బెజవాడ పశ్చిమ పాలిటిక్స్ ఇంట్రస్టింగ్‌గా మారాయి. ఇక్కడ అధికార పక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి నిత్యం హాట్ కామెంట్స్ రాజకీయ వర్గాల్లోకి ట్రోల్ అవుతూనే ఉంటాయి. అధికార పక్షం నుంచి గట్టిగా వాయిస్ వినిపించే వ్యక్తుల్లో వెలంపల్లి శ్రీనవాసరావు ఒకరు. మాజీ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ రాజకీయం చేస్తున్నారు వెలంపల్లి. 


గడప గడపకు కార్యక్రమం ద్వార వెలంపల్లి ప్రజల ముందుకు వెళ్ళిన సమయంలో సమస్యలపై కొందరు నిలదీయడం హాట్ టాపిక్ అయింది. అదే టైంలో ఆయన రియాక్షన్ కూడా సంచలనంగా మారింది. పోలీసులను వినియోగించి ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టండని ఆదేశించటం కలకలం రేపింది. ఇలాంటి ఘటనలు చాలా ఇటీవల కాలంలో వెలుగులోకి వచ్చాయి. 


వీటితోపాటు వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలపై కూడా చర్చ నడుస్తోంది. ప్రధానంగా కొండ ప్రాంత వాసులకు తాగునీటి సరఫరా ఇంత వరకు కొలిక్కి రాలేదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ కావటంతో అధికార పక్షాన్ని కాస్త ఇబ్బంది పెట్టనుంది. దీన్ని వాళ్లు కూడా చాలా ప్రాధాన్యత అంశంగా తీసుకుంటున్నారు. కులాల వారీగా లెక్కలు పరిశీలిస్తే ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనిసవారావు వైశ్య సామాజక వర్గానికి చెందిన నేత. నియోజకవవర్గంలో మరో కీలకమైన సామాజిక వర్గం నగరాల సామాజిక వర్గం. దీంతో అదే సామాజిక వర్గానికి చెందిన మహిళకు మేయర్ సీట్ కేటాయించారు. ఇందులో వెలంపల్లిదే ప్రధాన పాత్ర. 


కీలకంగా జనసేన...


ఈ నియోజకవర్గంలో జనసేన అత్యంత కీలకంగా వ్యవహరిస్తోంది. గత ఎన్నికల్లో కూడా వెలంపల్లికి జనసేన పార్టీ గట్టి పోటీనే ఇచ్చింది. వాస్తవానికి ఈ నియోజకవర్గంలో గతంలో ప్రజారాజ్యం పార్టీ గెలిచింది. అదే ఊపు మరలా వస్తుందని, 2019లో కూడా జనసేన గెలుస్తుందని భావించారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హావా వీయటంతో సీటును వెలంపల్లి గెల్చుకున్నారు. వైసీపీకి ఇక్కడ గట్టి పోటీ ఇస్తుంది కూడా జనసేన పార్టికి చెందిన నియోజకవర్గ ఇంచార్జ్ పోతిన మహేష్. మంత్రిగా పని చేస్తున్న సమయంలోనూ వెలంపల్లికి పోతిన మహేష్ కౌంటర్ లు ఇచ్చారు. దుర్గగుడి విషయంలో వెలంపల్లి అక్రమాలకు పాల్పడటం, కాంట్రక్టర్లకు అనుకూలంగా వ్యవహరించటం, దసరా, భవానీ దీక్షల హయాంలో జరిగిన అక్రమాలపై హాట్ కామెంట్స్ చేయటం, అవి మంత్రిగా పని చేసిన వెలంపల్లిని ఇరకాటంలోకి నెట్టాయి. దీంతో ఇక్కడ పోటీ జనసేన,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే అన్నట్లుగా సీన్‌ మారింది.


ఇక టీడీపీ విషయానికి వస్తే...


ఈ నియోజకవర్గంలో టీడీపీ నుంచి కీలక నేతలు ఉన్నారు. మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న,మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఈ నియోజకవర్గానికి చెందిన నేతలే. అయితే ఇక్కడ గ్రూపు రాజకీయాలతో టీడీపీ పూర్తిగా వెనుకబడింది. జలీల్ ఖాన్ కుమార్తెకు గత ఎన్నికల్లో సీటు కేటాయిచటంపై బుద్దా వెంకన్న తీవ్రంగా వ్యతిరేకించారు. అంతే కాదు జలీల్ ఖాన్ కుమార్తెకు టీడీపీ ఎంపీ కేశినేని నాని మద్దతు ఇవ్వటంపై బుద్దా వెంకన్న, మరో నేత నాగుల్ మీరా వ్యతిరేకించి పార్టీకి వ్యతిరేకంగా పని చేశారని టాక్. అందుకే జలీల్ ఖాన్ కుమార్తె ఓడిపోయారని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు.ప్రస్తుతం విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బాధ్యతలను ఎంపీ కేశినేని నాని పర్యవేక్షిస్తున్నారు. ఇప్పుడు పొత్తుల వ్యవహరం తెర మీదకు రావటంతో, పశ్చిమ సీటు జనసేనకు వెళుతుందని భావించిన నేతలు, నియోజకవర్గంలో పార్టీని పూర్తిగా పట్టించుకోవటం లేదని అంటున్నారు. ఒక వేళ ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే మాత్రం జనసేన, వైఎస్‌ఆర్‌సీపీ మధ్యే పోటీ ఉంటుందని టీడీపీ నేతలు కూడా లోలోపల చర్చించుకుంటున్నారట.