సినీ దర్శకుడు వీవీ వినాయక్ గుడివాడలో సందడి చేశారు. క్రిష్ణా జిల్లాలో మాజీ మంత్రి, వైఎస్ఆర్ సీపీ నేత కొడాలి నాని సొంత నియోజకవర్గం అయిన గుడివాడలో నిర్వహించిన జాతీయస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండ లాగుడు పోటీలు జరిగాయి. ఈ ప్రదర్శనలకు చిత్ర దర్శకుడు వివి వినాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇదే కార్యక్రమంలో ఎమ్మెల్యే కొడాలి నాని కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినాయక్‌కు మాజీ మంత్రి కొడాలి నాని స్వాగతం పలికారు. సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని దర్శకుడు వీవీ వినాయక్ చెప్పారు.
ఈ మేరకు వివి వినాయక్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో సంతోషకరమైన వాతావరణంలో ప్రజలు పండుగను జరుపుకుంటున్నారని అన్నారు. ప్రజలు అందరూ కళకళలాడుతున్నారని, చూడ్డానికి చాలా ఆనందంగా ఉందని అన్నారు. ప్రతి సంక్రాంతిని అందరూ ఇలాగే జరుపుకోవాలని ఆకాంక్షించారు. గుడివాడలో జరుగుతున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండ లాగుడు ప్రదర్శనలను తాను తొలిసారి చూస్తున్నానని అన్నారు.
కొడాలి నాని గురించి మాట్లాడుతూ.. ఆయన వల్లే తాను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానని గుర్తు చేసుకున్నారు. కొడాలి నాని తనకెంతో ఇష్టమైన వ్యక్తి అని అన్నారు. ఆయన ఎప్పుడంటే అప్పుడు ఆయన నిర్మాతగా సినిమా చేసేందుకు తాను రెడీ అని అన్నారు. ఈ ఏడాది మార్చిలోనే తాను డైరెక్ట్ చేసిన హిందీ సినిమా విడుదలవుతుందని వినాయక్ అన్నారు. హిందీ సినిమా విడుదల అయిన తర్వాత తెలుగు సినిమా చేస్తానని అన్నారు. ప్రస్తుతం వీవీ వినాయక్ తెలుగులో వచ్చిన ఛత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారు. అందులో హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్నారు.
ముగ్గురి కాంబినేషన్‌లో ‘సాంబ’
కొడాలి నాని నిర్మాతగా వీవీ వినాయక్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ‘సాంబ’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. 2004 లో ఈ సినిమా విడుదల అయింది. అంతకుముందు నుంచి వీరి మధ్య స్నేహం ఉంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలోనూ వీవీ వినాయక్ మాట్లాడుతూ.. జూనియర్ ఎన్టీఆర్, కొడాలి నాని, వీవీ వినాయక్ కాంబినేషన్‌లో సినిమా ఏదైనా రావచ్చా అంటే ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేమని వీవీ వినాయక్ అన్నారు. ఒకవేళ అవకాశం వచ్చినా రావచ్చు అందులో ఆశ్చర్యం లేదని చెప్పుకొచ్చారు. మరోవైపు, తొలి నుంచి జూనియర్ ఎన్టీఆర్‌తో, నందమూరి హరిక్రిష్ణతో ఉన్న సాన్నిహిత్యం నేపథ్యంలో ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ కనుక పార్టీ పెట్టి తనను ఆహ్వానిస్తే కచ్చితంగా తాను ఆయన వెంట నడుస్తానని కొడాలి నాని గతంలో చెప్పారు.