YSRCP Leader Pinnelli Ramakrishna: వైసీపీ నేత, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామరెడ్డి జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయారు. ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడంతో లొంగిపోవాల్సి వచ్చింది. పల్నాడులో గట్టి పట్టు ఉన్న నేతలు కోర్టులో లొంగిపోతున్న టైంలో ఆ ప్రాంతంలో ఎలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. వైసీపీ నేతలను హౌస్ అరెస్టు చేశారు. కోర్టుకు వచ్చే క్రమంలో వారిని కలిసేందుకు వచ్చిన వాళ్లకు నోటీసులు ఇచ్చారు.
వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన టీడీపీ నేతలు జవ్విశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వర్లు హత్యకు గురయ్యారు. దీనికి రాజకీయ కారణాలే అని పోలీసులకు ఫిర్యాదు అందింది. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు పిన్నెల్లి సోదరులను కూడా నిందితులుగా చేర్చారు. ఈ కేసులో వీళ్లిద్దర్ని ఏ6, ఏ 7గా చేర్చారు. కేసులో ఇప్పటికే కీలక నిందితులందర్నీ అరెస్టు చేశారు. తమ అరెస్టు కూడా తప్పదని భావించిన పిన్నెల్లి సోదరులు కోర్టుల తలుపు తట్టారు. హైకోర్టు నుంచి అన్ని కోర్టుల్లో కూడా ముందస్తు బెయిల్ రిజెక్ట్ అయ్యింది. సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించడమే కాకుండా రెండు వారాల్లో లొంగిపోవాలని ఆదేశించింది.దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఇవాళ లొంగిపోవాల్సి వచ్చింది.