ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన ఆయేషా మీరా హత్య జరిగి 15 సంవత్సరాలు పూర్తయింది. నేటికి బాధిత కుటుంబానికి న్యాయం జరగలేదని మహిళా సంఘాలు మండిపడుతున్నాయి.. ఏళ్లు గడుస్తున్నా కూతురు అయేషా మీరా హత్య కేసులో దోషులకు శిక్ష పడలేదని, సీఎంలు న్యాయ చేయలేదని.. సీబీఐ సైతం చేతులెత్తేసిందని ఆమె తల్లిదండ్రులు వాపోయారు. సీబీఐ విచారణ చేసినా న్యాయం జరగకపోతే ఇక ఎక్కడికి వెళ్లాలి, సుప్రీంకోర్టును ఆశ్రయించి న్యాయం చేయమని కోరతామన్నారు.


ఆనాడు సంచలనం సృష్టించిన ఘటన... 
విజయవాడ శివారు ప్రాంతంలోని ఇబ్రహీంపట్టణంలోని ప్రైవేట్ హాస్టల్ లో డిసెంబర్ 26, 2007న ఆయేషా మీరా దారుణ హత్యకు గురైంది. తన గదిలో ఉన్న ఆయేషాను బయటకు తీసుకువచ్చి బాత్ రూంలో అత్యంత కిరాతకంగా హత్య చేశారు. అత్యాచారం కూడా జరిగన ఈ ఘటనపై అప్పట్లో రాజకీయ దుమారం చెలరేగింది. కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో జరిగిన ఘటనలో అప్పటి మంత్రి కుమారుడు ప్రమేయం ఉందనే ఆరోపణలు వచ్చాయి. చివరకు పిడతల సత్యం బాబును నిందితుడిగా తేల్చిన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు.


అసలు నిందితుడు సత్యం బాబు కాదు... 
అయేషా మీరా హత్య కేసులో పితడల సత్యం బాబును నిందితుడిగా చెబుతూ పోలీసు న్యాయస్థానంలో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. అయితే సత్యం బాబు దోషి అని తేల్చేందుకు తగిన ఆధారాలు ప్రవేశపెట్టడంలో పోలీసులు విఫలం అయ్యారు. మెదటి నుంచి సత్యం బాబు నిందితుడు కాదంటూ, ఆయేషా మీరా కుటుంబ సభ్యులే చెప్పటం విశేషం. కుటుంబ సభ్యుల వాదన విన్న న్యాయ స్దాయం, అందుకు సంబంధించిన వివరాలను పోలీసుల నుంచి కోరింది. పోలీసులు ఆ వివరాలను అందించటంలో విఫలం కావటంతో సత్యం బాబును నిర్దోషిగా విడుదల చేయాలని కోర్టు తీర్పు ఇచ్చింది. పోలీసులు వైఫల్యంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. కోర్టు నుంచి విడుదల అయిన సత్యం బాబు తనకు జరిగిన అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేశారు.తనకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆ తరువాత ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లభించకపోవటంతో తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళను వివాహం చేసుకున్న సత్యం బాబు ఆర్థిక ఇబ్బందులతో జీవనం గడుపుతున్నాడు.


ఏళ్ల తరబడి శిక్ష అనుభవించి, నిర్దోషిగా తేలిన సత్యంబాబు


15ఏళ్లు గడుస్తున్నా దక్కని న్యాయం.... 
ఈ ఘటన పై ఆయేషా మీరా తల్లిదండ్రులు, మహిళా సంఘాలు నేటికి పోరాటం సాగిస్తూనే ఉన్నాయి. అసలు నిందితులను పట్టుకోవాలని డిమాండ్ చేస్తూనే వివిద రకాల నిరసనలు తెలుపుతున్నారు. అసలైన హంతకులను శిక్షించాలంటూ న్యాయం కోసం ఇంకెన్నాళ్లు పేరుతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఆయేషా మీరా తల్లి శంషాద్ బేగం మాట్లాడుతూ.. అయేషా హత్యకు గురై 15యేళ్లు అయ్యిందని సీఎంలు న్యాయం చేయలేదని, సీబీఐ న్యాయ చేయలేదని, ఇక సుప్రీంకోర్టుకు  ఐపియస్ అధికారులు ఆనంద్, ప్రస్తుత డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి కేసును తప్పు దోవ పట్టించారని ఆరోపించారు. సత్యం బాబు ను అరెస్టు చేసినా కోర్టు లో దోషిగా నిర్ధారించ లేదన్నారు. 2018 డిసెంబర్ నెలలో కేసు సిబిఐ స్వీకరించిందని, మమ్మల్ని సికింద్రాబాద్ తీసుకెళ్లి డి.యన్.ఎ టెస్ట్ చేయించారని అన్నారు. మా దగ్గర ఉన్న అన్ని వివరాలు సీబీఐకి ఇచ్చాం, మా మత పెద్దలు నాడు రీ పోస్ట్ మార్టానికి అంగీకరించ లేదు, ఆ తరువాత కోర్టు ఆదేశాలతో రీ పోస్ట్ మార్టం చేశారని వివరించారు. మూడేళ్లుగా మా పాప శరీర భాగాలు కూడా వెనక్కి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసును బైఫర్‌కేషన్ చేశామని అధికారులు అంటున్నారు. సీబీఐ కూడా అవినీతి మయం అయిపోయిందని, అందుకే మేము సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తామన్నారు. అసలైన దోషులకు శిక్ష పడి, న్యాయం జరిగే ముందుకు సాగుతామన్నారు. వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో అయేషా హత్య జరిగిందిని, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నిర్భయ తరహాలో అయేషా పేరుతో చట్టం చేయాలన్నారు. 


నేరస్థులకు శిక్ష పడేలా ప్రభుత్వం నుంచి సహకారం అందించాలని కోరారు. మహిళా సంఘం నాయకురాలు గంగా భవానీ మాట్లాడుతూ అయేషా హత్యపై న్యాయ పోరాట సమితి పేరుతో పోరాటం చేస్తున్నామని, 2007లో చనిపోయిన నాటి నుంచి  2019వరకు అనేక శాఖల అధికారులు దర్యాప్తు చేశారన్నారు. సిబిఐ విచారణ చేసినా దోషులు పట్టుకోలేక పోయారని, ఎవరి ఒత్తిడులకు లొంగారో తేల్చాలన్నారు. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం నుంచి‌ సాయం  కూడా అందించలేదన్నారు. ప్రధాని మోదీ, సీఎం జగన్ ప్రభుత్వాల పై మాకు నమ్మకం లేదన్నారు. అందుకే సుప్రీంకోర్టు లో పోరాటం చేయాలని నిర్ణయించామని, ప్రజా సంఘాలు కూడా మా పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరుతున్నట్లు చెప్పారు.


దేశంలో మైనార్టీలకు రక్షణ కరువైందని, ఇన్నేళ్ల నుంచి పోరాడుతున్న తమకు న్యాయం జరగడం లేదని అయేషా మీరా తండ్రి ఇక్బాల్ బాషా వాపోయారు. సీఎం జగన్ మహిళల రక్షణ, భద్రత కోసం చర్యలు తీసుకున్నట్లయితే తమ కూతురి హత్య కేసులో దోషులను శిక్షించి ఇప్పుడైనా న్యాయం చేయాలని కోరారు.