Vijayawada YSRCP Leader News: విజయవాడకు చెందిన మాజీ కార్పొరేటర్ నందేపు జగదీష్ సోమవారం (జూన్ 17) అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ శిరోముండనం చేయించుకున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన వైసీపీ దళిత నాయకుడిని అయిన తనపై స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గుండా గిరి చేస్తున్నారని నందేపు జగదీష్ ఆరోపించారు. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున ప్రచారం చేశాడనే కోపంతో తనకు చెందిన భవనాన్ని జేసీపీలతో బోండా ఉమ అనుచరులు కూల్చివేయించారని ఆయన ఆవేదన చెందారు.
అందుకే ఆయన తీవ్ర మనస్థాపానికి గురై కూల్చేసిన భవనం ముందు శిరోముండనం చేయించుకున్నారు. పైగా అర్ధనగ్నంగా నిరసన తెలిపారు. లోదుస్తులు మాత్రమే వేసుకొని శిరోముండనం చేయించుకున్నారు. పైగా తన భార్యకు కూడా ఆయన శిరోముండనం చేయించడానికి రెడీ అయ్యారు. జగదీష్ భార్యకు శిరోముండనం చేస్తుండగా ఇంతలో పోలీసులు జోక్యం చేసుకొని అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా నందేపు జగదీష్ మాట్లాడుతూ.. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమామహేశ్వరరావు దాదాగిరి ఎక్కువైందని ఆరోపించారు. రెండు రోజుల క్రితం నగర కార్పొరేషన్ కో ఆప్షన్ మెంబర్ వైసీపీ నాయకుడికి చెందిన భవనాన్ని జేసీబీల సాయంతో పగలకొట్టించారని అన్నారు. గతంలో తాను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఈ భవనం ప్రారంభోత్సవం అప్పటి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చేశారని గుర్తు చేశారు.
ఈసారి తాను ఎన్నికల్లో వైసీపీ తరఫున ప్రచారం చేశానని అసూయతో అధికార మదంతో తన భవనాన్ని కుప్పకూల్చారని అన్నారు. దీనిపై తెలుగుదేశం పార్టీ నేత సీఎం చంద్రబాబుకు స్పందనలో తాను ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు. ‘‘దళిత వైసీపీ నాయకుడిగా ఉండటం నేను చేసిన తప్పా? బోండా ఉమా దాదాగిరికి అధికారం తోడవడంతో ఇటువంటి అన్యాయాలు ముందు రోజుల్లో ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. నాకు న్యాయం జరగకుండా ఉంటే నేను చేసుకున్న శిరోముండనంతో పాటు నా కుటుంబ సభ్యులకి శిరోముండనం చేసుకొని నిరసన తీవ్రతరం చేస్తా’’ అని నందేపు జగదీష్ హెచ్చరించారు.