YS Jagan Tour Cases: వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల క్రితం గుంటూరులో పర్యటించారు. తమ పార్టీ లీడర్ అంబటి రాంబాబు ఫ్యామిలీని పరామర్శించారు. ఈ పర్యటనలో భాగంగా నిబంధనలను, పోలీస్‌ ఆంక్షలను ఏ మాత్రం లెక్క చేయకుండా భారీ ర్యాలీలు నిర్వహించారనే ఆరోపణలపై గుంటూరు పోలీసులు కేసులు పెట్టారు. ఇందులో ఐదుగురు కీలక నేతల పేర్లను ప్రస్తావించారు. 

పోలీస్ యాక్ట్ 30 ఉల్లంఘన కింద కేసులు 

గుంటూరు నగరంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం అమలులో ఉన్న పోలీస్ యాక్ట్‌ సెక్షన్ 30ని వైసీపీ నేతలు బహిరంగంగా ఉల్లంఘించినట్టు పోలీసులు నిర్దారించారు అనుమతి లేకుండా భారీ కాన్వాయ్‌లతో ర్యాలీలు నిర్వహించడం పోలీసుల హెచ్చరికలను బేఖాతరు చేయం వంటి చర్యలు పాల్పడినందుకు ఐదు వేర్వేరు పోలీస్ స్టేషన్‌లలో ఈ కేసులు నమోదు అయ్యాయి. 

తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో వైసీపీ నేత కీలక నేత దొంతిరెడ్డి వేమారెడ్డిపై కేసు నమోదు అయ్యింది. పెదకాకాని పోలీస్ స్టేషన్ పరిధిలో నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినందుకు నూనె ఉమామహేశ్వర్ రెడ్డిపై కేసు నమోదు అయ్యింది. నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌లో బలసాని కిరణ కుమార్ నిందితుడిగా కేసు నమోదు అయ్యింది. నగరంపాలెం పోలీస్ స్టేషన‌లో వైసీపీ నేత నూరి ఫాతిమాపై ఈ స్టేషన్‌లో    కేసు పెట్టారు. గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రికి అత్యంత సన్నిహితుడైన అంబటి మురళిపై కేసు ఫైల్ అయ్యింది. 

జగన్ పర్యటన సందర్భంగా భారీగా ట్రాఫిక్ జామ్ అయిందని ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని పోలీసులు చెబుతున్నారు. సాధారణంగా 40 నిమిషాల్లో ముగియాల్సిన గుంటూరు ప్రయాణం వైసీపీ నేతల తీరు కారణంగా ఐదు గంటల పాటు సాగిందని అంటున్నారు. జాతీయ రహదారిపై వైసీపీ నేతలు పెద్ద ఎత్తున వాహనాలను నిలపడం వల్ల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీని వల్ల నిత్యవసర వస్తువుల రవాణా, అత్యవసర వైద్య సేవల కోసం వెళ్లే అంబులెన్స్‌లు కూడా ఇబ్బందులు పడ్డట్టు చెబుతున్నారు.