ఎంపీ గోరంట్ల మాధవ్ వైరల్ వీడియో విషయంలో వైఎస్ఆర్ సీపీకి చెందిన ఓ కార్యకర్త టీడీపీ నేత, తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనితకు ఫోన్ చేశారు. ఎంపీ గోరంట్ల మాధవ్‌ విషయాన్ని ఎందుకు పెద్దది చేస్తున్నారంటూ ఆయన ప్రశ్నించినట్లుగా అనిత వెల్లడించారు. అనిత మీడియా సమావేశం నిర్వహించిన సందర్భంగానే విలేకరులు అందరూ అక్కడే ఉండగా ఆమెకు ఆ ఫోన్ వచ్చింది. గుర్తు తెలియని నంబర్ నుంచి ఫోన్‌ రావడంతో ఆమె తన మొబైల్‌ స్పీకర్‌ ఆన్‌ చేశారు. గోరంట్ల మాధవ్‌ ఏం తప్పు చేశారని, అంత దారుణంగా విమర్శలు చేస్తున్నారని అనితను వైఎస్ఆర్ సీపీ కార్యకర్త ప్రశ్నించారు. ఎంపీకి సంబంధించిన న్యూడ్ వీడియో ఘటనపై ప్రభుత్వం విచారణ చేస్తోందని ఓ వైపు లీడర్లు చెబుతున్నారని, అలాంటప్పుడు అతిగా స్పందించాల్సిన పని ఏంటని ఫోన్లో నిలదీశారు.


విజయవాడ నగరంలో మంగళవారం (ఆగస్టు 9) అఖిలపక్షాల సమావేశంలో వంగలపూడి అనిత పాల్గొన్న సందర్భంగా ఓ వైఎస్ఆర్ సీపీ కార్యకర్త ఆమెకు ఇలా ఫోన్ చేశారు. దీనిపై స్పందించిన అనిత.. ఏం నన్ను బెదిరిస్తున్నావా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం వైఎస్ఆర్ సీపీ నేతలు ఎంతోమంది ఆడ పిల్లల ఉసురు పోసుకుంటున్నారని మండిపడ్డారు. ఇలాంటి వాళ్లను లోక్‌సభ, అసెంబ్లీలకు పంపిస్తున్నామా? అనేది ప్రజలు ఆలోచించుకోవాలని అనిత సూచించారు.


వీడియోపై ఢిల్లీలో స్పందించిన ఎంపీ మార్గాని భరత్
ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో నిజమని తేలితే పార్టీ పరంగా చర్యలు తప్పవని ఎంపీ మార్గాని భరత్ అన్నారు. గోరంట్ల మాధవ్ వీడియోలో ఉంది తాను కాదు అని అన్నారని, వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారని గుర్తు చేశారు. ఆయనపై ఎవరు ఫిర్యాదులు కూడా చేయలేదని, నైతికంగా చర్యలు తీసుకునేందుకు తాము ఇప్పటికే నివేదిక ఇవ్వాలని కోరామని అన్నారు. తమది మహిళ పక్షపాతి ప్రభుత్వమని, నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని అన్నారు.


వీడియో నిర్ధారణ జరగకుండా ఏం మాట్లాడతామని భరత్ అన్నారు. ఇదొక ఫ్యాబ్రికేటెడ్ వీడియో అని వ్యాఖ్యానించారు ఎంపీ భరత్. ఓటుకు నోటు కుంభకోణంలో అడ్డంగా దొరికిన దొంగ చంద్రబాబు.. ఎంపీ మాధవ్ వీడియో అని నిర్దారణ జరగకుండా ఏం మాట్లాడతామని అన్నారు.


సజ్జల వ్యాఖ్యలపైనా అనిత విమర్శలు
మరోవైపు, ఆ వీడియోపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా అనిత తీవ్రంగా స్పందించారు. ‘‘గంట, అరగంటల అశ్లీల ఆడియోలు బయటకు వచ్చాయి. అవి నిజం అని ప్రపంచమంతా తెలుసు. అవి తమవి కాదు అని వాళ్ళే చెప్పారంట. అందుకే అవి వారివి కాదు అని ఇతగాడు సర్టిఫికేట్ ఇస్తున్నాడు. వాళ్ళు రోత అయితే ఇతడు మహారోతలా ఉన్నాడు. మొత్తానికి డర్టీ MP మాధవ్ మీద చర్యలేమీ ఉండవు అని పరోక్షంగా చెప్పేసారు.’’ అని అనిత ట్వీట్ చేశారు.