వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి కొడాలి నాని ఎన్టీఆర్ మరణంపై చేసిన కామెంట్స్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో చర్చకు దారితీశాయి. ఎన్టీఆర్ మరణంపై అనుమానాలు ఉన్నాయని, చనిపోయిన తరువాత ఆయనకు పోస్ట్ మార్టం కూడా చేయకుండానే ఖననం చేశారని కొడాలి నాని కామెంట్స్ చేశారు. అంతే కాదు ఈ వ్యవహరంపై ప్రధాని మోదీతో పాటు, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలసి ఫిర్యాదు చేస్తానని కొడాలి నాని వ్యాఖ్యానించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ వ్యవహరం చర్చకు దారితీసింది. అయితే ఇప్పుడే ఈ వ్యవహరంపై కొడాలి నాని ఎందుకు అంతలా కామెంట్స్ చేశారనే అంశంపై అందరిలో చర్చ మొదలైంది. దీని వెనుక ఉన్న కారణాలు చర్చకు దారితీస్తోంది. ఎన్టీఆర్ మరణంపై సీబీఐ విచారణ చేయించాలని నాని డిమాండ్ అమలులోకి వచ్చే పరిస్థితులు ఉన్నాయా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
మూడు దశాబ్దాల పాటు ఆధారాలు ఉంటాయా?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పని చేసిన నందమూరి తారక రామారావు మరణించి ఇప్పటికే మూడు దశాబ్దాలు అవుతోంది. ఇప్పుడు ఆయన మరణంపై విచారణ చేయిస్తే ఆధారాలు దొరుకుతాయా? అనుమానాలను మాత్రమే కేంద్రంగా చేసుకొని , ఇప్పుడున్న పాలకులు సీబీఐ విచారణకు అంగీకరించే పరిస్థితులు ఉన్నాయా అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అంతే కాదు నందమూరి తారక రామారావు వారసులు, కుటుంబ సభ్యులు ఉన్నారు. ఆయన కుటుంబం నుంచి ఎటువంటి ప్రమేయం లేకుండా కేవలం బయట వ్యక్తులు చేసే ఆరోపణలపై ప్రభుత్వాలు స్పందించే ఛాన్స్ లేదనే వాదన వినిపిస్తోంది.
ఇదంతా డైవర్షననేనా?
మాజీ మంత్రి కొడాలి నాని వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వంపై కాని, జగన్ పై కాని ఆరోపణలు చేస్తే , ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చే వ్యక్తుల్లో టాప్ 2లో కొడాలి నాని ఒకరు. ఆయన మాట్లాడే మాటలు సంచలనంగా మారుతుండటం, రాజకీయాల్లో చర్చకు దారితీసే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇదే పరిస్థితులు ఇప్పుడు, నందమూరి తారక రామారావు మరణంపై నాని సంచలన వ్యాఖ్యలు చేయటం, వివేకా హత్య కేసును కేంద్రంగా చేసుకొని జరిగిందనే ప్రచారం పొలిటికల్ సెక్టార్ లో నడుస్తోంది. జగన్ పై ప్రతిపక్షాలు విమర్శలు చేయటం, అందులో వివేకా హత్య కేసు విషయంలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న నేపథ్యంలో కొడాలి నాని ఎంట్రీ ఇచ్చి, విషయాన్ని పొలిటికల్ గా డైవర్ట్ చేసే పనేనని ప్రతిపక్ష నాయకులు అంటున్నారు. ప్రస్తుతం అధికార పక్షానికి వివేకా వ్యవహరం అత్యంత కీలకంగా మారింది. ఇదే సమయంలో నెల్లూరు రాజకీయాలు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ట్యాపింగ్ వ్యవహరం వైసీపీకి తలనొప్పిగా మారాయి. వీటన్నింటి నుంచి డైవర్ట్ చేసే పనిలో భాగంగానే ఎన్టీఆర్ మరణ వ్యవహారం తెర మీదకు తెచ్చారా అనే ప్రచారం కూడా లేకపోలేదు.