MLC Vamsi Krishna Joins Janasena: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తామని జనసేనాని (Janasena) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర భవిష్యత్ కోసం జనసేన పని చేస్తుందన్నారు. వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ (Vamsi krishna Yadav) పవన్ కల్యాణ్, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సమక్షంలో మంగళగిరిలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఉత్తరాంధ్రలో జనసేన పార్టీ బలపడుతుందన్న పవన్ కల్యాణ్, పార్టీ బలోపేతం కోసం వంశీకృష్ణ యాదవ్ పని చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. వంశీకృష్ణకు జనసేనలో మంచి ప్రాధాన్యం దక్కుతుందని హామీ ఇచ్చారు. వైసీపీ పాలనలో ఉత్తరాంధ్ర డెవలప్ అవుతుందని ఆ పార్టీ చేరారని, అయితే వారు కోరుకున్నట్లు అభివృద్ధి జరగకపోవడంతో ఒక్కొక్కరు అధికార పార్టీని వీడుతున్నారని అన్నారు. ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు వంశీకృష్ణ యువరాజ్యం విభాగంలో పని చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు జనసేనలోకి రావడం సొంతింటికి వచ్చినట్టుందని అన్నారు. విశాఖలో వైసీపీ బలోపేతానికి వంశీకృష్ణ యాదవ్ అహర్నిశలు పని చేశారని అన్నారు. స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీ ఎన్నికైన వంశీకృష్ణ యాదవ్, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి అని కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు ముందే రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వైసీపీలో సీటు రాదనుకున్న నేతలు, గోడ దూకేస్తున్నారు. పక్క పార్టీలో అసెంబ్లీ సీటును కన్ఫామ్ చేసుకుంటున్నారు. మరో మూడు నెలలు సమయం ఉండగానే, ముందు జాగ్రత్తగా కండువా మార్చేస్తున్నారు. అధికార పార్టీ నుంచి జనసేనలో వలసలు షురూ అయ్యాయి. భవిష్యత్ ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. వైసీపీలో టికెట్ దక్కని నేతలంతా తమ దారి తాము చూసుకుంటున్నారు. టికెట్ ఇచ్చే పార్టీకి జై కొడుతున్నారు. అధికార పార్టీ నేతలు బుజ్జగిస్తున్నప్పటికీ ఆ పార్టీలో కొనసాగేందుకు కొందరు ససేమిరా అంటున్నారు.