YS Jagan Sattenapalle Tour: అనుమతి లేదు రావద్దు అని పోలీసులు చెబుతుంటే... వస్తున్నాం ఏం చేసుకుంటారో చేసుకోండి అని వైసీపీ నేతలు వార్నింగ్ ఇస్తున్నారు. పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లిలో ఓ ఉప సర్పంచ్ విగ్రహ ఆవిష్కరణ ఏపీ రాజకీయాల్లో హాట్ హాట్ డిబేట్‌కు కారణమవుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాగమల్లేశ్వరరావు అనే వైసీపీ నేత ఆత్మహత్య చేసుకున్నాడని వైసీపీ ఆరోపిస్తూ వస్తోంది. ఇప్పుడు ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు సత్తెన పల్లి నియోజకవర్గంలోని రెంటపాళ్లు వెళ్లాలని వైసీపీ అధినేత జగన్ నిర్ణయించుకున్నారు. అది సెన్సిటివ్ ప్లేస్ అని గుంపులు గుంపులుగా వెళ్తే గొడవలు జరిగే అవకాశం ఉందని పోలీసులు వారిస్తున్నారు. దీంతో ఈ టూర్ ఏ వివాదానికి దారి తీస్తోందో అన్న ఉత్కంఠ నెలకొంది. 

పల్నాడు జిల్లా మరోసారి వేడెక్కింది. సత్తెన పల్లి నియోజకవర్గంలోని రెంటపాళ్లలో వైసీపీ నేత విగ్రహావిష్కరరణ చేసి వారి ఫ్యామిలీ సందర్శించాలని జగన్ ప్లాన్ చేశారు. గతేడాది జూన్‌ మొదటి వారంలో నాగమల్లేశ్వరరావు అనే వైసీపీ నేత, రెంటపాళ్ల ఉప సర్పంచ్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. దీనంతటికీ కూటమి ప్రభుత్వం వేధింపులే కారణమని వైసీపీ ఆరోపించింది. 

ఆ నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని బుధవారం వైసీపీ నిర్వహిస్తోంది. దీని కోసం జగన్‌ను ఆహ్వానించారు. ఈ మేరకు వైఎస్ జగన్ రెంటపాళ్ల వెళ్లి విగ్రహాన్ని ఆవిష్కరించి ఆ ఫ్యామిలీని పరామర్శించాలని చూస్తున్నారు. ఈ మేరకు పోలీసుకు అనుమతి కోరుతూ లేఖలు ఇచ్చారు. అసలే పల్నాడు ఉద్రిక్తతకు మారు పేరు అలాంటి ప్రాంతంలో జగన్ టూర్ చేస్తే మరింత రెచ్చగొట్టే చర్యలకు వైసీపీ నేతలు దిగుతారని అనుమానిస్తున్నారు.  

మొన్న పొదిలిలో వైసీపీ శ్రేణులు సృష్టించిన విధ్వంసంతో అలర్ట్ అయిన పోలీసులు జగన్ టూర్‌కు అనుమతి నిరాకరించారు. ఎంత మంది వైసీపీ నేతలు, ఎన్నిసార్లు పోలీసులకు విజ్ఞప్తి చేసినా అనుమతి ఇవ్వడం కుదరదని చెప్పేశారు. ఈ టూర్ వల్ల ప్రస్తుతానికి ప్రశాంతంగా ఉన్న ఉద్రిక్తతలు చెలరేగే ప్రమాదం ఉందని కూడా వారించారు. అందుకే అనుమతి ఇవ్వలేమని చెప్పేశారు. 

పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. జగన్ టూర్‌లకు జనాలు వస్తున్నారనే ఇలాంటి కుట్రలకు కూటమి ప్రభుత్వం తెరతీసిందని ఆరోపిస్తున్నారు. పోలీసులు అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా సరే కచ్చితంగా జగన్ టూర్ ఉండి తీరుతుందని చెబుతున్నారు. కాలినడకనైనా జగన్ ఆ కుటుంబాన్ని పరామర్శించి వస్తారని అంటున్నారు. పొదిలిలో జనం భారీగా రావడంతో కూటమి నేతల్లో గుబులు మొదలైందని అంటున్నారు. అందుకే పర్యటనలు అడ్డుకునేందుకు పోలీసులను అడ్డం పెట్టుకొని కుట్రలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. 

దీనిపై సోషల్ మీడియాలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఆ వ్యక్తి చనిపోయింది వేధింపుల వల్ల కాదని బెట్టింగ్ భూతానికి బలయ్యాడని అంటున్నారు. వైసీపీ 175 సీట్లు వస్తాయని ప్రచారం చేసి అతను బెట్టింగ్ వేసేలా ప్రోత్సహించారని అంటున్నారు. చివరకు వైసీపీ ఘోరంగా ఓడిపోవడంతో బెట్టింగ్‌ డబ్బులు చెల్లించలేక ఆత్మహత్య చేసుకున్నాడని లోకల్‌గా ప్రచారం చేస్తున్నాయి.