Vijayawada: ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఓ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు సినీ ఫక్కీలో కిడ్నాప్ చేశారు. ఇబ్రహీపట్నం రింగ్ సెంటర్లో అందరూ చూస్తుండగా బుధవారం రాత్రి కొందరు వ్యక్తులు ఓ యువకుడిపై దాడి చేసి కారులో ఎత్తుకెళ్లారు. దీనిపై స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు కారును వెంబడించారు. చేజ్ చేసి కారును అడ్డుకున్నారు. కిడ్నాప్‌కు గురైన యువకుడితోపాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకుని మోసం చేయడంతో యువకుడిని కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది.


విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. కిడ్నాప్‌కు గురైన యువకుడు ఉద్యోగాల పేరుతో లక్షల రూపాయలు వసూలు చేసినట్లు తెలిసింది. నిందితుడు గంపలగూడెం మండలం వినగడపకు చెందిన దిలీప్‌గా గుర్తించారు. ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసైన దిలీప్ అందులో లక్షలు పోగొట్టుకున్నాడు. చివరకు అప్పుల పాలయ్యాడు. ఈ క్రమంలో వాటిని తీర్చేందుకు అడ్డదారులు తొక్కాడు. ఈజీ మనీ కోసం ఇబ్రహీంపట్నం ప్రాంతానికి యువకులకు ఉద్యోగాల పేరుతో ఎరవేశాడు.


తనకు తెలిసిన వారు ప్రభుత్వంలో ఉన్నారని, డబ్బుల చెల్లిస్తే గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తానని నమ్మించాడు. పలువురి నుంచి రూ.45 లక్షల వరకూ వసూలు చేసినట్లు సమాచారం. డబ్బులు తీసుకున్నాక ఉద్యోగాలు ఇప్పించకుండా దిలీప్ తప్పించుకు తిరుగుతున్నాడు. ఉద్యోగం లేకపోతే తమ డబ్బులు తిరిగిచ్చేయమని యువకులు కోరినా దిలీప్ మొహం చాటేస్తున్నాడు. దీంతో దిలీప్‌ను కిడ్నాప్ చేసేందుకు వారు స్కెచ్ వేశారు.  ఇబ్రహీపట్నం రింగ్ సెంటర్లో కిడ్నాప్ చేసి పోలీసులకు దొరికిపోయారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.