Sai Krishna Lockup Death Case | విజయవాడలో కలకలం రేపిన గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసుపై జరుగుతున్న మెజిస్టీరియల్ విచారణకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) నేతలు హాజరయ్యారు. ఈ విచారణ ప్రక్రియలో పార్టీ ముఖ్య నేతలు అంబటి రాంబాబు, మల్లాది విష్ణు, సుధాకర్ బాబు, వంగవీటి నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసుపై తమకు ఉన్న పలు అనుమానాలను లేవనెత్తుతూ, ఒక  వినతి పత్రాన్ని విచారణాధికారికి అందజేశారు.

Continues below advertisement

ఈ సందర్భంగా వైసిపి మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడుతూ.. గాదె సాయికృష్ణ కేసులో తమకు అనేక తీవ్రమైన అనుమానాలు ఉన్నాయని స్పష్టం చేశారు. సాయికృష్ణ లాకప్ డెత్ జరగడం, ఆ తర్వాత మృతదేహాన్ని మాయం చేయడానికి ప్రయత్నించడం వంటి పరిణామాలు ఎన్నో సందేహాలకు తావిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనలోని అసలు వాస్తవాలు, నిజనిజాలు బయటకు రావాలంటే కేవలం సిబిఐ (CBI) ద్వారానే విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ ఉదంతాన్ని తాము ప్రభుత్వ హత్య గానే భావిస్తున్నామని వైసిపి నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రస్తుత మెజిస్టీరియల్ విచారణలో భాగంగానే తమకు ఉన్న ప్రతి ఒక్క అనుమానాన్ని రాతపూర్వకంగా వినతి పత్రం రూపంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ఈ కేసును తక్షణమే సిబిఐకి అప్పగిస్తేనే, బాధ్యులైన అసలు దోషులు బయటకు వస్తారని, బాధిత కుటుంబానికి న్యాయం జరుగుతుందని వారు స్పష్టం చేశారు.

Continues below advertisement

Also Read: Rayalaseema Manufacturing Hub: పారిశ్రామిక చదరంగంలో ‘రాయల్’ సీమ.. తయారీ రంగ కేంద్రంగా మార్చేందుకు కూటమి సర్కార్ పక్కా స్కెచ్! 

విజయవాడ సాయికృష్ణ లాకప్ డెత్.. ప్రారంభమైన మెజిస్టీరియల్ విచారణవిజయవాడలో తీవ్ర సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్ డెత్ ఘటనపై మెజిస్టీరియల్ విచారణ ప్రారంభమైంది. విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఈ విచారణ ప్రక్రియ కొనసాగుతోంది. భారతీయ న్యాయ సంహిత (BNS) చట్ట నిబంధనలకు లోబడి, జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) మార్గదర్శకాలను ఖచ్చితంగా అనుసరిస్తూ ఈ విచారణను నిష్పక్షపాతంగా జరపాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

విచారణకు హాజరైన బాధిత కుటుంబంవిచారణలో భాగంగా బాధితుడు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి, ఇతర కుటుంబ సభ్యులు తమ వాంగ్మూలాన్ని, సాక్ష్యాలను అధికారులకు సమర్పించేందుకు సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ప్రజల వద్ద ఎలాంటి సమాచారం, ఆధారాలు లేదా సాక్ష్యాలు ఉన్నా.. వాటిని వెంటనే విచారణాధికారికి సమర్పించి సహకరించాలని అధికారులు ఒక ప్రకటనలో ప్రజలను కోరారు.

ఇటీవల కోర్టుకు లేఖ రాసిన నాగరాజు

రౌడీషీటర్ సాయికృష్ణ మృతి కేసులో నిందితుడిగా ఉన్న సిఐ నాగరాజు కోర్టులో ఒక సంచలన లేఖ సమర్పించారు. ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) కస్టడీ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఆయన లిఖితపూర్వకంగా తన వాదనను కోర్టుకు తెలియజేస్తూ.. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను పూర్తిగా నిర్దోషినని పేర్కొన్నారు. సిట్ అధికారులు కావాలనే తనను ఈ కేసులో అన్యాయంగా ఇరికిస్తున్నారని, దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఆరోపించిన ఆయన, ప్రస్తుతం తనకు ప్రాణహాని కూడా ఉందని ఆ లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. సిట్ అధికారులు తనను తీవ్రంగా బెదిరిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, విచారణ పేరుతో థర్డ్ డిగ్రీ ఉపయోగించి శారీరకంగా, మానసికంగా టార్చర్ చేయకుండా తగిన రక్షణ కల్పించాలని ఆయన కోర్టును వేడుకున్నారు.

మరోవైపు, ఈ కేసులో నిందితుడైన సిఐ నాగరాజును జులై 3 నుంచి ఎనిమిది రోజుల పాటు సిట్ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడలోని సబ్ కలెక్టర్ ఆఫీసులో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు, నిందితుడి న్యాయవాది సమక్షంలోనే ఆడియో-వీడియో రికార్డింగ్‌తో ఈ విచారణ జరగాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. నిజానికి తనకు పోలీస్ కస్టడీ అవసరమే లేదని, కేవలం తనను ఇరికించాలనే ఉద్దేశంతోనే అధికారులు కస్టడీ కోరారని నాగరాజు కోర్టుకు తెలిపారు.