బెజవాడ దుర్గమ్మ ఆలయంలో వరుస వివాదాలు వెలుగులోకి వస్తున్నాయి. మొన్నా మధ్య వెండి సింహాల మాయం వ్యవహరం తీవ్రస్థాయిలో దుమారాన్ని రాజేసిన నేపథ్యంలో ఇప్పుడు ప్రైవేట్ అర్చకుల వ్యవహరంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దుర్గమ్మ సన్నిధిలో వరుస ఘటనలు....
జగన్మాత దుర్గమ్మ స్వయంభువుగా అవతరించిన ఇంద్రకీలాద్రి సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. భక్తులపాలిట కొంగు బంగారంగా భాసిల్లే దుర్గమ్మ, శక్తి స్వరూపిణిగా పూజలు అందుకుంటున్న ఈ క్షేత్రం ఎంతో మహిమాన్వితమైనదిగా భక్తులు భావిస్తుంటారు. అలాంటి దివ్య క్షేత్రమైన ఇంద్రకీలాద్రిపై జరుగుచున్న వరుస అపచారాలు భక్తుల మనోభావాలను దెబ్బతిస్తున్నాయి. పుణ్యధామంగా పేరుగాంచిన ఇంద్రకీలాద్రిపై వెలసిన అమ్మవారి మూల విరాట్ స్వరూపాన్ని చిత్రీకరించరాదని నిబంధన ఉన్నప్పటికీ కొందరు పట్టించుకోకుండా, నిబంధనలను అతిక్రమిస్తున్నారు.
ఇటీవల ఒక మహిళా భక్తురాలు కొండపైకి దర్శనానికి వచ్చి గర్భ గుడిలోని అమ్మవారి మూలవిరాట్‌ను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్టు చేసిన ఘటన చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో ఈ ఘటన వైరల్ అయినప్పటికీ ఈ తప్పు ఎలా జరిగింది అనే అంశంపై అధికారులు దృష్టి సారించకపోవడం విమర్శలకు తావిస్తోంది. దుర్గమ్మ దర్శనానికి వచ్చే సమయంలో సెల్ ఫోన్ లను అనుమతించబోమని నిబంధన ఉంది. దర్శనానికి వచ్చేవారు సెల్ ఫోన్లను డిపాజిట్ చేసేందుకు కౌంటర్లను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ నిబంధన పటిష్టంగా అమలు కాకపోవడంతో తిరిగి యధావిధిగా భక్తులంతా సెల్ ఫోన్లతో వస్తున్నారు. ఫలితంగా అమ్మవారి మూలవిరాట్ ను సైతం చిత్రీకరించే పరిస్థితి ఏర్పడిందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలను అమలు చేయడంలో అధికారుల ఉదాసీన వైఖరి వల్లనే ఈ తరహా ఘటనలు జరుగుతున్నాయని వాదన తెరపైకి వచ్చింది.
ఇప్పుడు మరో వివాదం...
ఇప్పుడు మరో అపచారం వెలుగు చూడడం భక్తులను మరింత బాధకు గురిచేసింది. దుర్గమ్మ ఉపాలయమైన నటరాజ స్వామి వెనుకనే ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలోని బలిహరణ పీఠంపై అనధికార అర్చకుడు ఎంగిలి నీళ్లను పోయడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనను స్వయంగా చూసిన భక్తులు కొందరు, సదరు అనధికార అర్చకుని ప్రశ్నించగా వారిపట్ల దురుసుగా ప్రవర్తించడాన్ని భక్తులు తప్పుబడుతున్నారు. ఎంగిలి నీళ్ల పోయడం పెద్ద తప్పు కాదంటూ బుకాయించిన అనధికార అర్చకునిపై భక్తులు దేవస్థానం ఈవో భ్రమరాంబకు ఫిర్యాదు చేయడంతో ఆమె ఈ ఘటనపై విచారణ జరిపించారు. ఇద్దరినీ పిలిపించి విచారణ చేయగా వారు అసలు ఆలయానికి సంబంధం లేని వ్యక్తులుగా గుర్తించిన ఈవో ఒకింత విస్మయానికి గురయ్యారు.
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో వాస్తవంగా విధులు నిర్వహించాల్సిన అర్చకుడు గణేష్ తాను మృత్యుంజయ హోమంలో పాల్గొనడానికి వెళుతూ కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలోని పమిడిముక్కల మండలం వీరంకిలాకులు ప్రాంతానికి చెందిన కనుపూరి సుబ్రహ్మణ్యానికి విధులు అప్పగించి వెళ్లినట్లు విచారణలో వెలుగు చూసింది. ఇదే ఆలయం దగ్గర ఉన్న నాగేంద్రస్వామి ఆలయంలో అనధికారికంగా విధులు నిర్వహిస్తున్న మరో అర్చకుడు యనమండ్ర కృష్ణ కిషోర్ కు కూడా ఆలయంతో ఎలాంటి సంబంధం లేదని గుర్తించారు.
వివరణ పత్రం రాయించుకున్న అధికారులు...
అనధికార వ్యక్తులతో పాటు ఆలయ ఉద్యోగి గణేష్ నుంచి కూడా ఈఓ వివరణ పత్రం రాయించుకున్నారు. విధులు ఎవరు నిర్వహించాలి, ఎవరు నిర్వహిస్తున్నారు. ఎవరికి ఎవరు డ్యూటీ వేస్తున్నారనే దానిపై నివేదిక ఇవ్వాలని ఈవో ఆదేశించారు. వైదిక కమిటీ జాబితాను కూడా ఇవ్వాలని అధికారులను కోరారు. ఈ తరహా ఘటనలు జరిగిన సమయంలో తూతూ మంత్రంగా హడావిడి చేయడం మినహా పూర్తిస్థాయి పర్యవేక్షణ కొరవడటం వల్లనే ఇంద్రకీలాద్రిపై వరుస ఘటనలు జరుగుతున్నాయని భక్తులు అభిప్రాయపడుతున్నారు. అమ్మవారి పట్ల అచంచలమైన భక్తి విశ్వాసాలతో ఆలయానికి వచ్చే భక్తులకు ఇక్కడ జరుగుతున్న అపచారాల పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు.