బెజవాడ దుర్గమ్మ.. ఈ పేరు చెబితే చాలు ఆధ్యాత్మికత ఉట్టిపడుతుంది. అదే అదే సమయంలో రాజకీయం కూడా హాట్ గా ఉంటుంది. మాజీ మంత్రి, ప్రస్తుత మంత్రి మధ్య  విభేదాలతో, ఈవో సెలవు పై వెళ్లాల్సి వచ్చిందనే ప్రచారం హాట్ టాపిక్ గా మారింది.


సెలవుపై వెళ్లిన ఈవో...
బెజవాడ దుర్గమ్మ ఆలయంలో రాజకీయంపై పలు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దుర్గమ్మ ఆలయానికి భక్తి భావంతో వచ్చే భక్తులకు సదుపాయాలు కల్పించి, ఆలయం అభివృద్ధి పని చేసిన ఆలయ అధికారులు, సిబ్బంది,రాజకీయ జోక్యంతో పని చేయాల్సిన వస్తోంది. ఇప్పటికే పలు విధాల ఆరోపణలు వ్యక్తం అయిన క్రమంలో తాజాగా ఆలయ కార్యనిర్వాహణాధికారిణి ధర్భమళ్ల భ్రమరాంబ సెలవుపై వెళ్ళటం చర్చకు దారితీసింది.


ప్రస్తుతం ఇంద్రకీలాద్రిపై ప్రస్తుత దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ఇదే శాఖకు సేవలు అందించిన మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మధ్య విభేదాల కారణంగా అభివృద్ధి జరగటం లేదనే ప్రచారం ఉంది. అంతే కాదు అధికారులపై ఒత్తిడి పెరిగిపోవటంతో, పని చేయలేని పరిస్థితులు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఇటీవలే దుర్గగుడి ఈవో కు హైకోర్టు నుంచి నోటీసులు వచ్చాయి. కరోనా సమయంలో తొలగించిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది. అయితే ఈ వ్యవహరం పైనే ప్రస్తుత మంత్రి, మాజీ మంత్రి మధ్య విభేదాలు వచ్చాయని తెలుస్తోంది. కోర్టు ఆదేశాలతో వచ్చిన వారిని తిరిగి తీసుకోవాలని మాజీ మంత్రి వెలంపల్లి ఒత్తిడి తీసుకువస్తుండగా, కోర్టు ఆదేశాల పై అప్పీలుకు వెళ్ళే విషయాన్ని పరిశీలించాలని మంత్రి కొట్టు అధికారులను ఆదేశించారని అంటున్నారు. దీంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో దుర్గ గుడి ఆలయ ఈవో సెలవులకు దరఖాస్తు చేసుకొని వెళ్లారని ప్రచారం జరుగుతోంది. 


మాజీ మంత్రి వర్సెస్ ప్రస్తుత మంత్రి....
మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆయన నియోజకవర్గం పరిధిలోనే దుర్గమ్మ ఆలయం ఉంది. దీంతో ఆయన స్థానికంగా తన పలుకుబడిని ఉపయోగించి, సీఎం కార్యాలయంలో పరిచయాలు కేంద్రంగా చేసుకొని దుర్గగుడిపై చక్రం తిప్పుతున్నారని, ప్రస్తుత మంత్రి కొట్టు సత్యనారాయణ వర్గం గుర్రుగా ఉంది. దేవాదాయ శాఖలో పని చేసిన వెలంపల్లి, ఆ శాఖ పై పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నించటం, ప్రస్తుత మంత్రిగా ఉన్న కొట్టు సత్యనారాయణను ఇరకాటంలోకి నెట్టే విధంగా ప్రతి విషయంలోనూ వెలంపల్లి జోక్యం చేసుకొని ఇబ్బందులకు గురి చేస్తున్నారనే ప్రచారం ఉంది. దీంతో దుర్గమ్మ ఆలయంలో ఇరువురు నేతల మధ్య సిబ్బంది, అధికారులు నలిగిపోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుత మంత్రి కొట్టు సత్యానారాయణ దుర్గగుడికి చెందిన కాటేజీలోనే క్యాంప్ కార్యాలయం నిర్వహిస్తున్నారు. అక్కడే గతంలో మంత్రిగా వెలంపల్లి కూడా విదులు నిర్వర్తించారు. అయితే స్థానిక శాసనసభ్యుడిగా దుర్గుగుడి కాటేజిలోనే తన కార్యాలయం పని చేయాలని వెలంపల్లి చేసిన ప్రయత్నాలకు, అధికారులు అనుమతించలేదు. దీంతో అప్పటి నుంచి వెలంపల్లి , కొట్టు సత్యనారాయణ మద్య విభేదాలు కొనసాగుతున్నాయి.


ఆరా తీస్తున్న అధిష్టానం... 
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ వ్యవహరం హాట్ టాపిక్ అవుతోంది. ప్రస్తుత మంత్రి కొట్టు సత్యనారాయణని కాదని, అదే శాఖకు గతంలో మంత్రిగా చేసిన వెలంపల్లి శ్రీనివాసరావు ఇష్టానుసారంగా వ్యవహరించటంపై కూడ పార్టీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారని స్థానికులు అంటున్నారు. అయితే వెలంపల్లి ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా కొనసాగుతుండటంతో, జిల్లాలోని మిగిలిన శాసన సభ్యులు సైలెంట్ గా ఉండాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ విషయాన్ని మంత్రి కొట్టుు సత్యనారాయణ పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.