Traffic Restrictions In Vijayawada: విజయవాడలో అంబేద్కర్ విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని శుక్రవారం సీఎం జగన్ ఆవిష్కరించనున్నారు. ఈ వేడుకలకు పెద్ద ఎత్తున నాయకులు, ప్రజలు తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో సిటీలో పలు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పలు చోట్ల వాహనాల దారి మళ్లింపు చేపట్టారు. ఈ మేరకు వాహనదారులు గమనించాలని సీపీ కాంతి రాణా టాటా సూచించారు. ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని తెలిపారు.
లక్ష మంది వస్తారని అంచనా
విజయవాడ సీపీ కాంతి రాణా గురువారం మీడియా సమావేశం నిర్వహించి వివరాలు అంబేద్కర్ విగ్రహావిష్కరణ వివరాలు వెల్లడించారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి 1.5 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. శుక్రవారం కార్యక్రమం కోసం ట్రాఫిక్ మళ్లింపు చేస్తున్నామని ప్రజలు సహకరించాలని కోరారు. ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు వాహనాల రాకపోకల మళ్లింపులు కొనసాగుతాయని వెల్లడించారు. విజయవాడ సిటీలో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని తెలిపారు.
ట్రాఫిక్ మళ్లింపు ఇలా..
విశాఖ-హైదరాబాద్, హైదరాబాద్-విశాఖ వైపు వాహనాలన్నీ ఇబ్రహీంపట్నం దగ్గర మైలవరం, నూజివీడు, హనుమాన్ జంక్షన్ మీదుగా దారి మళ్లించారు.
చెన్నై నుంచి వైజాగ్ వెళ్లే వాహనాలను ఒంగోలు దగ్గర డైవర్షన్.. చీరాల, బాపట్ల మీదుగా పంపించనున్నారు.
వైజాగ్ నుంచి చెన్నై వెళ్లే వాహనాలను హనుమాన్ జంక్షన్ దగ్గర దారి మళ్లించారు.
చెన్నై నుంచి హైదరాబాద్, హైదరాబాద్- చెన్నై వెళ్లే వాహనాలను మేదరమెట్ట, అద్దంకి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ మీదుగా వెళ్లాలని సూచించారు.
ఎంజీ రోడ్‌లో ఉదయం 11 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు
ఇతర జిల్లాల నుంచి వచ్చే వాహనాలకి పార్కింగ్ ప్రాంతాలు కేటాయించారు.
సీఎం వైఎస్ జగన్ చేతుల మీదగా అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరుగుతుందని, శనివారం నుంచి అంబేద్కర్ విగ్రహాన్ని చూసేందుకు సందర్శకులను అనుమతిస్తామని సీపీ తెలిపారు.
అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ప్రారంభమవుతుందని కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ముందుగా సీఎం జగన్ ముఖ్య అతిథిగా బహిరంగ సభ జరుగుతుందని చెప్పారు. అనంతరం సీఎం జగన్ చేతుల మీదుగా ఆరు గంటలకి అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఉంటుందన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి కార్యక్రమానికి దాదాపు మూడు వేల వాహనాలు, లక్షన్నర మంది ప్రజలు వస్తారని అంచనా వేస్తున్నట్లు చెప్పారు.
అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని చూసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ చెప్పారు. విజయవాడ నగరంలోని పలు జంక్షన్లలో 36 చోట్ల స్క్రీన్లు ఏర్పాటు చేశామని అన్నారు. నగర ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. శుక్రవారం అంబేద్కర్ విగ్రహ సందర్శనకు అనుమతించరని, శనివారం నుంచి ప్రజలుకు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు.
విగ్రహం ప్రత్యేకతలు ఇవే
- అంబేద్కర్ విగ్రహం ఎత్తు- 125 అడుగులు
- పెడస్టల్(బేస్) ఎత్తు- 81 అడుగులు
- పెడస్టల్ సైజు - 3,481 చదరపు అడుగులు
- పెడస్టల్‌తో కలిసి విగ్రహం మొత్తం ఎత్తు- 206 అడుగులు
- నిర్మించే అంతస్తులు- జీ ప్లస్‌టు
- విగ్రహానికి వాడిని కాంస్యం- 120 మెట్రిక్ టన్నులు
- విగ్రహం నిర్మాణం లోపలకు వాడిన స్టీల్- 400 మెట్రిక్ టన్నులు
- అంబేద్కర్ స్మృతివనానికి ఖర్చు చేసిన మొత్తం- 404.35 కోట్లు
- శాండ్ స్టోన్ 2,200 టన్నులు
- పనులు ప్రారంభ తేదీ- మార్చి 21, 2022
- విగ్రహం ఆవిష్కరించే తేదీ-జనవరి 19, 2024