. పూడిమడక ఫిషింగ్ హార్బర్ పూర్తయితే  విశాఖ ఫిషింగ్ హార్బర్ పై పడుతున్న భారం తగ్గుతుంది అంటున్నారు అధికారులు. పైగా పూడిమడక, పాయకరావు పేట, యస్.రాయవరం, రాంబిల్లి, పరవాడ ప్రాంతాల మత్స్యకారులకు ఎంతో  ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు.


అంచనా వ్యయం రూ.393 కోట్లు


పూడిమడక ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి  రూ.393 కోట్లు అవసరమవుతాయని అంచనా వేయగా ప్రభుత్వం దానికి ఆమోదం తెలిపింది. ఈ హార్బర్ సామర్థ్యం ఏడాదికి 28 వేల టన్నులుగా లెక్కలు వేస్తున్నారు. హార్బర్ పూర్తయితే 930 బోట్లను ఇక్కడ ఒకేసారి నిలపవచ్చు అంటున్నారు అధికారులు. వీటిలో 9 మీటర్ల మోటరైజ్డ్ బోట్లు 700, 18 మీటర్ల మెకనైజ్డ్ బోట్లు  200,  24 మీటర్ల లాంగ్ లైనర్లు 30 అని చెబుతున్నారు. ఈ హార్బర్ పూర్తయితే దాదాపు 5 వేలకు పైగా మత్స్యకార కుటుంబాలకు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఉపాధి కలుగుతుందని ప్రభుత్వం చెబుతోంది. మూడేళ్ల లోపు ఈ ఫిషింగ్ హార్బర్ అందుబాటులోనికి రానుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది.  అలాగే తుపాను లాంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఒకేసారి అన్ని బోట్లనూ నిలిపి ఉంచడానికి వైజాగ్ ఫిషింగ్ హార్బర్ సరిపోవడం లేదు. కొత్త హార్బర్ పూర్తయితే ఆ కష్టాలు తొలగిపోతాయని అధికారులు అంటున్నారు. పూడిమడక ఫిషింగ్ హార్బర్ మత్స్యకారుల దశాబ్దాల నాటి కల అని చెబుతున్నారు. నూతన హార్బర్ అందుబాటులోకి వస్తే మరింత మంది మత్స్యకారులకు ఉపాధి దొరుకుతోందని అంటున్నారు.