Vijayawada Jojinagar house demolitions controversy: విజయవాడలో భవానిపురం జోజి నగర్‌లో 42 ప్లాట్లపై జరిగిన ఇళ్ల కూల్చివేతలు తీవ్ర వివాదానికి దారితీశాయి. సుప్రీంకోర్టు డిసెంబర్ 31 వరకు కూల్చివేతలు నిలిపివేయాలని ఆదేశించినా, అధికారులు దీనిని పాటించకుండా కూల్చివేశారు. 25 ఏళ్ల నుంచి ఇక్కడ జీవనం సాగిస్తున్న కుటుంబాలు కూల్చివేతల కారణంగా రోడ్డున పడ్డాయి. భవానిపురంలోని 2.4 ఎకరాల భూమి లక్ష్మీ రామా కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీకి చెందినది. ఈ భూమిపై 1984 నుంచి దీర్ఘకాలిక చట్టపరమైన పోరాటం జరుగుతోంది. అప్పట్లో సొసైటీ భూమి యజమానికి రూ. 2.5 లక్షలకు భూమి కొనుగోలు ఒప్పందం చేసుకుని, రూ. 1.7 లక్షలు అడ్వాన్స్ చెల్లించింది. అయితే, భూ యజమాని ఒప్పందాన్ని ఉల్లంఘించి, 20 ఏళ్లకు పైగా భూమిని 42 మంది ఇతర వ్యక్తులకు అక్రమంగా అమ్మేశారు. దీనిపై సొసైటీ కోర్టును ఆశ్రయించింది.
2023లో కోర్టు సొసైటీకి అనుకూలంగా తీర్పు ఇచ్చి, భూమి రిజిస్ట్రేషన్ చేసింది. భూమి యజమాని హైకోర్టులో సవాలు చేసి, అక్రమ విక్రయాలు చేశారు. సొసైటీ స్థానిక కోర్టు ద్వారా ఎవిక్షన్ నోటీసులు పొందింది. భూ యజమాని సుప్రీంకోర్టును ఆశ్రయించి, అదనపు సమయం కోరారు. సుప్రీంకోర్టు అక్టోబర్ 31, 2025 వరకు భూమి ఖాళీ చేయాలని, అఫిడవిట్లు ఫైల్ చేయాలని ఆదేశించింది.
డిసెంబర్ 3 బుధవారం 42 ప్లాట్లలో 16 నుంచి 50 ఇళ్లను కూల్చివేశారు. బాధితుల న్యాయవాదులు సుప్రీంకోర్టు స్టే ఉంది అని తెలిపినా కూల్చివేతలు కొనసాగాయి. డిసెంబర్ 31 వరకు మిగిలిన కూల్చివేతలు ఆపాలని సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. అయితే అప్పటికే కొన్ని ఇళ్లు కూల్చివేశారు. బాధితులు సీతారా సెంటర్ వద్ద రోడ్డున కూర్చుని రాస్తారోకో చేశారు. ఒక యువకుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేశాడు . పోలీసులు బాధితులను అడ్డుకోవడంలో ఘర్షణ జరిగాయి. భవానిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్తత ఉండటంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఆగిపోయింది. బాధితులు ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి సమస్య చెప్పుకోవాలని ప్రయత్నించినా పోలీసులు అంగీకరించలేదు. సుప్రీంకోర్టు స్టే ఇచ్చినా కూల్చివేతలు జరగడం దారుణమని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ఆరోపించారు.